ప్రకృతి రమణీయత ఉట్టి పడుతుంది. మంచి వాతావరణం. పచ్చదనంతో ఇట్టే ఆకట్టుకుంటుంది. భైరవకోన శివనామ స్మరణతో మార్మోగుతుంది.
భైరవకోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో నల్లమల కొండల నడిబొడ్డున ఉన్న ఒక పవిత్ర ప్రదేశం. ఆ ప్రదేశంలో త్రిముఖ దుర్గాంబ మహాదేవి ఆలయంతో పాటు బర్గులేశ్వరి స్వామి ఆలయం ఉండటం వల్ల భైరవకోన అనే పేరు వచ్చింది. భైరవకోన నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పట్టణానికి 43 కిలో మీటర్లు ఎపిఎస్‌ఆర్‌టీసీ ఉదయగిరి డిపో భైరవకోన నుంచి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న సీతారామపురం వరకు బస్సులను అందిస్తుంది. సీతారామపురం నుంచి భైరవకోనకు షేర్ ఆటోలను తీసుకోవచ్చు. ఈ ప్రదేశంలో పురాతన శివాలయం ఉంది. 200 మీటర్ల ఎత్తు నుండి పడే జలపాతం ఉంది అక్కడ కొండపై చెక్కిన ఎనిమిది దేవాలయాలు ఉన్నాయి. భైరవకోనకు భక్తులను ఆకర్షిస్తున్న ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కార్తీక పూర్ణిమ రోజున అక్కడి ఆలయంలోని పార్వతీ దేవి విగ్రహంపై చంద్రకాంతి పడటం. ఇది ప్రకాశం జిల్లాలో అందమైన జలపాతం.
ఏక శిలపై ఎనిమిది దేవాలయాలు, శిల్పాలు చెక్కిన తీరు నాటి నైపుణ్య కళా వైభవానికి ప్రతీకగా చెప్పొచ్చు. క్రీస్తు శకం 6 నుంచి 12వ శతాబ్దం మధ్య కాలంలో పల్లవులు, తూర్పు చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అప్పట్లో ఈ రాతిపై ఎనిమిది గుహలు చెక్కినట్లు చరిత్ర కారులు చెబుతుంటారు. నేటికీ 1,400 ఏళ్ల క్రితం అంటే పంచారామ క్షేత్రాలు నిర్మించడానికి పూర్వమే తూర్పు చాళుక్యుల కాలంలో శ్రీశైలం పుణ్యక్షేత్రం తర్వాత దక్షిణా పథాన అంతటి విశిష్టమైన శైవ క్షేత్రంగా, కాపాలిక శైవానికి ప్రధాన కేంద్రంగా భైరవకోన క్షేత్రం విలసిల్లింది. నాడు ఎందరో రాజుల పోషణలో రుషులు తపో శక్తితో పూజలు చేసిన ప్రాంతమని, నేటికీ పూజలు జరుగుతున్న అత్యంత పవిత్రమైన గుహలయ పుణ్య క్షేత్రంగా భైరవ కోనను భావిస్తుంటారు.
భైరవ కోనలో స్మార్థ ఆగమ పద్దతిలో పూజలు జరుగుతుంటాయి. మధ్య యుగాలలో శైవ, వైష్ణవ ఘర్షణలు జరుగుతున్న కాలంలో హర, హరికి భేదం లేదని, స్మార్థ విధానం ప్రభోదించింది. 1 శివ 2 విష్ణు, 3 బ్రహ్మ, 4 దేవీ(త్రిముఖ దుర్గాంబ), 5 సూర్యుడు లను పూజించే విధానం స్మార్థ విధానమని అంటారు. భైరవ కోన ఆలయాల వెలుపల గొడలపై చెక్కిన విష్ణు, బ్రహ్మ శిల్పాలు అక్కడికి వచ్చే భక్తులను ఆకట్టుకుంటాయి.
ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏమిటంటే.. కొండల పైభాగం నుంచి కొండ చరియలను తాకుతూ జలం పాతం కిందకు జాలువారుతుంది. వేసవి కాలంలో సన్నటి జలప్రవాహం ఉంటుంది. వర్షాల కాలం, చలి కాలంలో భారీగా జలపాతం ఉంటుంది. దేవాలయానికి వచ్చే భక్తులతో పాటు విహారానికి కూడా వచ్చే వాళ్లు ఎక్కువుగానే ఉంటారు.
విహారంతో పాటు విజ్ఞానం, చరిత్ర గురించి తెలియజెప్పేందుకు పలు ప్రాంతాల్లోని కాలేజీల నుంచి విద్యార్థులు వస్తుంటారు. ఒక్కో సారి వందాలది మంది విద్యార్థులతో భైరవకోన జలపాతం కళకళలాడుతూ ఉంటుంది. కొండ పై భాగం నుంచి కొండ చరియలను ఆనుకొని వర్షపు జల్లుల మాదిరి పై నుంచి కిందకు నీరు పడుతున్న ప్రాంతంలో సందర్శకులు స్నానాలు చేస్తారు. ఆ సమయంలో సరదాగా స్నానం చేస్తూ, నీటిని ఒకరిపై ఒకరు చల్లు కుంటూ ఉల్లాసంగా గడుపుతారు.
ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శైవ క్షత్రంగా, పర్యాటక కేంద్రంగా భైరవకోన విలసిల్లుతోంది. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి భక్తులు, యాత్రికులు ఎక్కువుగా ఇక్కడకు వస్తుంటారు. దసరా, కార్తీక మాసం, మహాశివరాత్రి ఉత్సవాలు జరిగే సమయంలో భైరవకోన సందడిగా ఉంటుంది. మహాశివరాత్రి రోజు భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తారు. విద్యార్థులు సెలవు దినాలలో ఎక్కువుగా ఇక్కడకు వస్తుంటారు. కొంత మంది కుటుంబ సమేతంగా ప్రత్యేక వాహనాల్లో వచ్చి వెళ్తుంటారు. ఒంగోలు నుంచి కనిగిరికి వచ్చి, అక్కడి నుంచి సీఎస్ పురం, డీజీ పేట మీదుగా అంబవరం, కొత్తపల్లి నుంచి భైరవకోనకు వెళ్లాల్సి ఉంటుంది. ఒంగోలు నుంచి కనిగిరి మీదుగా భైరవకోనకు 141కిమీ దూరం ఉంది. భైరవకోనకు మరో రూటు కూడా ఉంది. ఒంగోలు నుంచి కందుకూరు వచ్చి, అక్కడ నుంచి పామూరు మీదుగా సీఎస్‌పురం నుంచి వెళ్లొచ్చు. ఈ రూటు 151కిమీ దూరం ఉంటుంది.
భైరవకోన అటవీ ప్రాంతం. పచ్చని చెట్లు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇటీవల కాలంలో వర్షాలు అధికంగా కురవడం వల్ల జలపాతానికి భారీగానే నీరు వస్తోంది. కొండపైకి ఎక్కడానికి మెట్లున్నాయి. సిద్ధు రమణారెడ్డి భైరవకోన దేవస్థానం చైర్మన్‌గా ఉన్న సమయంలో రహదారి, మెట్లు అభివృద్ధి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కొండ కింద నుంచి పై భాగానికి వెళ్లే సమయంలో మెట్లకు ఇరువైపుల పక్కకు పడిపోకుండా ఇనుప కంచె వేశారు. ఎక్కే సమయంలో రెస్ట్ తీసుకునేందుకు అవసరమైన మందిరాలు కూడా ఉన్నాయి. భైరవ కోన వద్ద మరుగుదొడ్ల సౌకర్యం కూడా ఉంది. మంచి నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు.
Next Story