కొడుకు కోసం ఆరాటం.. కూటమికి అదే ఛాలెంజ్..
x
ప్రచారంలో భూమన కరుణాకర్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు

కొడుకు కోసం ఆరాటం.. కూటమికి అదే ఛాలెంజ్..

కుమారుడిని అసెంబ్లీకి పంపించాలని ఆ తండ్రి ఆరాటపడుతున్నారు. తనను నిర్లక్ష్యం చేసిన పార్టీకి గుణపాఠం చెప్పాలని కూటమి అభ్యర్థిని ఛాలెంజ్‌గా తీసుకున్నారు.


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: కుమారుడి కోసం ఓ తండ్రి ఆరాటం. తన స్థానంలో కుమారుని అసెంబ్లీకి పంపించాలన్న పెద్ద కోరిక కోసం ఆ తండ్రి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. తిరుపతి నగరంలో కూడా పట్టు సాధించుకొని మళ్లీ అసెంబ్లీకి వెళ్లడానికి కూటమి అభ్యర్థిని ఛాలెంజ్‌గా భావిస్తున్నారు. అధికార వైఎస్ఆర్సిపి ఆరాటానికి.. కూటమి అభ్యర్థి ఛాలెంజ్‌కి తిరుపతి అసెంబ్లీ స్థానం వేదికగా మారింది. తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

ఎన్నో అవాంతరాలు, వివాదాలను అధిగమించి జనసేన- టిడిపి - బిజెపి కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈయనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొని తిరుపతిలో పోటీ చేస్తున్న శ్రీనివాసులు ఇంకా బాలారిష్టాలు దాటని స్థితిలో ఉన్నారు. అందరి సహకారంతో గెలుపొంది, మళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.

చారిత్రక తిరుపతిలో... కుస్తీ

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో రాజకీయ చైతన్యం తక్కువేమీ కాదు. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో అధికార వైఎస్ఆర్సిపి సమరోత్సాహంతో సాగుతోంది. కూటమి పార్టీ అభ్యర్థికి ఇంటిపోరు ఇంకా కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. కూటమిలో బిజెపి మినహా టిడిపిలో కొందరు నాయకులు ఇంకా కలిసి రాలేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కూటమి అభ్యర్థి ప్రస్తుతం ఇల్లు చక్కదిద్దుకునే క్రమంలోనే ఉన్నట్లు భావిస్తున్నారు.

తిరుపతి చారిత్రక అసెంబ్లీ స్థానం నుంచి ఎందరో రాజకీయ ఉద్దండులు చక్రం తిప్పారు. 2024 ఎన్నికలకు వైయస్సార్సీపి అభ్యర్థిని నెలలకు ముందే ప్రకటించి కార్యరంగంలోకి దించారు. పొత్తులు ఆ తర్వాత సీట్ల సర్దుబాటు నుంచి కూటమి అభ్యర్థి నిర్ణయం వరకు జరిగిన వ్యవహారాల్లో ఏర్పడిన గందరగోళం ఇంకా పూర్తి స్థాయిలో కొలిక్కి రాలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో 1951లో డీలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం ఏర్పాటైన తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి 15 సార్లు జరిగిన సార్వత్రిక, ఉప ఎన్నికల్లో గెలిచిన చాలామంది రాజకీయ ఉద్దండులు కూడా తమదైన ముద్ర వేసుకున్నారు. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో ప్రస్తుతం 2,70,762 మంది ఓటర్లు ఉన్నారు.

ఉద్దండులకు నిలయం..

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు.. ప్రముఖ సినీ నటుడు ప్రజారాజ్యం అధినేత కొణిదెల చిరంజీవి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తిరుపతిలో ఒకసారి విజయం సాధించారు. గతంలో..తిరుపతిలో రెండు సార్లు గెలిచిన నాదముని రెడ్డి, పుత్తూరులో ఒకసారి గెలిచిన రెడ్డివారి రాజశేఖర రెడ్డి తండ్రి..కొడుకులు. రెండు సార్లు తిరుపతిలో గెలిచిన అగరాల ఈశ్వరరెడ్డి కొద్ది కాలం శాసనసభ స్పీకర్‌గా వ్యవహరించారు. టిడిపి, ప్రజారాజ్యం వ్యవస్థాపక అధ్యక్షులు ఇద్దరు సినీ రంగం నుండి వచ్చిన వారే. తొలి సారి తిరుపతి నుండి పోటీ చేసిన వారే కావడం విశేషం.

