ఆర్‌పీఐ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీరాభిమాని బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అదుపులోకి తీసుకున్న గుంటూరు నల్లపాడు పోలీసులు అక్కడే ఉంచి రహస్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడుగా ఉన్నప్పటికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వీరాభిమానిగా తనను ప్రకటించుకున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో బోరుగడ్డ అనిల్ రెచ్చిపోయాడు. టీడీపీ నేతలతో పాటు వైఎస్ జగన్‌ను వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని సామాజిక మాధ్యమాల వేదికగా దుమ్మెత్తి పోశారు. బూతులు తిడుతూ విడుదల చేసిన వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను కూడా ఆయన వదల్లేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వీడియోలు ఇప్పటి చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే సీఎం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బోరుగడ్డ అనిల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయితే తల్లికి ఆరోగ్యం బాగలేదని తెలుసుకున్న ఆయన అజ్ఞాతం వీడి బుధవారం గుంటూరుకు వచ్చారు. ఇదే అదునుగా భావించిన గుంటూరు నల్లపాడు పోలీసులు అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.