కూటమికి మతం మత్తు
x

కూటమికి "మతం" మత్తు

మత ప్రాతిపదికన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామనే బిజెపి నేతల మాటలు రాష్ట్రంలో కూటమికి పెద్ద అవరోధంగా మారాయి. దీనిని వైఎస్ఆర్సీపీ సొమ్ము చేసుకోవాలని చూస్తోంది.


ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలు ముస్లిం మైనార్టీల నాలుగు శాతం రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాని, కేంద్ర హోంమంత్రి ప్రకటనలు " రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామి అయిన టిడిపి- జనసేనపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య వేసిన పిటిషన్‌ను ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

" అధికారంలోకి రాగానే ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తాం" అని తెలంగాణ రాష్ట్ర పర్యటనలో కేంద్రమంత్రి అమిత్ షా. అంతకుముందు.. దేశంలో ముస్లింల జనాభా పెరిగిందని చెప్పడమే కాకుండా, ఎన్ఆర్సీ, యూసీసీ, సీఏఏ అమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలతో ముస్లిం మైనార్టీ సమాజం కలవరానికి గురైంది. ఈ వ్యవహారం నేపథ్యంలో నష్ట నివారణ కోసం.. టిడిపి చీఫ్ చంద్రబాబు ఏమన్నారంటే..

" ముస్లింల మనోభావాలను కాపాడేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అంశం సుప్రీం కోర్టులో ఉంది. ఎంతమంది లాయర్లను పెట్టయినా సరే పోరాడతాం" అన్నారు. "నాలుగేళ్లలో సీఏఏ, ఎన్ఆర్‌సీ బిల్లులు ఆమోదం పొందడానికి మీరే కదా మద్దతు పలికింది. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అనుకూలంగా మాట్లాడలేదా?’’ అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. " ఆరు నూరైనా సరే. ముస్లిం రిజర్వేషన్లు కాపాడుతాం. ఇందుకోసం ఎంతవరకైనా పోరాడుతాం" అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో చేసిన వ్యాఖ్యలు ముస్లిం మైనార్టీ వర్గాలకు ఊరట ఇవ్వడమే కాకుండా, కూటమి పార్టీలను ఆత్మరక్షణలో పడేశాయి.

పిటిషన్ వేయించింది.. మీరే కదా?

" ముస్లింలకు మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్ రద్దు చేయాలంటూ అధికార పార్టీ తమ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించలేదా?’’ అని మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ప్రశ్నించారు. ‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16, సబ్ క్లాజ్ 4 ప్రకారం ముస్లిం రిజర్వేషన్ అంశం రాష్ట్రానికి సంబంధించినది. ముస్లింలలో అత్యధిక శాతం విద్య, ఉపాధి, ఆరోగ్య, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారనే ఈ రిజర్వేషన్‌ ఇచ్చారు" అని ఇక్బాల్ గుర్తు చేశారు.

‘‘చంద్రబాబు పాలనలో నేను మైనార్టీ కమిషనర్‌గా, సెక్రటరీగా పనిచేశాను. ఆ సమయంలో చంద్రబాబు ముస్లింల రిజర్వేషన్ల పరిరక్షణ కోసం రూ.5 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు. సుప్రీం కోర్టులో ప్రముఖ లాయర్లను పెట్టారు’’ అని గుర్తుచేశారు. ‘‘ముస్లిం వ్యతిరేకయిన ఆర్. కృష్ణయ్య వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదు. దీనికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు జవాబు చెప్పాలి’’ అని ఇక్బాల్ నిలదీశారు.

,

టిడిపికి "జమాత్" మద్దతు

"ఈ ఎన్నికల్లో టిడిపికి అండగా నిలవాలని ఇటీవల గుంటూరులో జరిగిన జమాత్ - వుల్మ్ - ఏ - హింద్ తీర్మానించింది’’ అని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు మౌలానా సూహైబ్ కాసిమే తెలిపారు. టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడును ఇటీవల ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి మద్దతు కూడా తెలిపారు. "ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం టిడిపి ప్రభుత్వలంలో హజ్ హౌస్లు, షాదీఖానాలు, ఉర్దూఖార్లు, నిర్మించడం, పేద ముస్లింల వివాహాలకు దుల్హన్, విదేశీ విద్యకు వూతం, ఉర్దూకు ద్వితీయ భాషా హోదా, కర్నూలులో ఉర్దూవర్సిటీ ఏర్పాటుతో ముస్లింలకు మేలు జరిగింది’’ అని ఆయన గుర్తు చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా బిజెపి అమలు చేస్తామని చెబుతున్న కొన్ని చట్టాలు. నాలుగు శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ..

ఫత్వా జారీ..?