రాజకీయ చరిత్ర పుటల్లో..

తిరుపతి నియోజకవర్గానికి 15 సార్లు జరిగిన సార్వత్రిక, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి అయిదు సార్లు, వైసిపి ఒకసారి, స్వతంత్ర అభ్యర్థి ఒకసారి, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఇక్కడి నుంచి విజయం సాధించారు. తదనంతర పరిణామాల్లో ప్రజారాజ్యంను కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. దీంతో..ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి గెలుపొందారు.

రాజకీయ ఔదార్యం

2014 ఎన్నికల నాటికి ఇక్కడ రాజకీయ సమీకరణాల్లో మార్పులు జరిగాయి. 2014 ఎన్నికల్లో తిరుపతి నియోకవర్గంలో మొత్తం 2,90,107 ఓట్లు ఉండగా, అందులో 1,71,507 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన వెంకటరమణ కు 99,313 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన కరుణాకరరెడ్డికి 57,774 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్థి వెంకటరమణ 41,539 ఓట్ల మెజార్టీతో గెలపొందారు. అయితే, ఎన్నికైన కొద్ది కాలానికే వెంకటరమణ అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య సుగుణమ్మ టిడిపి నుండి పోటీ చేశారు. వైసిపి పోటీ పెట్టలేదు. కాంగ్రెస్ అభ్యర్థిపై సుగుణమ్మ 1,16,524 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఇది గతించిన చరిత్ర. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తిరుపతి నియోజకవర్గ స్థితిని పరిశీలిస్తే..

అభివృద్ధి పథంపై ... అవినీతి మరక

దశాబ్దాల కాల గమనంలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చాక తిరుపతిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేశారు. అదే సమయంలో అవినీతి అక్రమాలు మూటగట్టుకున్నారు. ప్రస్తుతం అధికార వైయస్సార్సీపి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన తనయుడు, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డిని ఆ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. వీరి ఏలుబడిలో అభివృద్ధి బాటలో తిరుపతి కొత్త మెరుగులు దిద్దుకుంది. తిరుపతికి ఫ్లై ఓవర్లు వేయడంతో పాటు విస్తరించిన నగరానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ అమలులో స్మార్ట్ సిటీ నిధులతో కొత్త రోడ్లు వేశారు.

అయితే నిధుల వినియోగం, కాంట్రాక్టు పనుల్లో ఆశ్రిత పక్షపాతం, అవినీతి అక్రమాలు జరిగాయనే బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి నగరంలో ప్రధాన రహదారులు నిర్మించే టీటీడీ నిర్వహణ బాధ్యతలు మున్సిపాలిటీ అప్పగిస్తుంది. ఈ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. అయితే తిరుపతి శివార్లలో "కొత్తగా నిర్మించిన రోడ్లలో కోట్లాది రూపాయలు స్వాహా చేయడంతో పాటు మాస్టర్ ప్లాన్ అమలులో ఇళ్ల కూల్చివేతలో వివక్షత చూపించారనేది బహిరంగ ఆరోపణ. టిడిఆర్ బాండ్ల జారీలో కూడా భారీ కుంభకోణం జరిగింది. ఆ బాండ్లను నిలిపివేయాలని ఇటీవల పురపాలక రాష్ట్ర మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది అంటే అవినీతి ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు.


తనయుడి కోసం..

భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే గానే కాకుండా టిటిడి చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుదీర్ఘకాలంగా కలగా ఉన్న టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయించడం, టీటీడీ అటవీశాఖ కార్మికులకు మేలు చేయడం వంటి కార్యక్రమాలతో తన తనయుడు భూమన అభినయ రెడ్డి విజయం కోసం బాటలు వేశారనేది క్షేత్రస్థాయిలో కనిపించే వాస్తవం. దీనిని ప్రచారాస్త్రంగా చేసుకొని సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన తనయుడు భూమన అధినాయక రెడ్డిని ఈసారి ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారు.

ప్రచారంలో జోష్..

ఈ సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, కుమారుడు భూమన అభినయ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రోజుకు రెండు మూడు డివిజన్లో అవిశ్రాంతంగా ప్రచారంతో ప్రతి గడప తొక్కుతున్నారు. తిరుపతి మున్సిపాలిటీ ద్వారా నగరానికి చేసిన అభివృద్ధితోపాటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.

