‘కిడ్నీని అందుకే అమ్ముకోవాలనుకున్నా’.. అసలు విషయం చెప్పిన మధుబాబు
x

‘కిడ్నీని అందుకే అమ్ముకోవాలనుకున్నా’.. అసలు విషయం చెప్పిన మధుబాబు

ఆర్థిక ఇబ్బందుల వల్లే మధుబాబు కిడ్నీ అమ్ముకోవాలనుకున్నారా? మధు ఆరోపణలపై డాక్టర్ శరత్ బాబు ఏమన్నారు? అసలు మన చట్టం ఏం చేప్తోంది?


విజయవాడలో ఇటీవల జరిగిన కిడ్నీ ముఠా మోసం సంచలనంగా మారింది. గుంటూరుకు చెందిన మధుబాబు అనే వ్యక్తిని మోసం చేసి కిడ్నీ కాజేశారు. కిడ్నీ దానంగా ఇస్తే రూ.30 లక్షల ఇస్తామని ఆశ చూపిన ముఠా.. ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్నాక మొండిచేయి చూపింది. బంధువుగా కిడ్నీ ఇచ్చావు నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అంటూ మధ్యవర్తిగా వ్యవహరించిన బాషా అనే వ్యక్తి మధుబాబును బెదిరించాడు. దీంతో మోసపోయానని గుర్తించిన మధుబాబు.. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. మధ్యవర్తి బాషా సహా డాక్టర్ శరత్‌బాబుపై ఫిర్యాదు చేశాడు మధుబాబు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి కీలక అంశాలు వెలుగు చూశాయి. అసలు కిడ్నీ అమ్ముకోవాలని మధుబాబు ఎందుకు ఆలోచించాడు? డాక్టర్ ఏమంటున్నారు? అన్న అంశాలు తాజాగా బయటకొచ్చాయి.

అందుకే కిడ్నీ అమ్మాలనుకున్నా..

‘‘నాపేరు మధుబాబు.. నాకు వివాహమైంది. తల్లీదండ్రి లేరు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి వివిధ వ్యాపారాలు చేశారు. వాటిలో నష్టం వచ్చింది. అదే సమయంలో కరోనా కూడా వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దాంతో బతుకు బండిని లాగడానికి ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా అప్పులు చేశాను. వాటిని తీర్చడం చాలా కష్టంగా మారిపోయింది. అప్పుడే నాకు ఫేస్‌బుక్‌లో బాషా అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కిడ్నీ దానం చేస్తే డబ్బులు వస్తాయని అతడే నాకు చెప్పాడు. అది కూడా రూ.30 లక్షలు అనడంతో నా కష్టాలు తీరతాయని, కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతానని ఆశపడ్డాను. అతడు చెప్పిన దానికి ఓకే చెప్పాను. బాషా ద్వారా వెంకట్ అనే మరో వ్యక్తితో మాట్లాడాను. తన వద్ద రోగి ఉన్నాడు.. అతడికి కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇస్తామని వెంకట్ కూడా నమ్మబలికాడు. చివరకు రోగి బావ సుబ్రహ్మణ్యాన్ని పరిచయం చేశారు. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అన్నీ సరిపోయేలా ఉండటంతో తొలుత రూ.59 వేలు ఇచ్చారు’’ అని వివరించారు మధుబాబు.

అన్నీ మార్పించారు

‘‘కిడ్నీ ఇవ్వాలంటే సమీప బంధువై ఉండాలన్నారు. దానికి తగ్గట్టుగా నా ఆధార్ కార్డును కూడా మార్పించారు. తల్లిదండ్రులు లేకపోవడంతో ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం నకిలీ పత్రాలను కూడా సృష్టించారు. ఎడమవైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పి సంతకాలు తీసుకున్నారు. జూన్ 15న సర్జరీ చేసి కుడివైపు కిడ్నీ తీసుకున్నారు. ఆ కిడ్నీని వెంకటస్వామి అనే వ్యక్తికి మార్చారు. ఆ తర్వాత ఒప్పందం ప్రకారం రూ.30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా తొలుత ఇచ్చిన రూ.59 వేలు కాకుండా మరో రూ.50వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇదేంటని రోగి బంధువు సుబ్రహ్మణ్యం, మధ్యవర్తి వెంకట్, వైద్యుడు శరత్‌బాబును నిలదీస్తే చాలా నిర్లక్ష్యంగా బదులిచ్చారు. కిడ్నీ తీసిన వాళ్లం ప్రాణాలు తీయడం పెద్ద లెక్క కాదంటూ బెదిరించారు. దాంతో చేసేదేమీ లేక తిరిగి గుంటూరు చేరుకున్నాను. ఇక్కడ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి నాకు జరిగిన అన్యాయాన్ని, ప్రజల ఇబ్బందులను ఆసరాగా తీసుకుని నడుస్తున్న కిడ్నీ ముఠా గురించి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాను’’ అని చెప్పారు మధుబాబు.

వాటిలో నిజం లేదు: డాక్టర్

‘‘నాపై మధుబాబు చేస్తున్న ఆరోపణల్లో రవ్వంత వాస్తవం కూడా లేదు. కిడ్నీ మార్పిడి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే జరిగింది. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం కంచడం గ్రామానికి చెందిన వెంటస్వామికి గత నెలలో కిడ్నీ మార్పిడి చేశాం. వెంకటస్వామి కుటుంబ మిత్రుడైన మధుబాబు కిడ్నీ దానం చేశారు. కిడ్నీ విక్రయాలపై వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదు’’ అని శరత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ అధినేత డాక్టర్ శరత్ బాబు వెల్లడించారు.

Read More
Next Story