నేను లోకల్...నన్నే గెలిపించండి..
నగరానికి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు చంటిగాడు లోకల్.. ఇది ఓ సినిమాలో డైలాగ్.. సినిమాల్లోనే కాదు ఎన్నికల ప్రచారంలోనూ ' లోకల్ ' ట్రెండ్ నడుస్తోంది.
తంగేటి నానాజీ విశాఖపట్నం
విశాఖ లోక్‌సభ స్థానానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్థానిక, స్థానికేతర అంశం తెరపైకి వస్తూనే ఉంది. ప్రస్తుతం ఇదే కీలక అంశంగా మారింది. అభ్యర్థుల ప్రచారం కూడా స్థానికత చుట్టూనే తిరుగుతుంది. అయితే నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు చూసుకుంటే స్థానికుల కంటే ఎక్కువమంది స్థానికేతర్లకే విశాఖ ప్రజలు పట్టం కట్టారు.
ఇది నియోజకవర్గ ప్రస్థానం...
విశాఖ లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తొలిసారి ఎన్నికల్లో విశాఖ ప్రజలు స్వతంత్ర అభ్యర్థులకు పట్టం కట్టారు. లంక సుందరం, గంటం మల్లు దొర ఈ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు వెళ్లారు. అనంతరం 20 ఏళ్ల పాటు భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికవుతూ వచ్చారు. 1957లో పూసపాటి విజయరామ గజపతిరాజు, 62లో మహా రాజ్ కుమార్,71 లో తిరిగి మళ్లీ పూసపాటి విజయ గజపతిరాజు, 77లో ద్రోణం రాజు సత్యనారాయణలో ఎన్నికయ్యారు. 1980లో కాంగ్రెస్ తరపున కొమ్మూరు అప్పలస్వామి ఎన్నిక కాగా... తొలిసారిగా టిడిపి అభ్యర్థి బట్టం శ్రీరామ్మూర్తి 1984లో ఎన్నికయ్యారు. నాటినుండి నేటి వరకు ఈ నియోజకవర్గంలో లోకల్ అభ్యర్థి విజయం సాధించిన దాఖలాలు లేవు. 1989 లో ఉమా గజపతిరాజు, 1991లో మళ్లీ ఎన్ వి ఎస్ మూర్తి, 1996, 1998లో టి సుబ్బరామిరెడ్డి, 2004లో ఎన్ జనార్దన్ రెడ్డి, 2009లో దగ్గుబాటి పురందరేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో ఎం వివి సత్యనారాయణలు ఎన్నికయ్యారు. అయితే వీరిలో ఒక్కరు లోకల్ కాకపోవడం విశేషం.
మెట్టినింటికి పేరు తెచ్చేందుకు పుట్టింటి నుండి పోటీ...
విశాఖ పార్లమెంటు నియోజకవర్గం బొత్స ఝాన్సీకి పుట్టినిల్లు. ఆమె పుట్టిల్లు గాజువాక సమీపంలోని శ్రీహరిపురంలో ఉంది. బొత్స సత్యనారాయణ తో వివాహం జరిగాక ఆమె మెట్టినిల్లు అయిన విజయనగరం వెళ్లారు. అక్కడ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా, పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని అధిష్టానం ఎంపిక చేయడంతో మళ్లీ పుట్టింటిలో పోటీ చేస్తున్నట్టు అయింది. దీంతో బొత్స ఝాన్సీకి పాత పరిచయాలు, పాత బంధుత్వాలు తిరిగి కలుస్తున్నాయి.
నేను లోకల్ నాకే ఓటేయండి...
విశాఖ పార్లమెంటు స్థానానికి వైసీపీ తరఫున బొత్స ఝాన్సీ పేరు ఖరారు చేసినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. సిరిపురం జంక్షన్ లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన ఆమె తన సెగ్మెంట్లోని ఏడు నియోజకవర్గాల నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కనకమాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె 'నేను మీ ఇంటి ఆడపడుచుని నన్ను ఆశీర్వదించండి' అంటూ ప్రచారం సాగిస్తున్నారు. 'నేను లోకల్' అన్న ప్రచారానికి ప్రజలు కూడా ఆకర్షితులవుతున్నారు. 2014 ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ ఇక్కడ పోటీ చేసినప్పటికీ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వల్లే ఓడిపోయారు. అయినప్పటికీ దేశంలో మోడీ గాలి బలంగా వెయ్యడంతో స్థానికేతర్లు బిజెపి అభ్యర్థి కంభంపాటి హరిబాబును విశాఖపట్నం ప్రజలు ఎన్నుకున్నారు. ఈసారి లోకల్ ఫీలింగ్ తో బొత్స ఝాన్సీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విల్లురుతున్నారు.
Next Story