వెంటాడుతున్న ఆరోపణలు

నియోజకవర్గం వైఎస్ఆర్సిపి లో భూమనది ఏకచత్రాధిపత్యం కావడంతో అసమ్మతి, అసంతృప్తులకు ఆస్కారం లేకుండా పోయింది. కానీ క్షేత్రస్థాయిలో.. అభివృద్ధి కార్యక్రమాల పేరిట సాగించిన పనుల్లో జరిగిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం వ్యవహారాలు వారిని వెంటాడుతున్నాయి. స్మార్ట్ సిటీ నిధులతో ప్రధానంగా మాస్టర్ ప్లాన్ అమలు ద్వారా జరిగిన పనుల్లో నష్టపోయిన పేద ప్రజలు, నివాసితులు మాత్రం ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తుంది. వీరి పరిస్థితి ఇలా ఉంటే...


కూటమిలో కనిపించని సయోధ్య

తిరుపతి అసెంబ్లీ స్థానంలో జనసేన- టిడిపి- బిజెపి కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు (జంగాలపల్లె శ్రీనివాసులు) పోటీ చేస్తున్నారు. కూటమిలో పొత్తులు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థి నిర్ణయంలో ఏర్పడిన అనిశ్చితి నుంచి ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం వరకు ఆ పార్టీ అభ్యర్థిని వెంటాడుతూనే ఉంది. తిరుపతి నియోజకవర్గంలోని 2,70,762 మంది ఓటర్లలో సగం వంతు బలిజ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఆ సామాజిక వర్గానికే చెందిన టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ, రాష్ట్ర కార్యదర్శి జి నరసింహ యాదవ్, జనసేన నుంచి ఇద్దరు అభ్యర్థులు టికెట్లు ఆశించారు.

తిరుపతి శాసనసభ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేన సాధించుకుంది. అనూహ్యంగా చిత్తూరులో తిరుగుబాటు చేసిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును తిరుపతి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఇప్పటివరకు కూటమిలో వ్యవహారాలు ఒక కొలిక్కి రాలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన వారంలో జనసేన అభ్యర్థి శ్రీనివాసులుతో టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ ఇంకొందరు నాయకులు కలిసి వచ్చారు. కూటమి పార్టీలు కూడా సమన్వయ సమావేశాలను నిర్వహించుకున్నాయి. సమావేశాలకు కొందరు మొక్కుబడిగానే హాజరయ్యారు అనేది ఆ పార్టీ నేతల నుంచి వినిపించే మాట. ఇవి పక్కకు ఉంచితే..

అధికార వైఎస్ఆర్సిపికి దీటుగా ప్రచారం చేయడంలో కూటమి పార్టీల్లో కొంత సర్దుబాటు ధోరణి లేదనే విషయం కనిపిస్తుంది. బిజెపి నుంచి జీ భాను ప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, ముని బాలసుబ్రమణ్యంతో పాటు వారి అనుచరులైన నాయకులు పాల్గొన్నారు. ఏపీ నుంచి సీనియర్ నాయకులు ఆర్సి మునికృష్ణ, రాష్ట్ర కార్యదర్శి జి నరసింహ యాదవ్ కొందరు స్థానిక సీనియర్ నాయకులు, టిడిపి డివిజన్ ప్రధాన బాధ్యులు పాల్గొన్నారు. ఇటీవల టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి కూడా జత కలిశారు.

తండ్రి వారసత్వం రాజకీయాల్లోకి వచ్చిన, తనకంటూ ప్రత్యేక వర్గం కలిగిన టిడిపి మరో సీనియర్ నాయకుడు దేవనారాయణరెడ్డి ఓటర్లను ప్రభావితం చేయగలిగిన నాయకులు కనిపించకపోవడం కూడా చర్చనీయాంశం అయ్యింది. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాలతో కొందరు నాయకులు జనసేన అభ్యర్థితో కలిసి ముందుకు సాగుతున్నారు. మినహా సంతృప్తికరమైన స్థాయిలో ప్రభావితం చేయలేకపోతున్నారని మాటలు కూడా వినిపిస్తున్నాయి. తిరుపతి నియోజకవర్గంలో అభివృద్ధి చేశాం. అంటున్న వైయస్ఆర్సీపీ అభ్యర్థిని వెంటాడుతున్న ఆరోపణలను కూటమి పార్టీ అభ్యర్థి ఎలా సొమ్ము చేసుకుంటారనేది వేచి చూడాలి.

Read More
Next Story