
జగన్ ని పులివెందుల ఎమ్మెల్యే అనొచ్చా, అంటే తప్పేంటీ అధ్యక్షా?
చట్టసభల్లో మాట్లాడుతున్న తీరు దేనికి సంకేతం అధ్యక్షా!
ఆంధ్రప్రదేశ్ చట్టసభలు చిత్రవిచిత్రాలకు నెలవులుగా మారాయి. శాసనసభ, శాసనమండలిలో సభ్యులు మాట్లాడుతున్న తీరు ఇప్పుడు వాటి గౌరవాన్ని పెంపొందిస్తాయా, తగ్గిస్తాయా అని రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 25న శాసనమండలిలో జరిగిన సంభాషణ, వాదోపవాదాలు దేనికి సంకేతం అని సందేహం వ్యక్తం అవుతోంది.
‘సూపర్-6’పై స్వల్ప కాల చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ ముఖ్యమంత్రిని “కుప్పం ఎమ్మెల్యే” అని పిలవడంతో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం కుప్పమే. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ – “ముఖ్యమంత్రి హౌస్ లీడర్. వైసీపీ సభ్యుడు ఎలా మరిచిపోతారు? కుప్పం ఎమ్మెల్యే అని పిలవడం అనుచితం, క్షమాపణ చెప్పాలి” అన్నారు.
టీడీపీ సభ్యులు తరచూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి “పులివెందుల ఎమ్మెల్యే”గా సంబోధించినందుకు ప్రతిస్పందనగా వైసీపీ సభ్యుడు రమేశ్ యాదవ్ ఈ వ్యాఖ్య చేసినట్టు కనిపిస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా పొందేందుకు అవసరమైన ఓట్లు వైసీపీకి లేని పరిస్థితిలో టీడీపీ సభ్యులు జగన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
దీన్ని తీవ్రంగా పరిగణించిన కొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడుతూ – ఇకపై ముఖ్యమంత్రి, మంత్రులను వారి నియోజకవర్గాల పేర్లతోనే పిలుస్తామని ప్రకటించారు.
“టీడీపీ నేతలు ఎప్పుడూ జగన్ మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. ఇక మేము కూడా చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే, లోకేష్‌ను మంగళగిరి ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్‌ను పిఠాపురం ఎమ్మెల్యే అని పిలుస్తాం” అన్నారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా ఈ వ్యాఖ్యలను సమర్థించారు. ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించిన అనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే అన్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అనలేదు. అందులో తప్పేముంది? అని ప్రశ్నించారు.
మాజీ ముఖ్యమంత్రిని పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అనవచ్చా?
అసెంబ్లీలో జగన్ ను 'కుప్పం–పులివెందుల' ఎమ్మెల్యేలని పిలవడం అవమానం లేక రాజకీయ వ్యూహమా? అనేది ప్రశ్న. సభ నియమావళి ప్రకారం, ముఖ్యమంత్రి ‘హౌస్ లీడర్’. అటువంటి వ్యక్తిని కేవలం నియోజకవర్గ ఎమ్మెల్యేగా సంబోధించడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని స్పష్టంగా ఉంది. అందువల్లే స్పీకర్, చైర్మన్‌లకు అలాంటి వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించే అధికారం ఉంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఆయన పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా, గతంలో ఆయన ‘ముఖ్యమంత్రి’. జగన్ ఈవేళ అధికారంలో లేకపోయినా ఓ ప్రతిపక్ష పార్టీకి నాయకుడు. ఆయన పార్టీకి 40 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. కాబట్టి అధికారిక రికార్డుల్లో ఆయనను ‘పులివెందుల ఎమ్మెల్యే’ అని మాత్రమే సంబోధించడం అనవసరమే కాకుండా, అవమానకరంగా పరిగణించే అవకాశం ఉంది.
వివాదం ఎందుకు తెరపైకి వచ్చింది?
ఈ వాగ్వాదం వెనుక ప్రధాన కారణం రాజకీయ వ్యూహమే.
