ఆశా నిరాశల మధ్య.. బొలిశెట్టి సత్యనారాయణ
x
Source: Twitter

ఆశా నిరాశల మధ్య.. బొలిశెట్టి సత్యనారాయణ

టికెట్ లభించకపోవడంపై జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. పార్టీ కోసం పడిన కష్టానికి గుర్తింపు దక్కలేదన్నారు.


ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పార్టీలన్నీ ఒకరి తర్వాత ఒకరుగా తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా కలిసి పోటీ చేస్తున్నాయి. కాగా వీరి పొత్తుతో గెలుపు అవకాశాలు పెరిగినా పార్టీ నేతలకు మాత్రం కొత్త తలనెప్పులే వచ్చాయి. ఇన్నాళ్లూ తమకే టికెట్ వస్తుందని భావించిన నేతలకు పొత్తు వల్ల నిరాశ ఎదురైంది. దీంతో టికెట్ దక్కని నేతలు కొందరు బహిరంగంగా ఆగ్రహం, అసమ్మతి వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం బాధను సుతిమెత్తగా వ్యక్తపరుస్తున్నారు.

జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఈ మార్గాన్నే ఎన్నుకున్నారు. తనకు టికెట్ లభించలేదన్న బాధను ఆయన సోషల్ మీడియా వేదికగా వెలిబుచ్చుకుంటున్నారు. కానీ ఈ పోస్ట్‌లో ఆయన వ్యాఖ్యలు ఆశ నిరాశకు మధ్య ఉన్నాయి. పార్టీ కోసం తాను పడిన కష్టానికి గుర్తింపు దక్కలేదని ఓవైపు నిరాశ వ్యక్తం చేస్తూనే మరోవైపు అందరికీ న్యాయం జరుగుతుందని ఆశా దృక్పథం కనబరుస్తున్నారు.
పడిన కష్టానికి గుర్తింపు లేదు
దశాబ్ద కాలంలో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని గుర్తు చేశారు బొలిశెట్టి. సంపాదన, కుటుంబాన్ని కాదని పార్టీ సిద్ధాంతాలు, బలోపేతం కోసం అహర్నిశలు తాను పడిన కష్టాన్ని కూడా గుర్తించలేదని సోషల్ మీడియా పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. దశాబ్ద కాలం పాటు పార్టీ కోసం సమయం, ధనం వెచ్చించినా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదని, ఆఖరికి ఈ విషయంపై తనను పిలిచి కూడా పార్టీ పెద్దలు మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు సంయమనం కావాలని తెలిపారు.
‘‘మన ప్రభుత్వం వస్తుంది. అందరికీ న్యాయం జరుగుతుంది. కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తుంది. ప్రతి ఒక్కరి కష్టానికి గుర్తింపు లభిస్తుంది’’అని ఆయన ఓవైపు నిరాశ మరోవైపు ఆశావహ దృక్పథంతో ఆయన పెట్టి పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన పెట్టిన పోస్ట్‌పై స్పందిస్తున్న జనసైనికులు బొలిశెట్టిని ఓదారుస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు. పార్టీ అంటే కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని, వాటికి సమయం వచ్చినప్పుడు ప్రతి ఫలం దక్కుతుందని కొందరంటే పార్టీ బలోపేతమే పరమావధిగా పనిచేసిన బొలిశెట్టి వంటి నాయకునికి టికెట్ ఇవ్వకపోవడం దారుణమని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read More
Next Story