అనుకోకుండా నారా భువనేశ్వరి రాజకీయ ప్రసంగాలు చేశారు. ఇప్పుడు కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రతేక దృష్టి పెట్టారు.
నారా భువనేశ్వరి చంద్రబాబు వదిలిన బాణం. రాజకీయాల గురించి ఎప్పుడూ ఆలోచించని భువనేశ్వరి చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ప్రజల మధ్యకు వచ్చారు. ఇది కూడా చంద్రబాబు జైలులో ఉండి ఇచ్చిన ప్రోత్సాహంతోనే సాధ్యమైందంటారు భువనేశ్వరి. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ‘నిజం గెలవాలి’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చిది. వైఎస్సార్సీపీపై రాజకీయాస్త్రాలు సంధింస్తూ ఆమె చేసిన ప్రసంగాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 13న నాటి కృష్టా జిల్లా తిరువూరులో నిజం గెలవాలి సభ ముగిసంది. రాష్ట్ర వ్యాప్తంగా 150 సభల్లో ఆమె ఎన్నికలకు ముందు ప్రసంగించారు. 95 నియోజకవర్గాల్లో పర్యటించారు. విరామం లేకుండా పర్యటన కొనసాగించారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు బాధతో చనిపోయిన 194 బాధిత కుటుంబాల వారిని పరామర్శించి వారికి ఆర్థిక సాయం కూడా అందించారు. ఒక విధంగా భువనేశ్వరి రాజకీయాల్లో సంచలనమనే చెప్పాలి. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో ప్రజలను ఆమె సొంత మనుషుల కంటే ఎక్కువగా చూస్తున్నారు.
మంచి మనస్సుతో అడుగులు
భువనేశ్వరి మాట్లాడుతున్నంత సేపు నిశ్శబ్దం ఆ ప్రాంతాన్ని ఆవగిస్తుంది. అంటే అంత సున్నితంగా, అంత లోతైన అంశాలు చెబుతుంటారు. తన ఇంట్లో మనుమడు, కుమారుడు లోకేష్, తన భర్త చంద్రబాబు నాయుడుతో కలిసి ఎలా ఉంటారో కూడా సభల్లో చాలా చోట్ల వివరించారు. చాలా సార్లు లోకేష్ కు చెప్పే దానిని... లక్ష్యంతో ముందుకు సాగితే దేనినైనా సాధించవ్చని చెప్పాను. కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదని, కష్టంతో సాధించినప్పుడు అందులో నుంచి వచ్చే తృప్తి మరెందులో నుంచీ రాదని అన్నారు. ఆగస్టు 2వ తేదీన నాకోసం నా భర్త నారా చంద్రబాబు నాయుడు రెండు చేనేత చీరలు కొన్నారు. ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నా. నాకు చేనేత చీరలంటే ఎంతో ఇష్టం. చేనేతలు కూడా తన వృత్తి నైపుణ్యంతో ఎంతో అద్భుతంగా చీరలు నేస్తారు. వారు తయారు చేసిన చీరలు కొనడం వల్ల ఎన్నో చేనేత కుటుంబాలను ఆదుకున్న వారవుతారన్నారు.
మహిళా పాడి రైతులతో రాజకీయ ముచ్చట్లు
కుప్పం నియోజకవర్గంలోని గ్రామాలతో పాటు అమరావతి నియోజకవర్గంలోని గ్రామాల్లోనూ భువనేశ్వరి పలు వర్గాలకు చెందిన వారితో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాడికొండ నియోజకవర్గంలోని మహిళా పాడి రైతులతో ఎన్నికలకు ముందు ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా పలు రాజకీయ ముచ్చట్లు జరిగాయి. చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ వారు ఎలా వేదిస్తున్నారో చెబుతూ ఏది జరిగినా మహిళల్లో ధైర్యం ఉండాలని చెప్పారు. మగవాళ్లకంటే ఆడవాళ్లే గొప్పని చెబుతూ ఇంటి పనులు చూసుకుంటుంది. ఆర్థికంగా ఇంటిని చక్క దిద్దుతుంది. పిల్లలను పెంచడం దగ్గర నుంచి అన్నీ తానై ముందుకు సాగుతుంది. మగవాళ్లు కేవలం సంపాదనకే పరిమితమవుతారని చెప్పడంతో అక్కడి వారంతా చప్పట్లు కొట్టారు.
అమరావతి ఉద్యమ కారులకు బంగారు గాజులు ఇచ్చి...
