బోత్సాయే ఉత్తరాంధ్ర వైసిపి బాద్షా
x

బోత్సాయే ఉత్తరాంధ్ర వైసిపి బాద్షా

-ఉత్తరాంధ్ర వైసీపీలో బొత్స పెద్దన్న పాత్ర! -ఎమ్మెల్సీగా జగన్ వ్యూహాత్మక ఎంపిక - పార్టీ పరాభవం తర్వాత మారిన అధినేత వైఖరి -బొత్స వెంట నడుస్తున్న ఆ పార్టీ నేతలు



-బొల్లం కోటేశ్వరరావు


విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరాంధ్రలోనూ ఆ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 స్థానాల్లో 29 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకున్న ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో కేవలం రెండింటికే (పాడేరు, అరకు) సీట్లకే పరిమితమైంది. ఆ షాక్ నుంచి వైసీపీ కేడర్ ఇంకా తేరుకోకుండానే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చిపడింది. ఓటమి నేపథ్యంలో పార్టీ క్యాడరు నైరాశ్యంలో ఉండడం, మరికొందరు పార్టీ ఫిరాయించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ స్థానానికి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై చర్చ జరుగుతున్న తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించారు. ఉత్తరాంధ్రలో బొత్స పట్టున్న నాయకుడు కావడంతో నైరాశ్యంలో ఉన్న వైసీపీలో ఒకింత ఉత్సాహం నెలకొంది. ఇటీవల జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపలర్ కార్పొరేషన్) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి బలం ఉన్నా మెజార్టీ కార్పొరేటర్లు ఫిరాయింపుతో పదికి పది స్థానాలనూ టీడీపీ దక్కించుకుంది. ఆ ఊపుమీద ఉన్న టీడీపీ తొలుత టీడీపీ నాయకులు బొత్సపై తమ అభ్యర్థిని పోటీకి నిలుపుతామని ప్రకటించారు. ఉమ్మడి విశాఖ

జిల్లాలో మొత్తం 836 ఓట్లలో 530కి పైగా వైసీపీవే. అయితే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఫలితాలను వైసీపీ ఓటర్లు తమ వైపు మొగ్గు చూపుతారన్న భావనతో టీడీపీ నేతలు పోటీ ప్రకటన చేశారు. కానీ స్టాండింగ్ కమిటీ ఫలితాల గుణపాఠంతో ముందుగానే తమ ఓటర్లను వైసీపీ నాయకులు ముందస్తుగా క్యాంపులకు తరలించారు. పైగా ఉత్తరాంధ్ర వైసీపీలో పెద్దన్నగా పేరున్న బొత్స అభ్యర్థి కావడంతో పలువురు ఓటర్లు టీడీపీ ప్రలోభాలకు గురి కాలేదు. వైసీపీ నేతల్లో కూడా బొత్స అభ్యర్థిత్వం పట్ల మరో అభిప్రాయం లేదు. దీంతో పోటీ చేసినా ఓటమి ఖాయమన్న నిర్ణయానికొచ్చిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఇక స్వతంత్రులుగా బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు కూడా ఆఖరి నిమిషంలో ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైంది.


వైసీపీ అధినేత జగనన్ను కలిసిన బొత్స. ఆయన వెంట ఆ పార్టీ నేతలు

వైసీపీ పరాజయం తర్వాత కేడర్ ఒక్కొక్కరుగా జారి పోతున్న పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ వంటి కీలక నేత అవసరాన్ని గుర్తెరిగే ఆ పార్టీ అధినేత జగన్ ఆయనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారన్న భావన వైసీపీ శ్రేణుల్లో ఉంది. బొత్స కాకుండా ఆ స్థానానికి మరొకరిని ఎంపిక చేస్తే ఫలితం మరొకలా ఉండేదన్న అభిప్రాయం వీరిలో వ్యక్తమవుతోంది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో మంత్రులుగా ఉన్న వారంతా ఘోరంగా ఓటమి పాలయ్యారు. పైగా రాష్ట్రంలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇన్నాళ్లూ స్థానికేతరులైన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను తెచ్చి ఉత్తరాంధ్రపై పెత్తనం చెలాయించేలా జగన్ చేశారన్న అభిప్రాయం ఈ ప్రాంత వాసుల్లో నెలకొంది. వైసీపీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత కూడా విజయసాయి, సుబ్బారెడ్డి లాంటి వారితో ఇక్కడ రాజకీయాలు కొనసాగిస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందన్న సంగతి గుర్తెరిగే జగన్ బొత్సకు ఎమ్మెల్సీ స్థానానికి ఎంపికచేసినట్టు పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

ఇన్నాళ్లూ వైసీపీ పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరు.. ఇకపై అధినేత జగన్ వైఖరి కూడా మారుతోందని, ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను తమ సొంత వారికి కాకుండా బొత్సకే అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా బొత్స నాయకత్వం పట్ల ఉత్తరాంధ్ర వైసీపీ మెజారిటీ నాయకుల్లో ఏమంత వ్యతిరేకత లేదన్నది వారి వాదన. ఇందుకనుగుణంగానే ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం బొత్స సత్యనారాయణ బుధవారం అధినేత జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలపడానికి వెళ్లారు. ఆయన వెంట పాడేరు, అరకు ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు, మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, అవంతి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, ఆదీప్జ్, కె.భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి, కె.శ్రీనివాసరావు, శోభ హైమావతి, విశాఖ, విజయనగరం జెడ్పీ చైర్ఫర్సన్లు సుభద్ర, మజ్జి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.


సార్వత్రిక ఎన్నికల తర్వాత శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా మౌనంగా ఉండిపోయారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బొత్సతో పోల్చుకుంటే చాలా జూనియర్. అందువల్ల ఉత్తరాంధ్రలో పార్టీని నడిపించగలిగే స్థాయి ఆయనకు లేదన్న భావన ఉంది. ఈ పరిస్థితులను ఆకళింపు చేసుకున్న జగన్ మున్ముందు ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగానే బొత్సను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారని ఇటు వైసీపీలోను, అటు ఉత్తరాంధ్రలోనూ చర్చించుకుంటున్నారు. మునుపటిలా కాకుండా ఇకపై ఉత్తరాంధ్ర వైసీపీలో బొత్స పెద్దన్న పాత్ర పోషిస్తారన్న టాక్ నడుస్తోంది.



Read More
Next Story