ప్రజలు తమ కుటుంబాన్ని దీవించి ఆరు సార్లు అవకాశమిచ్చారు. ఆ అవకాశాలను ప్రజలకు సేవ చేసేందుకే వినియోగించామని మంత్రి లోకేష్ అన్నారు.
కూటమి ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబు నాయుడు పైన బ్లూ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ విషయం చిమ్ముతోందని, తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు ఎలాంటి విషపు రాతలు రాశారో.. ఇప్పుడూ అలాగే విషపు రాతలు రాస్తోందని మండిపడ్డారు. బ్లూ మీడియాలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. తమ పరువుకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించారని సాక్షి మీడియాపై రూ. 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విచారణకోసం శుక్రవారం ఆయన విశాఖ కోర్టుకు హాజరయ్యారు. విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను నవంబరు 15కి వాయిదా వేసింది. అనంతరం విశాఖలో మాట్లాడుతూ గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం తమపై ఏ ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేక పోయిందన్నారు. ప్రజలు తమ కుటుంబాన్ని దీవించి ఆరుసార్లు అవకాశం ఇచ్చారని, ప్రజలు ఇచ్చిన ఆ అవకాశాలను వారికి సేవ చేసేందుకే వినియోగించామని అన్నారు. తమ ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాసినా, దుష్ప్రచారం చేసినా తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.