‘ఉద్యోగులనే దోషులను చేస్తున్నారు’.. రెవెన్యూ ఘటనలపై బొప్పరాజు ఫైర్
x

‘ఉద్యోగులనే దోషులను చేస్తున్నారు’.. రెవెన్యూ ఘటనలపై బొప్పరాజు ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ సదస్సులకు వేళయింది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని, వీటిలో రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.


ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ సదస్సులకు వేళయింది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని, వీటిలో రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సదస్సుల్లో భాగంగానే రెవెన్యూ శాఖలో ఆన్‌లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారుపై అధికారులు గ్రామస్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. వైసీపీ పాలనలో రెవెన్యూ పరంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ సదస్సుల్లో గ్రామ స్థాయి అధికారులు, కలెక్టర్ కూడా పాల్గొంటారని చెప్పారు.

ఉద్యోగులను తప్పుబట్టొద్దు..

‘‘ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్‌గా మార్చాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటిని అమలు చేసేలా అధికారులపై ఒత్తిడి కూడా చేశారు. ప్రతి రోజూ టార్గెట్‌లు పెట్టి మరీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేశారు. ఫ్రీ హోల్డ్‌ ప్రక్రియలో తప్పులున్నాయని కూటమి ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఇందులో ఉద్యోగుల తప్పేమీ లేదు. ప్రభుత్వ తప్పులకు ఉద్యోగులను నిందించడం సరికాదు.ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వ ఆదేశాలను ఉద్యోగులు పాటిస్తారే తప్ప కావాలని తప్పు చేయరు. కానీ కావాలని తప్పులకు పాల్పడిన ఉద్యోుగలను మాత్రం కూటమి సర్కార్ వదిలి పెట్టదు. కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

సదస్సులను సక్సెస్ చేస్తాం

సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే రెవెన్యూ సదస్సులను విజయవంతం చేస్తామని బొప్పరాజు వెల్లడించారు. రెవెన్యూ రికార్డులు అన్నింటిని అప్‌డేట్ చేయడానికి ఈ సదస్సులు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సుల్లో స్వీకరించే ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రతి ఉద్యోగి కూడా రెవెన్యూ శాఖ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని తెలిపారు. రాష్ట్రంలో అనేక రెవెన్యూ శాఖ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని, రికార్డుల భద్రతను ప్రత్యేకంగా రికార్డు అసిస్టెంట్‌కు కేటాయించాలని తెలిపారు.

భయబ్రాంతుల్లో ఉద్యోగులు..

ఈ సందర్భంగానే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక ఘటనల్లో ప్రభుత్వ ఆదేశాలను శిరాసావహించినా ఆఖరుకు ఉద్యోగులే దోషులు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొందని, అనే ఘటనల్లో ఉద్యోగులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాని వల్లే ఎక్కడ ఏం జరుగుతుందో అని ఉద్యోగులంతా కూడా భయబ్రాంతులకు గురవతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో రెవెన్యూ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని, అక్కడ పత్రాలు భద్రంగా ఉంటాయా అని ఆయన ప్రశ్నించారు.

అసలు ఆ వ్యవస్థ ఉందా?

‘‘ఉద్యోగులు అందరూ భయబ్రాంతులకు గురవుతున్నారు. కావాలని ఏ ఉద్యోగి కూడా ఏ ఫైల్‌ను తగలబెట్టడు. మదనపల్లి ఫైల్స్ దహనం కేసు విచారణలో ఉంది. ఇంతలోనే ఉద్యోగులపై ఆరోపణలు చేయడం సరికాదు. ఫైల్స్ దగ్దమైన ఘటనలో దోషులు ఉద్యోగులే అన్న రీతిలో చిత్రీకరిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఎక్కడైనా దస్త్రాలను భద్రపరిచే వ్యవస్థ ఉందా? రికార్డుల భద్రతకు ఏ ఆఫీసులో అయినా ఒక అధికారి అనే వారు ఉన్నారా? పాత భవనాల్లో రికార్డులు భద్రంగా ఉంటాయా?’’ అని ప్రశ్నలు గుప్పించారు బొప్పరాజు.

ఈ సందర్భంగానే ‘ఫ్రీ హోల్డ్ భూముల’ రిజిస్ట్రేషన్ ఆపాలన్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. గత ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఆ లావాదేవీల్లో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న రెవెన్యూ సదస్సులను సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించారు. ఐఆర్సీ, 12వ పీఆర్సీ ప్రకటించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Read More
Next Story