TIRUPATI STAMPEDE: రేపు తిరుపతికి సీఎం రాక
వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ వ్యవహారంలో విషాదం చోటు చేసుకుంది.
తిరుపతి తొక్కిసలాటలో అరుగురు మృతి చెందిన సంఘటన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు తిరుపతి వస్తున్నారు. ఇది ఇలా ఉంటే తిరుపతి తొక్కిసలాట మృతుల సంఖ్య ఏడుకు పెరిగినట్లు తెలిసింది. నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు (51), విశాఖకు చెందిన రజని (47),లావణ్య(40), శాంతి( 34), కర్నాటకలోని బళ్లారికి చెందిన నిర్మల (50) గా గుర్తించారు. ఇదేవిధంగాశ్రీనివాసం వద్ద ఏర్పాటుచేసిన కేంద్రం వద్ద అస్వస్థత వల్ల తమిళనాడు సేలంకు చెందిన మల్లిక (49) అనే మహిళ చనిపోయిందని అధికారులుచెప్పారు.
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సిఎం సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో రివ్యూ చేసిన సీఎం చంద్రబాబు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమన్న సిఎం చంద్రబాబు. విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలు
తిరుమల శ్రీవారిని ఉత్తరద్వారం(వైకుంఠ ద్వారాలు) దర్శనం చేయించేందుకు వీలుగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇంకొన్ని గంటల్లో ద్వారా తెరుచుకోనున్నాయి అనగా అంటే బుధవారం రాత్రి తిరుపతిలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. తిరుపతి ఆర్టీసీ బస్ స్టేషన్‌కు సమీపంలోని శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఊపిరి ఆడక ఆరుగురు మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు...అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారని సిఎం ప్రశ్నించారు. ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని ముఖ్యమంత్రిప్రశ్నించారని తెలిసింది. మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పున:సమీక్షించాలన్నారు. రేపు ఉదయం తిరుపతికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారని తెలిసింది.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి నుంచి రెండు రోజులు మాత్రమే ద్వారాలు తెరిచేవారు. అందులో భాగంగా ఈ ఏడాది తొమ్మివ తేదీ(గురువారం) వేకువజామున ద్వారాలు తెరుచుకోనున్నాయి. వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి సామాన్య యాత్రికులకు కూడా సామాన్య యాత్రికులకు కూడా దర్శనం కల్పించాలనే లక్ష్యంగా ఈ వైకుంఠ ద్వారాలు పది రోజులూ తెరిచి ఉంచే ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా తిరుపతిలో తొమ్మిది కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రం వద్ద మొత్తం 90 కౌంటర్లను ఏర్పాటు చేశారు.
ఘటన ఎలా జరిగింది?
వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఏర్పాట్లు, యాత్రికులకు వసతి దాదాపు 5 లక్షల మందికి దర్శనం కల్పించడానికి వీలుగా టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వ్యవహారంలో టీటీడీలో పనిచేస్తున్న అధికారులు, ఇతర సిబ్బందిని మమేకం చేయడంలో టిటిడి విఫలమైనట్లు తాజా ఘటన స్పస్టం చేస్తోంది. నెల రోజుల పాటు వరుస భేటీలు, సమీక్షలు, పరిశీలనలు నిర్వహించినా తొక్కిసలాటను నివారించడంలో ఘోరంగా విఫలమయ్యారనే విమర్శ వస్తున్నది.
మొదటిసారి విషాదం
టీటీడీ ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరిచి యాత్రికులకు దర్శనం కల్పించేది. అయితే గతంలో తోపులాటలు, తొక్కిసలాటలు వంటి ఘటనలకు కేవలం తిరుమలలోని క్యూలలో కనిపించేవి. ఈ ఏడాది మాత్రం తొలిసారి తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దు దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. టీటీడీ చరిత్రలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం.
వైకుంఠఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారం దర్శనకోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద, తిరుమలలో ఒక చోట మొత్తం కేంద్రం భక్తులకు టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఈ నెలలో 10,11,12 తేదీలకు సంబంధించి టెకెన్లను ఇవ్వాలని టిటిడి నిర్ణయించింది. గురువారం అంటే 9 వతేదీన ఉదయం 5 గంటలనుంచి టోకెన్లు ఇవాల్సి ఉంది. దీనితో భక్తులు పెద్దఎత్తున టోకెన్ల కోసం ఈ కేంద్రాలకు తరలి వచ్చారు. బుధవారం సాయంకాలానికి తిరుపతి ఈ భక్తులతో కిటకిటలాడింది. మొత్తం నాలుగు చోట్ల , జీవకోన, బైరాగి పట్టెడ, శ్రీనివాసం, అలిపిరివల్ల తొక్కిసలాట జరిగింది. మొదట బుధవారం రాత్రి ఏడుగంటల సమయంలో జీవకోన వద్ద జిల్లా పరిషత్ పాఠశాల వద్ద తోపులాట జరిగింది. అయితే, దీనిని పోలీసులు అదుపులోకి తీసుకువచ్చారు. దీనితర్వాత బైరాగి పట్టెడలో తొక్కిసలాట మొదలయింది. పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులను అదుపుచేసేందుకు వారందరిని పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి మళ్లించారు. అయితే, రాత్రి 8.15 సమయంలో ఇందులో ఉన్న ఒక భక్తుడు అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైద్య సేవలు అందించేందుకు అధికారులు గేట్లు తెరిచారని, దీనిని టోకెన్లు ఇచ్చేందుకు గేట్లు తెరిచినట్లు భావించిన భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఫలితంగా చాలా మంది కిందపడ్డారు. నలిగిపోయారు, ఉపిరాడక స్పృహతప్పారు.కొందరు చనిపోయరు. వారిని ఆసుప్రతికి తరలిస్తుండగానే మొదటనలుగురు చనిపోయారని తెలిసింది.
ఈ విషాద ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. మృతుల బంధువులు కూడా ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించడానికి సీఎం చంద్రబాబు గురువారం తిరుపతికి రానున్నట్లు సమాచారం అందింది.