తిరుపతి జిల్లాలో గ్రామీణ భారత్ బంద్
x

తిరుపతి జిల్లాలో గ్రామీణ భారత్ బంద్

భారత గ్రామీణ బంద్ నేపథ్యంలో తిరుపతి నగరంలో వివిధ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు.



భారత్ బంద్ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం నాయకుడు కందారపు మురళి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దేశంలో నరేంద్ర మోడీ కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని గ్రామీణ భారతం నిర్వీర్యం అయిపోయిందని ఆరోపించారు. అప్పుల కుంపటిగా మారిన భారతదేశంలో అదానీ, అంబానీల రాజ్యం సాగుతున్నదని అన్నారు.
దేశంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ప్రజల కొనుగోలు శక్తి పెరగలేదని, ఉపాధి లేక నిరుద్యోగులు విధుల పాలయ్యారని... మోడీ రామ మందిరం పేరిట ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి మతోన్మాద చర్యలకు పాల్పడుతూ ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహాన్ని పట్టించుకోకుండా బిజెపితో అంట కాగడం అన్యాయమని విమర్శించారు. ప్రజల ప్రయోజనాల కంటే తాము అధికారంలో కొనసాగడమే పరమావధిగా టిడిపి, వైసిపి, జనసేనలు భావిస్తూ రాష్ట్రాన్ని ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టారని తీవ్రస్థాయిలో మురళి విమర్శించారు. కరకంబాడిలో పేదలకు ఇళ్ల స్థలాల పై సాగుతున్న పోరాటాన్ని కార్మిక సంఘాలు బల పరుస్తున్నాయని కందారపు మురళి ప్రకటించారు.
ట్రాన్స్ పోర్ట్ రంగంలో న్యాయ సంహిత పేరిట కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు ఈ రంగానికి ఉరితాళ్లుగా తయా రయ్యాయని వీటిని అన్ని రంగాల ప్రజానీకం ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు,

ఈ సందర్భంగా జరిగిన సభకు సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియు నగర కార్యదర్శులు కే. వేణుగోపాల్, ఎన్డి రవి విజయ్ కుమార్ లు అధ్యక్షత వహించారు.

ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కే. సుబ్రహ్మణ్యం తదితరులు ప్రసంగించారు.

సిపిఎం సిపిఐ మద్దతు

కార్మిక సంఘాలు చేపట్టిన ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళిలు మద్దతు ప్రకటించి మోడీ జగన్మోహన్ రెడ్డి ల విధానాలను దుయ్యబట్టారు.

రైతు సంఘాల మద్దతు

ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి. హేమలత, రాష్ట్ర కార్యదర్శి ఏ. రామానాయుడు లు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.

దేశంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలు రైతుల పాలిట శాపంగా తయారయ్యాయని ఢిల్లీ నగర వీధుల్లో రైతులు చేపట్టిన ఉద్యమం మోడీని గద్దె దింపేందుకు కారణం అవుతుందని అన్నారు. భారతదేశంలో వ్యవసాయం కార్పొరేటీ కరించబడిందని రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు.

భారీ రాస్తారోకో
భారత గ్రామీణ బంద్ నేపథ్యంలో తిరుపతి నగరంలోని పూర్ణకుంభం సర్కిల్ వద్ద వేలాది మందితో భారీ రాస్తారోకో జరిగింది. శుక్రవారం నాటి ఉదయం జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి పూర్ణకుంభం సర్కిల్ వరకు భారీ ప్రదర్శన జరిగింది. అనంతరం రెండు గంటలపాటు భారీ రాస్తారోకో జరగడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలబడి పోవడంతో పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడింది.

ూ ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు టి సుబ్రమణ్యం, ఎన్ మాధవ్, యన్. , చిన్నా , బుజ్జి, రఘు ఎన్ డి శ్రీనివాసులు, కుమార్, సులోచన లీల, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జయంతి, అంగన్వాడి కార్యదర్శి నాగరాజమ్మ, జయప్రభ, సుశీలమ్మ,హమాలి రమేష్, తంజావూరు మురళి, వాసు, సుందరం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి,ఏఐటియుసి నేతలు విశ్వనాధ్, పెంచలయ్య, శ్రీనివాసులు, శ్రీరాములు ఐఎఫ్టియు నేతలు గంగాభవాని వెంకటేశు నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

కరకంబాడి పేదల భారీ ప్రదర్శన

ఇళ్ల స్థలాల కోరుతూ గత 15 రోజులుగా పోరాడుతున్న కరకంబాడిలోని పేదలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనను చేపట్టారు.

స్థానిక తిరుపతి మున్సిపల్ పార్కు వద్ద నుంచి వేలాదిమంది పేదలు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, అంగేరి పుల్లయ్య ల ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు చేతబూని శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ మీదుగా పూర్ణకుంభం సర్కిల్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు.

అనంతరం కార్మిక సంఘాలు చేపట్టిన రాస్తారోకో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వి. నాగరాజు మాట్లాడుతూ పేదలు 15 రోజులుగా కరకంబాడి గుట్టలపై రేయింబగళ్లు ఇళ్ల స్థలాలకై పోరాడుతూ ఉంటే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కళ్లప్పగించి చూస్తున్నారు తప్ప పరిష్కారం చెప్పడం లేదని అన్నారు.
పేదల పట్ల ప్రభుత్వ వైఖరి ఇదేనా? అని విమర్శించారు. పది రోజులలో సమస్య పరిష్కరించకుంటే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

గ్రామీణ పేదలు చేపట్టిన ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు హరి, ఓవి రమణ, రాజా శివానందం, సత్య శ్రీ, సెల్వరాజ్ తదితరులతో పాటు పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Read More
Next Story