అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ కీలకం: చంద్రబాబు
x

అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ కీలకం: చంద్రబాబు

ఉత్తరాంధ్రప్రదేశ్ అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ అత్యంత కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్‌లలో ఇది కూడా ఉందని ఆయన వెల్లడించారు.


ఉత్తరాంధ్రప్రదేశ్ అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ అత్యంత కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్‌లలో ఇది కూడా ఉందని ఆయన వెల్లడించారు. ఈ విమానాశ్రయ నిర్మాణంపై ఇప్పటికే కేంద్రంతో కూడా చర్చించామని, నిధులు కేటాయించడానికి ఎన్‌డీఏ కూటమి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని చంద్రాబాబు వెల్లడించారు. ఇప్పటికే భోగాపురం విమానాశ్రయం పనులను శరవేగంగా సాగిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను పరిశీలించారు. అక్కడకు చేరుకున్న చంద్రబాబుకు మంత్రులు, పార్టీ నేతలు అంతా స్వాగతం పలికారు.

పనులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు.. ఎయిర్‌పోర్ట్‌పై సెంట్రల్ ఏవియేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో కేంద్ర ఏవియేషన్ మంత్రి కింజరాపు రామానాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో విమానాశ్రయం ఉండగానే కాకినాడ, అమలాపురంలో ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని చంద్రబాబు.. అధికారులను కోరారు. అనంతరం భోగాపురం విమానాశ్రయం పూర్తి కావడానికి ఇంకెంత సమయం పట్టొచ్చని అధికారులను ప్రశ్నించగా.. 2026 నాటికి ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని, కాగా ప్రాజెక్ట్‌కు కావాల్సిన నీరు, విద్యుత్ అందించే విషయంలో సీఎం చొరవ తీసుకోవాలని జీఎంఆర్ ప్రతినిధులు కోరారు.

గ్రోత్ ఇంజిన్‌గా భోగాపురం ఎయిర్‌పోర్ట్

‘‘ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అసలు ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజిన్‌గా ఈ విమానాశ్రయం నిలుస్తుంది. రానున్న రోజుల్లో విశాఖ, విజయనగరం కలిసిపోతాయి. ఫేజ్ వన్‌లో బీచ్ రోడ్, ఫేజ్ త్రీలో శ్రీకాకుళం రోడ్డు నిర్మాణం కోసం 5వేల ఎకరాలు తీసుకోవడం జరిగింది. ఎయిర్‌పోర్ట్ పనులు ఇప్పటికే 38శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కసారి భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి అయి అందుబాటులోకి వస్తే ఇక్కడి నుంచి సుమారు 45 మిలియన్ల మంది ప్రయాణం చేస్తారు’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు.

భోగాపురానికి మంచి అవకాశాలు

‘‘పారిశ్రామికంగా ఎదగడానికి భోగాపురంకు మంచి అవకాశాలు ఉన్నాయి. హైవేల దగ్గరే కాస్తంత కనెక్టివిటీ సమస్య ఉంది. దాని పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం. ఉత్తరాంధ్రను అన్ని విధాలా అభివృద్ధి చేసి విశాఖ రుణం తీర్చుకుంటాం. భోగాపురం విమానాశ్రయంతో పాటు మరో ఐదారు ఎయిర్‌పోర్ట్‌లు రానున్నాయి. కుప్పం, దగదర్తి, నాగార్జున సాగర్‌తో పాటు మూలపేటను కూడా విమానాశ్రయాల నిర్మాణం కోసం పరిశీలిస్తున్నాం. వీటితో పాటు పలు ఇతర ప్రాంతాల్లో కూడా పరిశీలనలు చేపడుతున్నాం’’ అని చంద్రబాబు వెల్లడించారు.

Read More
Next Story