వీడియోపై బొలిశెట్టి క్లారిటీ.. ‘నా ఉద్దేశ్యం అదే’
x
Source: Twitter

వీడియోపై బొలిశెట్టి క్లారిటీ.. ‘నా ఉద్దేశ్యం అదే’

జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మరో వీడియోను షేర్ చేశారు. ఉదయం పోస్ట్ చేసిన తన వీడియోను వక్రీకరించారని అన్నారు.



జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఈరోజు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు. ఎన్నికల టికెట్ దక్కకపోవడంపై ఈరోజు ఆయన ట్విట్టర్‌లో షేర్ చేసుకున్న వీడియోనే అందుకు కారణం. ఆ వీడియోలో ఒకవైపు తనకు టికెట్ దక్కలేదని నిరాశ వ్యక్తం చేస్తూనే మరోవైపు పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం జరగుతుందని చెప్పారు. ఆయన షేర్ చేసిన ఈ వీడియో తీవ్ర చర్చలకు దారితీసింది.

తీవ్ర అసంతృప్తితో ఉన్న బొలిశెట్టి పార్టీ మారినా మారతారని కొందరు జోస్యం చెప్తే మరికొందరు మాత్రం ఆయనను ఓదార్చేలా స్పందించారు. తాజాగా కొద్దిసేపటి క్రితమే ఆయన సోషల్ మీడియాలో మరో వీడియోను షేర్ చేసుకున్నారు. అందులో ఉదయం తాను పెట్టిన వీడియో వక్రీకరించబడిందని, తన ఉద్దేశం అది కాదని స్పష్టతనిచ్చారు. ఉదయం పెట్టిన పోస్ట్ ఉద్దేశం, వార్తల్లో వస్తున్న విషయం ఒకటి కాదని వ్యాఖ్యానించారు. మేమంతా జనసైనికులమేనని, పవన్ ఏం చెప్పినా, చేసినా ఆయన బాటలోనే నడుస్తామని తేల్చి చెప్పారు. ఎందరో ఆశావహులను శాంతిపర్చడానికి పెట్టిన వీడియోను వక్రీకరించారు, జగన్‌ను ఇంటికి పంపే ప్రక్రియలో మేము పవన్ కల్యాణ్‌కు ఇప్పటికే బలమే, బలహీనత కాదు.. కాబోము అని ఆయన వ్యాఖ్యానించారు.



175 సీట్లలో పోటీ అయితే అంతా హ్యాపీ


ఉదయం నేను పెట్టిన వీడియోను మా కూటమి వ్యతిరేక మీడియా వక్రీకరించిందని బొలిశెట్టి విమర్శించారు. అందుకే మరో వీడియోను పెడుతున్నానని వ్యాఖ్యానించారు. ‘‘పదేళ్లుగా పవన్ కల్యాణ్‌ను ఫాలో అవుతున్న వారు పదవులకు ఆశపడి కాదు. పవన్ సిద్ధాంతాలు నచ్చి ఆయనను ఫాలో అవుతున్నారు. ఐఏఎస్ అధికారి శివశంకర్ కూడా అలానే జనసేనలో చేరారు. రాజకీయాలు వద్దనుకుని ఉంటే ఆయన కలెక్టర్‌గా బోగాలు అనుభవిస్తుండే వారు. కానీ పవన్ సిద్ధాంతాలు, భావజాలాలు నచ్చడంతో వాటన్నింటినీ వదిలేసి ఆయన జనసైనికుడిగా మారారు’’అని గుర్తు చేశారు.

‘‘ ‘కూటమి వల్ల నేను చాలా నష్టపోయాను’ అని ఈరోజు సభలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ క్లారిటీగా చెప్పారు. అక్కడ ఆయన ఉద్దేశం నేను అంటే జనసేన, కార్యకర్తలు అంతా అని. ఒకవేళ మొత్తం 175 సీట్లలో పోటీ చేయాల్సి వస్తే అంతా హ్యాపీగా ఉండేవారు. ఇంకా కొత్త అభ్యర్థుల కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చేది. అయినా ఇలాంటి రాక్షసుడు(జగన్) నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి కూటమి కట్టారు. బీజేపీతో కలవడం టీడీపీకి, టీడీపీతో చేతులు కలపడం బీజేపీకి ఇష్టం లేదు. కానీ వారిద్దరినీ కన్విన్స్ చేసి పొత్తు కుదిర్చింది పవన్. అందుకు రాష్ట్రాన్ని కాపాడాలన్న ఉద్దేశమే ప్రధాన కారణం. అందుకు ఆయనకు తోడుగా మేము ఎప్పటికీ ఉంటాం. ఆయన మాటే వేదంగా నడుచుకుంటాం’’అని ఆయన వీడియోలో స్పష్టం చేశారు.




Read More
Next Story