‘పవన్ కల్యాణ్‌కి ఏం తెలుసు’.. ల్యాండ్ టైటిలింగ్‌పై బొత్స క్లారిటీ
x

‘పవన్ కల్యాణ్‌కి ఏం తెలుసు’.. ల్యాండ్ టైటిలింగ్‌పై బొత్స క్లారిటీ

ఆంధ్ర రాజకీయాల్లో మరోసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంటలు చెలరేగాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. తాజాగా దీనిపై బొత్స సత్యనారాయణ స్పందించారు.


కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా వినిపించిన మాట ‘ల్యాండ్ టైటిలింగ్’. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ ‘ల్యాండ్ టైటిలింగ్’ చట్టం ఇప్పుడు ఎన్నికల ముందు ప్రతిపక్షాల దగ్గర ఉన్న ప్రధానాస్త్రాల్లో ఒకటిగా మారింది. ‘ల్యాండ్ టైటిలింగ్’ చట్టాన్ని ఉపయోగించుకుని జగన్.. ప్రజల ఆస్తులు కాజేశారని, భూములు లాక్కున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలు ప్రజల ఆస్తి కాగితాలు ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉండాలని, ఎవరి ఆస్తి కాగితాలు వారి దగ్గర ఉండాలే తప్పా జగన్ లాంటి దొంగల దగ్గర కాదంటూ ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కూడా ఈ చట్టంపై అనేక ఆరోపణలు చేశారు. తాజాగా వీటిపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ చట్టంపై బాబు, పవన్ చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనని తోసిపుచ్చారు.

పవన్‌కి ఏం తెలుసు..?

‘‘వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నంగానే టీడీపీ, జనసేన పార్టీలు ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ప్రజల భూములను జగన్ లాక్కుంటున్నారని పవన్ కల్యాణ్ అంటున్నారు. పవన్‌కి ఏం తెలుసు. అన్నం తినేవాడు ఎవరైనా ఇలా మాట్లాడతారా?’’అని మండిపడ్డారు బొత్స. ఎవడి భూమి ఎవడు లాక్కున్నారంటూ ప్రశ్నించారు. ‘‘ఎక్కడైనా ప్రజల భూములను ప్రభుత్వం లాక్కుంటుందా? రాజకీయ లబ్ది పొందాలన్న ఉద్దేశంతో బాబు తన క్రిమినల్ బ్రెయిన్‌ ఉపయోగించి ఈ కుట్రను పన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతారు. ఈ చట్టం వల్ల రాష్ట్రంలో భూ వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. సమస్యలు లేని భూహక్కు భూ యజమానులకు దక్కుతుంది. జగన్ ఎప్పుడూ ప్రజలకు మంచే చేశారు. మోసం చేయాలన్న ఆలోచన కూడా జగన్‌కు రాదు’’ అంటూ బొత్స స్పస్టం చేశారు.

Read More
Next Story