గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి బీజేపీ వ్యూహం మార్చింది. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి కాకుండా ఏళ్ల తరబడి పార్టీ కోసం పని చేసిన వారికి అవకాశం కల్పించింది.


ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో కూటమి నుంచి బీజేపీకి మంత్రి పదవి కేటాంపుల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సీనియర్‌లుగా ఉన్న నేతలు, గతంలో మంత్రులుగా చేసిన వారికి కాకుండా ఏళ్ల తరబడి బీజేపీ కోసం పని చేసిన కేడర్‌కు మంత్రి పదవులు కేటాయించారు. కేంద్ర బీజేపీ పెద్దల సూచనల మేరకే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని బీజేపీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారికి కాకుండా బీజేపీ చెందిన సొంత కేడర్‌కు చెందిన నేతలకు మంత్రి పదవులు కేటాయించాలనే సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన సత్యకుమార్‌ యాదవ్‌కు రాష్ట్ర కేబినెట్‌లోను, నరసాపురం నుంచి తొలి సారి ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కినట్లు ఆ పార్టీలో టాక్‌ నడుస్తోంది. సత్యకుమార్‌ యాదవ్‌కు చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో వైద్య, ఆర్యో శాఖతో పాటు వైద్య విద్య శాఖ మంత్రిగా అవకాశం కల్పించగా, శ్రీనివాస వర్మకు మోదీ కేబినెట్‌లో బొగ్గు, భారీ పరిశ్రమలు శాఖ సహాయమంత్రిగా అవకాశం కల్పించారు. ఇలా బీజేపీ కోసం ఏళ్ల తరబడి పని చేసిన సొంత కేడర్‌కు మంత్రి పదవులు ఇప్పించడం ద్వారా తమ పార్టీ కేడర్‌ను, కార్యకర్తలు, నేతలను కాపాడుకోవడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని డెవలప్‌ చేసుకోవచ్చనే ఆలోచనలతోనే ఆ పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది.

కైకలూరు బీజేపీ ఎమ్మెల్యేగా రెండో సారి గెలుపొందిన కామినేని శ్రీనివాస్‌ తొలుత తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గతంలో ఆ పార్టీ ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. 2009లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కైకలూరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. 49,372 ఓట్లతో రెండో స్థానంలో నిలచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అయినప్పటికీ చిరంజీవితో పాటు ఉంటూనే కాంగ్రెస్‌లో కొనసాగారు. తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. కాంగ్రెస్‌ను వీడాలనుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థిగా కైకలూరు అసెంబ్లీ నుంచి బరిలోకి గెలుపొందారు. నాడు ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న బీజేకీ రెండు మంత్రి పదవులు కేటాయించారు. పైడికొండల మాణిక్యాలరావుకు, కామినేని శ్రీనివాస్‌కు మంత్రి పదవులు దక్కాయి. అయితే వీరిలో మాణిక్యాలరావు తొలి నుంచి బీజేపీ కేడర్‌కు సంబంధించిన నేత కాగా, కామినేని శ్రీనివాస్‌కు బీజేపీ కేడర్‌కు సంబంధించిన నేత కాదు. వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరిన నాయకుడు. చంద్రబాబు నాయుడుతో ఉన్న సాన్నిహిత్యంతో కామినేనికి మంత్రి పదవి దక్కిందని అప్పట్లో చర్చ జరిగింది. ఈ సారి కూడా చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ అవకాశం దక్క లేదు.
కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా తొలి నుంచి బీజేపీ కేడర్‌ నుంచి వచ్చిన నేత కాదు. సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. సుజనా గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ను నెలకొల్పి పారిశ్రామిక వేతగా ఎదిగిన సుజనా చౌదరి టీడీపీలో చేరారు. ఆ పార్టీలో వివిధ హోదాల్లో పని చేసిన సుజనా చౌదిరికి 2010లో తొలి సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో రెండో సారి టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభపక్ష నాయకుడిగా పని చేశారు. తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. నాడు ఎన్‌డిఏ భాగస్వామి కావడంతో టీడీపీ నుంచి సుజనా చౌదరికి మంత్రిగా అవకాశం కల్పించారు. 20 జూన్‌ 2019లో టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. నాడు టీడీపీ ఎంపీలుగా ఉన్న సీఎం రమేష టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావులతో కలిసి జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈయన కూడా మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ అవకాశం దక్క లేదు.
సత్యకుమార్‌ యాదవ్‌ తొలి నుంచి బీజేపీ భావజాలం కలిగిన వ్యక్తి. 1993లో బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు వద్ద వ్యక్తిగత సహాయకుడిగా చేరారు. తర్వాత ప్రైవేటు కార్యదర్శిగాను, అదనపు ప్రైవేటు కార్యదర్శిగాను, సీనియర్‌ ప్రైవేటు కార్యదర్శిగా, ఉప రాష్ట్రపతిగా ఉన్న సయమంలో వెంకయ్యనాయుడుకు ఓఎస్‌డీగా కూడా పని చేశారు. దాదాపు 25 ఏళ్ల పాటు వెంకయ్యనాయుడు వద్ద పని చేశారు. తర్వాత 2018లో బీజేపీలో చేరారు. తర్వాత ఆ పార్టీకి జాతీయ కార్యదర్శిగా పని చేశారు. అనంతరం కేరల, కర్నాటక వంటి రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ పరిశీలకుడిగాను, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర సహ ఇన్‌చార్జిగాను, ఆండమాన్‌ నికోబార్‌ దీవులకు కూడా ఇన్‌చార్జిగా పని చేశారు. 2024 ఎన్నికల్లో «కూటమి నుంచి దర్మవరం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
మోదీ కేబినెట్‌లో మంత్రిగా స్థానం దక్కించుకున్న భూపతిరాజు శ్రీనివాస వర్మది కూడా బీజేపీ కేడర్‌కు సంబందించిన నేపథ్యమే. 1988 సాధారణ బీజేపీ కార్యకర్తగా బీజేపీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా యువ మోర్చా అధ్యక్షుడిగాను, తర్వాత అదే జిల్లాకు బీజేపీ కార్యదర్శిగా పని చేసిన శ్రీనివాస్‌ వర్మ రెండు సార్లు అదే జిల్లాకు బీజేపీ అధ్యక్షుడుగా పని చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగాను ఉన్నారు. 2009 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నరసాపురం పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి ఓడి పోయారు. భీమవరం పురపాలక సంఘం ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచి ఇన్‌చార్జిగా పని చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పని చేశారు. తాజాగా జరిగిన 2024 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మోదీ మంత్రి వర్గంలో బొగ్గు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా చోటు దక్కించుకున్నారు.
Next Story