టీడీపీ వ్యూహం ప్రకారం గతంలో అసెంబ్లీలో టీడీపీ సభ్యులు జగన్‌ను “పులివెందుల ఎమ్మెల్యే” అని తరచూ సంబోధించారు. దీని ద్వారా ఆయనను ముఖ్యమంత్రిగా గుర్తించకుండా, ఒక నియోజకవర్గానికి పరిమిత నాయకుడిగా చూపే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీని ఎదుర్కొనే ప్రయత్నంలో వైసీపీ కూడా అదే పద్ధతి అనుసరించింది. చంద్రబాబును “కుప్పం ఎమ్మెల్యే” అని పిలవడం ద్వారా, ఆయన ముఖ్యమంత్రి పదవిని చిన్నబుచ్చే ప్రయత్నం చేసింది.
సభా పరంపరలపై ప్రభావం
ఇలాంటి వ్యాఖ్యలు కేవలం రాజకీయ కసి తీర్చుకోవడమే తప్ప, సభ గౌరవాన్ని కించపరుస్తాయి. హౌస్‌లోని రూల్స్ ప్రకారం – ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు, మంత్రులు – వీరిని వారి అధికారిక హోదాలతోనే సంబోధించాలి. అది లేకుండా కేవలం నియోజకవర్గ ఆధారంగా పిలవడం, రికార్డులో నిలవకూడదు.
ఇది ఒక పదాల యుద్ధం మాత్రమే కాకుండా, ఆ పార్టీలు ఒకదానిపై ఒకటి వేసే ప్రతీకాత్మక దెబ్బ. రాజకీయంగా చూస్తే, నాయకుడిని కేవలం నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూపించడం అనేది, ఆయన రాష్ట్రవ్యాప్త హోదాను, ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం. కనీసం ఇలాంటి వ్యాఖ్యల ద్వారా దృష్టిని ఆకర్షించడం, తమ అసంతృప్తిని వ్యక్తపరచడం వ్యూహంగా కనిపిస్తోంది.
మరోవైపు, టీడీపీ దీన్ని సభా పరంపర అవమానం అని ప్రదర్శించి, ప్రజల్లో వైసీపీని ప్రతికూలంగా చూపించాలని ప్రయత్నిస్తోంది.
ఇకపై వైసీపీ సభ్యులు అన్ని సందర్భాల్లోనూ టీడీపీ నేతలను వారి నియోజకవర్గాల పేర్లతోనే సంబోధిస్తామని ప్రకటించారు. దీని వలన అసెంబ్లీలో తరచూ ఇలాంటి వాగ్వాదాలు రావడం ఖాయం.
అయితే, రికార్డుల దృష్ట్యా చూస్తే, ముఖ్యమంత్రిని “కుప్పం ఎమ్మెల్యే”, లేదా మాజీ ముఖ్యమంత్రిని “పులివెందుల ఎమ్మెల్యే” అని పిలవడం రెండూ సరైనవి కావు. ఇవి సభలో నిలిచే పదాలు కావు. రాజకీయ వ్యూహ పరంగా చూస్తే – ఇది ఒక పదాల యుద్ధం. ప్రత్యర్థి ప్రతిష్టను తగ్గించే ఒక ఆయుధం.
ఇలాంటి వాదాలు సభల గౌరవాన్ని నిలపేవి కావు. అందువల్లే తాజా పరిణామాలపై మండలి చైర్మన్ మోషేన్‌రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా మర్యాద పాటించేలా మండలి సభ్యులు వ్యవహరించాలని, కొందరు సభ్యులు, మంత్రులు మాట్లాడిన మాటలు రికార్డుల నుండి తొలగిస్తామని చెప్పడం సముచితం. గతంలో పదవులు, హోదాలలో పనిచేసిన వారిని గౌరవించుకోవాలి. ఓడిపోయినంత మాత్రాన గౌరవించకుండా అగౌరవంగా మాట్లాడామనం సమంజసం కాదు అన్నారు వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ.
Next Story