"బిజెపితో పాటు ఆ పార్టీ వెంట ఉండే వారిని కూడా తిరస్కరించాలి" ఢిల్లీ ఇమామ్ నుంచి రాష్ట్రంలోని ఫిర్ఖాలకు ఫత్వా కూడా జారీ అయినట్లు సమాచారం. రాష్ట్రంలోని 61 నియోజకవర్గాల్లో గెలుపు- ఓటమిని శాసించే స్థాయిలో ముస్లిం ఓటర్లు ఉంటే, వారికి టిడిపి మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది. వైఎస్ఆర్‌సీపీ మాత్రం ఏడుగురికి అవకాశం కల్పించింది. బిజెపి పెద్దల మాటలతో ఆందోళన చెందుతున్న ముస్లిం మైనార్టీ వర్గాలు ఆత్మరక్షణలో పడ్డాయి. ఢిల్లీ ఇమామ్ నుంచి ఫత్వా జారీ అయినట్లు సమాచారం. రాయలసీమలో రాయచోటి, కర్నూల్‌తో పాటు మరో ఫీర్కా ద్వారా మిగతా ప్రాంతాలకు సందేశం వెళుతుంది. ఆ మేరకు ఇటీవల రాయచోటి ఫిర్కా నుంచి ముగ్గురు ప్రతినిధులు మదనపల్లి, పీలేరు, తంబళ్ళపల్లెకు కూడా వెళ్లి మసీదులో బయాన్ (సందేశం) ఇచ్చారని విశ్వసనీయ సమాచారం.

‘‘ముస్లిం సమాజానికి ప్రమాదకరంగా మారిన బిజెపికి ఓటు వేయవద్దని వారు సూచించారు. వైయస్సార్సీపీకి అనుకూలంగా ఓటు వేయాలనే వారి మాటలకు అభ్యంతరం వ్యక్తం అయ్యింది" అని ఆ ప్రాంత ముస్లింలు ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. ఈ విషయంపై ఆ ప్రాంత మతపెద్ద తమీం మాట్లాడేందుకు కాస్త భయపడినట్లు కనిపించింది. దీనిపై ఒక ఎన్నారై మహమ్మద్ షఫీ మాట్లాడుతూ.. " రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారింది" అని వ్యాఖ్యానించారు. మసీదుల్లో ప్రార్థన అనంతరం జరిగే బయాన్ (ధార్మిక సందేశం)లో బిజెపి, కూటమి, వైయస్ఆర్సీపీకి ప్రత్యామ్నాయంగా ఓటు వేయాలి అనే అంశం చర్చకు వచ్చినట్లు ఆయన చెప్పారు.

ఎన్ఆర్సికి మద్దతు ఇచ్చింది ఎవరు

గత ఐదేళ్లలో రాష్ట్రంలోని అధికార వైఎస్ఆర్సిపి పరోక్షంగా బీజేపితో అంటకాగుతూనే ఉంది. కేంద్రం ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలన్నిటికి "నో" అనకుండా సంపూర్ణ సహకారం కూడా అందించింది. పార్లమెంటులో ఎన్ఆర్సి, సీఏఏ చట్టాలు కావడానికి వైఎస్ఆర్సిపి ఎంపీలు ఓటు కూడా వేశారు. వారి సహకారం లేకుండా ఆ చట్టాలు రూపుదిద్దడం సాధ్యమవుతుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కూటమిలోని జనసేన, టిడిపి నాయకులు విఫలం చెందారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశాలను ముస్లిం మైనార్టీ వర్గాలు కూడా పట్టించుకోవడం లేదు. అనే భావన కూడా వ్యక్తం అవుతోంది.

మాటలు కూడా ఉన్నాయి. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో బిజెపి పెద్దల మాటలు ముస్లింలకు శూలల మాదిరి గుచ్చుకుంటూ ఉంటే, తెర వెనుక వైఎస్ఆర్సిపి పార్లమెంట్లో అందించిన సహకారాన్ని విస్మరించాయి. అనే మాటలు కూడా లేకపోలేదు. "ఢిల్లీ ఇమామ్ నుంచి.. జారీ చేసే ఆదేశాలు రాయలసీమలోని కర్నూలు, రాయచోటి నుంచి వెళ్లే ప్రతినిధులు మసీదుల్లో వినిపిస్తారు. అని పీలేరు ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ జాకీర్ హుస్సేన్ చెప్పారు. జమాత్ కూడా వారి ద్వారానే జరుగుతూ ఉంటుంది. " అధికార పార్టీకి ఓటు వేయాలనే వారి సూచనలను మా ప్రాంతంలో తిరస్కరించారు" అని ఆయన గుర్తు చేశారు.

ఆ సెగ్మెంట్లలో నిర్ణేతలు

రాష్ట్రంలో ఓటర్లు కొన్ని నియోజకవర్గాల్లో శాసిస్తారు. ప్రతి సెగ్మెంట్లో 30 వేల నుంచి లక్ష వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. రాయలసీమలోని కడప జిల్లా రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్లో సుమారు లక్ష మంది వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. కడపలో సుమారు 90 వేలు, రాజంపేటలో దాదాపు 70 వేలు, మైదుకూరులో 30 వేల ముస్లిం ఓటర్లు ఉన్నారు. పొద్దుటూరులో 55 వేలు, కమలాపురంలో 70 వేల ఓటర్లు ఉన్నారు.

