‘రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరందించాలన్న సీఎం ఆలోచన భేష్’
x

‘రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరందించాలన్న సీఎం ఆలోచన భేష్’

నదుల అనుసంధానం అంశంపై ప్రజా సంఘాలు తమ అభిప్రాయాలు తెలిపే అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబును బొజ్జ దశరథ రామిరెడ్డి కోరారు.


రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీరందించడం కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. అదే విధంగా నదుల అనుసంధానంపై రాయలసీమ ప్రజాసంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి సూచించారు. కృష్ణా జలాల సద్వినియోగానికి రాయలసీమ ప్రాజెక్టుల అసంపూర్ణ మౌలిక నిర్మాణాలను పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జలసంరక్షతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక రాయలసీమ పర్యావరణ పరిరక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి కోరారు. ఈ మేరకు తన అభిప్రాయాలను సీఎంకు రాసిన లేఖలో పొందుపరిచారు బొజ్జా దశరథరామిరెడ్డి. గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్ళించి నదుల అనుసంధానం ద్వారా రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరందించాలనుకోవడం చాలా మంచి ఆలోచన అని కొనియాడారు.

‘‘గోదావరి నదీ జలాలను పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా నదికి, అక్కడి నుంచి వైకుంఠపురం బ్యారేజికి మళ్ళించడం ద్వారా రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరందించాలన్న ముఖ్యమంత్రి సంకల్పాన్ని స్వాగతిస్తున్నాం. 815 టీఎంసీలకు పైగా కృష్ణా జలాలు సముద్రంలో చేరుతున్నాయి. అందుకు రాయలసీమ సాగునీటి నిర్మాణాల దుస్థితే కారణం. అసంపూర్ణంగా ఉన్న రాయలసీమ సాగునీటి నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటిని పూర్తిచేయాలి. ఆపై రాయలసీమ హక్కుగా ఉన్న కృష్ణా జలాలను వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలి. కృష్ణా జలాల నీటి లభ్యత ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టుల మౌలిక నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటం వల్ల, శ్రీశైలం రిజర్వాయర్ విధివిధానాలను సక్రమంగా అమలు కాకపోవడం వల్ల ఆయకట్టుకు నీరందకపోవడంపై దృష్టి పెట్టాలి’’ అని ఆయన కోరారు.

‘‘నాగార్జున సాగర్ దిగువ నుండి ప్రకాశం బ్యారేజి వరకు కృష్ణా డెల్టాకు చట్టబద్దంగా లభించే 101 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టా వినియోగించుకోకపోవడం వల్ల ఒకవైపు ఈ జలాలు వృధాగా సముద్రం పాలవుతుంటే, మరొకవైపు ఇదే కృష్ణా డెల్టా పరిరక్షణ కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని తరలించడం వల్ల శ్రీశైలం రిజర్వాయర్‌పై ఒత్తిడి పెరగుతోంది. దాంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఆయకట్టుకు సాగునీరు లభించడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టైల్పాండ్ ద్వారా గోదావరి జలాలను సాగర్ ఆయకట్టుకు అందించేలాగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. అయినప్పటికీ దానికి బదులుగా పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్ళించే కార్యక్రమం చేపడుతున్న ప్రభుత్వం.. గోదావరి జలాలను నాగార్జునసాగర్‌లో నిల్వ ఉంచి సాగర్ ఆయకట్టుకు నీరు అందించాలి. అలా చేయడం ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌ను పూర్తిగా వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు వినియోగించేలాగా ప్రణాళిక చేపట్టాలని కోరారు’’ అని వివరించారు బొజ్జా దశరథరామిరెడ్డి.

‘‘రాయలసీమలో సాంప్రదాయక సాగునీటి వనరులైన చెరువుల పరిరక్షణ చేపట్టాలి. దాంతో పాటుగానే పెన్నా, దాని ఉపనదుల పునరుజ్జీవం కోసం ప్రత్యేక రాయలసీమ పర్యావరణ పరిరక్షణ కమిషన్ ఏర్పాటు చేయాలి. ప్రతి ఎకరాకు నీరు అందించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధించి, సంపద సృష్టించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టే దశలో రాయలసీమ ప్రజా సంఘాల సూచనలు, అభిప్రాయాలను వెల్లడించడానికి ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వాలి’’ అని బొజ్జా దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Read More
Next Story