అదే సందర్భంలో మందడం గ్రామం వెళ్లినప్పుడు అక్కడి అమరావతి ఉద్యమకారులను చూసి తన చేతి బంగారు గాజులు ఉద్యమానికి కానుకగా ఇచ్చి అక్కడి మహిళల మనసును భువనేశ్వరి దోచుకున్నారు. ఇలా ప్రతి అంశంలోనూ రాజధాని కుటుంబాలకు నారా భువనేశ్వరి దగ్గరయ్యారు. పాడి రైతులు ఎలా సక్సెస్ అవ్వాలో తెలియజేస్తూ రాజధాని గ్రామాల్లో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించి తన అనుభవాలను చెప్పారు. మహిళలు ఎప్పుడూ తమను తాము తక్కువ చేసుకోకూడదు. అవకాశాలు ఇవ్వాలేకానీ ఆడవారు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి పలు సందర్భాల్లో అన్నారు. వారు ఎప్పుడూ డబ్బు కోసం దేహీ అనకూడదని అభిప్రాయపడ్డారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా డ్వాక్రా మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ మగవాళ్లదేముంది... ఉద్యోగం చేయడం, ఇంటికొచ్చి భార్య వండింది తిని కూర్చోవడమే కదా అన్నారు. ఆడవాళ్లు అలా కాదు... ఒంటి చేత్తో ఏకకాలంలో 10 పనులు చక్కబెట్టగలరని, మగవాళ్లతో సమానంగా ఉద్యోగాలు చేస్తూనే ఇంటి బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తున్నారని, పిల్లల చదువులు చూసుకుంటున్నారని వివరించారు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు.
మహిళలను డ్వాక్రాకు ముందు, ఆ తర్వాతగా చూడాలి
మహిళలు అన్ని రంగాల్లో మగవారిని మించి విజయాలు సాధించాలని చంద్రబాబు గారు కోరుకుంటూ ఉంటారు. మహిళలు డబ్బు కోసం ఇబ్బంది పడకూడదని, వారు ఆర్థికంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతోనే డ్వాక్రా సంఘాలు స్థాపించారు. డ్వాక్రా ఏర్పాటుతో మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు. ఒకప్పుడు వందా, రెండు వందల కోసం ఇతరులపై ఆధారపడిన స్త్రీలు నేడు బ్యాంకు లావాదేవీలు స్వయంగా చూసుకునే స్థాయికి చేరారంటే అది చంద్రబాబు గారు తీసుకొచ్చిన డ్వాక్రాతోనే సాధ్యమైంది. చంద్రబాబు గారిని అక్రమ కేసుతో అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు నా వెంట మహిళా లోకం నడిచింది. రాష్ట్ర మంతటా మహిళలు పెద్దఎత్తున బయటకు వచ్చి సంఘీభావం తెలిపారు. నాకు హెరిటేజ్ బాధ్యతలు అప్పగించి పారిశ్రామికవేత్తను చేసింది చంద్రబాబు గారే. నేను ఇవాళ వేలమందికి ఉపాధి కల్పిస్తున్నానంటే అందుకు చంద్రబాబు గారి ప్రోత్సాహమే కారణమని అన్నారు.
నిజం గెలవాలి సభల ద్వారా ఉపన్యాసాలు మరింత మెరుగు పరుచుకున్నారు..
ఎన్నికలకు ముందు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంలో వెంకటపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ భువనేశ్వరిని ప్రశ్నిస్తూ మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ భర్త ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరెందుకు రాజకీయాల్లోకి రాలేదంటూ ప్రశ్నించారు. ఆమె ప్రశ్నకు భువనేశ్వరి సమాధానమిస్తూ నేనెప్పుడూ రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. అసలు రాజకీయాలపైనే ఆసక్తి లేదు. అనవసరంగా చంద్రబాబునాయుడును జైల్లో పెట్టారు. 53 రోజులు జైల్లో ఉంచారు. జైల్లో ఉండగా చంద్రబాబునాయుడు పిలిచి నాకోసం మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పారు. అందువల్ల రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ‘నిజం గెలవాలి’ పేరుతో నాలుగు మాటలు వారికి చెబుతున్నానని చెప్పడం పలువురి దృష్టిని ఆకర్షించింది.