కర్నూల్లో 85 వేలు, నంద్యాలలో 75 వేలు, ఆదోని, ఆళ్లగడ్డలో 55 నుంచి 60 వేలు, డోన్‌లో 30 వేలు, శ్రీశైలంలో 47 వేల మంది, బనగానపల్లెలో 40 వేల మంది, పాణ్యంలో 50 వేల ఓటర్లు ఉన్నట్లు సమాచారం. అనంతపురం అసెంబ్లీ స్థానంలో కూడా 55 వేలు. గుంతకల్లులో 45 వేలు, హిందూపురంలో 55 వేలు, కదిరిలో 60 వేలు, నెల్లూరు జిల్లాలో 60 వేలకు పైబడే ఉండగా, చిత్తూరు జిల్లా పీలేరు, మదనపల్లి, పుంగనూరు, పలమనేరు లో 45 వేలు, తంబళ్లపల్లెలో 30 వేలు, తిరుపతిలో 40 వేల మంది ఓటర్లు ఉన్నారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని దాదాపు 60 వేల మంది ఓటర్లు ఉన్నారు. గురజాల పొన్నూరు సత్తెనపల్లి నియోజకవర్గాల్లో 35 వేలు గిద్దలూరులో 30 వేలు, పెనమలూరు 40 వేలు పెదకూరపాడులో 30 వేలు, పులివెందులలో 30 వేలు ఉన్నారు. మచిలీపట్నంలో 40, మంగళగిరిలో 32 కోవూరులో 32 గన్నవరంలో 35 వేలు గుడివాడలో 33 వేలు, విశాఖపట్నంలో 35 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. చంద్రగిరిలో 25 వేలు, ధర్మవరంలో 22వేల మంది ముస్లిం ఓటర్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంత భారీ సంఖ్యలో ఓటర్లు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వారికి దక్కింది మూడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే. దీనిపై ఓ న్యాయవాది ప్రశ్నలు సంధించారు

బాబుకు రెండు ప్రశ్నలు..

2019 వరకు ముస్లిం రిజర్వేషన్లపై ఎవ్వరికీ ఎటువంటి అనుమానాలు లేవు. కేంద్ర హోంమంత్రి అమిషా 2023 నుంచి ప్రతి మీటింగ్‌లో రిజర్వేషన్ రద్దు చేస్తాం అని ప్రకటిస్తున్నారు" అని అనంతపురం జిల్లాకు చెందిన అడ్వకేట్ హబీబుల్లా గుర్తు చేశారు. ఆ మాటలు ఖండించలేదు. వారితోనే జతకట్టారు. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఎలా నమ్మాలి" అని హబీబుల్లా ప్రశ్నించారు. మంత్రిమండలిలో ఒక ముస్లింకు అవకాశం లేదు. మైనార్టీ శాఖను పల్లె రఘునాథరెడ్డికిచ్చిన మిమ్మల్ని ఎలా నమ్ముతాం" అన్నారు.

2024 ఎన్నికలకు కూటమి, అధికార వైఎస్ఆర్సిపి ముస్లింలకు ఇచ్చిన సీట్లు వేళ్ళ మీద లెక్కించే స్థాయిలోనే ఉన్నాయి. ముస్లింల జనాభా, ఓటర్లకు ఆ సీట్లు ఏమాత్రం పొంతన కాదు. వైఎస్ఆర్సిపి 2019 ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు ఐదు సీట్లు కేటాయించింది. 2024 ఎన్నికలకు ఆ సంఖ్య ఏడుకు పెంచింది. తెలుగుదేశం పార్టీ మూడు సీట్లు మాత్రమే కేటాయించింది. అంటే రెండు పార్టీలు ముస్లింలను ఓటర్లుగా పరిగణిస్తున్నాయి. జనాభా ఓట్ల దామాషాలో సీట్లు మాత్రం కేటాయించలేదు.

సానుకూలంగా మార్చుకోవాలని..

బిజెపి పెద్దల మాటలు రాష్ట్రంలో కూటమి నేతల డోలాయమాన పరిస్థితిని వైఎస్ఆర్సిపి అనుకూలంగా మార్చుకోవాలని ముస్లింలను మానసికంగా సిద్ధం చేసింది. "రాష్ట్రంలో కూటమికి ఓటు వేస్తే బిజెపికి ఓటు వేసినట్లే. సీఏఏ, ఎన్ఆర్సిని స్వాగతించినట్లే" అని పీలేరు ప్రాంతంలో కరపత్రాలు కూడా పంపిణీ చేశారు. " రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని 50 మైనార్టీ సంఘాల నాయకులు విజయవాడలో ఇటీవల తీర్మానించారు" అని జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ చెప్పారు. మత పెద్దలు, సామాజిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ తీర్మానం రాష్ట్రంలోని అన్ని ముస్లిం సంఘాలకు పంపుతామని" ఆయన వెల్లడించారు.

Read More
Next Story