కుప్పంలో అభివృద్ధి పరుగులు
కుప్పం నియోజకవర్గంలో మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు అనేక కంపెనీలు వస్తున్నాయి. శాంతిపురంలో పెద్ద కంపెనీ రాబోతోంది. దాని వల్ల మహిళలకు ఉపాధి లభిస్తుంది. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నాము. మీకు ఎటువంటి సాయం కావాలన్న అడగండి. మహిళలకు చేయి అందించి పైకి తెచ్చేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము అన్నారు భువనేశ్వరి. పట్టణంలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. మహిళలకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు భువనేశ్వరి చెప్పారు. చిరు వ్యాపారస్తులకు సైకిళ్ళు తోపుడుబండ్లను వితరణగా అందజేశారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో విద్య, ఉపాధి, వైద్యం రంగాలకు సంబంధించి ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. మహిళలకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు తోడ్పాటుగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. మౌలిక వసతులు, ఇళ్ల స్థలాలు, ఉపాధి అవకాశాలు, బిడ్డలకు ఉద్యోగాలు కావాలని ఎక్కువగా డిమాండ్ వినిపిస్తోందని చెప్పారు భువనేశ్వరి. ప్రజలు కోరుకున్న విధంగానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధి చెందాలని రేయింబవవళ్లు శ్రమిస్తున్నారని తెలిపారు.
ఆకట్టుకుంటున్న భువనేశ్వరి మాట తీరు
మహిళలను ఆకట్టుకునే విధంగా ఆమె ప్రసంగాలు ఉంటున్నాయి. మహిళలను చైతన్య వంతం చేయడంతో పాటు ఎలా చేసుకుంటూ పోతో అందరితో సమానంగా అడుగులు వేస్తారో చెబుతున్నారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలొ అభివృద్ధి పనులపై దృష్టి కేంద్రీకరించాను. చంద్రబాబు రాష్ట్రమంతా పనిచేయాలి. లోకేష్ మంత్రిగా తన బాధ్యతలు నిర్వహించాలి. అందుకే కుప్పం అభివృద్ధి బాధ్యతను తాను తీసుకున్నాను. ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుని అవి ప్రభుత్వం ద్వారా వచ్చే విధంగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. కుప్పం నియోజకవర్గానికి ఎంఎల్సీ శ్రీకాంత్ ఇన్చార్జ్ గా ఉన్నారు. భువనేశ్వరి నియోజకవర్గంలో పర్యటించినన్ని రోజులు ఆమెతో పాటే ఉంటారు. ఎప్పటికప్పుడు కుప్పం సమస్యలు ఏమి ఉన్నా భువనేశ్వరికి తెలియజేస్తుంటారు. గతం కంటే కుప్పం అబివృద్ధిపై దృష్టి ఎక్కువైంది. ఎందుకంటే చంద్రబాబు గతంలో పెద్దగా కుప్పం అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. అన్ని నియోజకవర్గాలతో సమానంగానే చూస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిరుద్యోగులకు కోచింగ్, పలు అంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. అందుకు అయ్యే ఖర్చులన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ భరిస్తోంది.
కుప్పం... మంగళగిరి..
తల్లి భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి పెట్టారు. మంగళగిరిలో అభివృద్ధిపై కుమారుడు లోకేష్ దృష్టి పెట్టారు. నేరుగా తమ ఇంటి వద్దనే వారానికి ఒక్కరోజు ప్రజల నుంచి లోకేష్ అర్జీలు స్వీకరిస్తున్నారు. సీఎం క్యాంపు ఆఫీసు వద్దకు ఎక్కువ మంది జనం రావడం మంచిదని కాదని చెబుతున్నా లోకేష్ పట్టించుకోలేదు. ప్రజలకు ఎప్పుడూ చేరువలో ఉండటమే లక్ష్య మంటున్నారు. ఈ అంశాలపై భువనేశ్వరి శనివారం కుప్పంలో మాట్లాడుతూ నాకు, నా కుమారుడు లోకేష్ కు మధ్య నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో పోటీ పడిందని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ రెండు నియోజకవర్గాలు రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు.
నియోజకవర్గ పర్యటన సమయంలో భువనేశ్వరి అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు. వేల మంది జనం మధ్యలో ఉన్నా ఏ మాత్రం విసుక్కోకుండా అడుగులు వేస్తూ అర్జీలు తీసుకుంటున్నారు. తీసుకున్న ప్రతి అర్జీకి తాను జవాబుదారిననే విధంగా ఆమె ఆ అర్జీలు చదువుతున్నారు. కుప్పంలో నూరు శాతం ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎక్కడంటే అక్కడ కూర్చోవడం, అక్కడ ఉన్న వారితో మాట్లాడటం, వారి సమస్యలు తెలుసుకోవడం అక్కడి వారిలో ఆనందాన్ని నింపుతోంది. ఇప్పటి వరకు ఇట్లా ఎవ్వరూ మాతో మాట్లాడలేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు.