సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్న వైసీపీ.. బొత్సకి ఇచ్చే గెఫ్ట్ ఏంటో..!
x

సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్న వైసీపీ.. బొత్సకి ఇచ్చే గెఫ్ట్ ఏంటో..!

విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికలో వైసీపీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇందులో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికలో వైసీపీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇందులో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని కూటమి నిర్ణయించుకోవడం, నామినేషన్ వేసిన మరో అభ్యర్థి కూడా విత్‌డ్రా చేసుకోవడంతో ఈ ఎన్నిక లాంఛనప్రాయమైంది. ఈ మేరకు బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు తాను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని జాయింట్ కలెక్టర్ నుంచి బొత్స అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

‘‘విశాఖపట్నం స్థానిక సంస్థ ఎన్నికల్లో నాకు బీఫాం ఇచ్చిన గెలిపించిన పార్టీ అధినేత జగన్‌కు కృతజ్ఞతలు. అదే విధంగా నా విజయానికి సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. రోబోయే రోజుల్లో కూడా అందరం ఇదే విధంగా కలిసికట్టుగా జిల్లా అభివృద్ధి కోసం పాటుపడాలి’’ అని పిలుపునిచ్చారు. బొత్స విజయంపై వైసీపీ పార్టీ కూడా తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. తన కుయుక్తులతో పోటీకి ప్రయత్నించినప్పటికీ టీడీపీకి నిరాశే ఎదురైందని, జగన్ పిలుపమేరకు ఉమ్మడి విశాఖ వైసీపీ నాయకులంతా ఏకతాడిపైకి వచ్చి పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ఏకగ్రీవంగా గెలిపించుకున్నారని తెలిపింది. అదే విధంగా విజయం సాధించిన బొత్సకు అభినందనలు తెలియజేసింది.

ఫలించిన జగన్ కృషి

ఈ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని వైసీపీ భావించింది. ఈ స్థానాన్ని కాపాడుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైనా పరాజయంతో నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు సందేశం ఇచ్చినట్లు ఉంటుందని పార్టీ అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలోనే స్థానిక ప్రజాప్రతినిధులను అలెర్ట్ చేసింది. వారిలో ఉత్సాహాన్ని తిరిగి ఉరకలు పెట్టించడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేరుగా రంగంలోకి దిగారు. ప్రజాప్రతినిధులను ఏకతాటిపైకి తీసుకురావడంలో తన వంతు కృషి చేశారు. అందరితో సంప్రదింపులు చేసిన తర్వాత బొత్స సత్యనారాయణను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు వారు ఆశించిన విధంగానే బొత్స ఎన్నికల ఏకగ్రీవం కావడంతో జగన్ కృషి ఫలించింది. విశాఖ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో వైసీపీ నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహం కనబడుతోంది.

మరి ఆఫర్ పరిస్థితేంటి?

ఇదిలా ఉంటే విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికల సమయంలో బొత్స సత్యానారాయణకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారని ఓ ప్రచారం రాష్ట్రమంతా జోరుగా సాగింది. స్థానిక సంస్థల ఉపఎన్నికలో గెలిస్తే బొత్సకు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారట. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా బొత్స ఉంటే ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారన్నే ఆలోచనతోనే జగన్ ఈ ఆఫర్ చేశారంటూ ఎన్నికల ముందు వరకు కూడా ప్రచారం గట్టిగానే జరిగింది. అయితే శాసనమండలి ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. ఇప్పుడు విశాఖ ఉపఎన్నికలో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా గెలిచారు. దీంతో శాసనమండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్‌ను వైసీపీ.. బొత్సకు కట్టబెడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు అదే జరిగితే.. లేళ్ల అప్పిరెడ్డి ఊరుకుంటారా? అన్నది మరో మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.

లేళ్ల అప్పిరెడ్డి ఒప్పుకుంటారా?

ఒకవేళ ఆ ప్రచారమే నిజమై.. చెప్పిన విధంగానే బొత్సకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదాను కట్టబెడితే ఇన్నాళ్లూ ఆ పదవిలో కొనసాగిన లేళ్ల అప్పిరెడ్డి అంగీకరిస్తారా? అంటే అంగీకరించరన్న వాదనే బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే ఆయన తన అనుచర వర్గంతో సమావేశమై వైసీపీ పార్టీకి గుడ్‌బై చెప్పినా చెప్తారని పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే అటు లేళ్ల అప్పిరెడ్డిని సముదాయిస్తూనే బొత్సకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదాను కట్టబెట్టాలా జగన్ మాస్టర్ ప్లాన్ ఏమైనా సిద్ధం చేస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతుంది. వీటన్నింటికి సమాధానం దొరకాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే అని వైసీపీ వర్గాలు కూడా పెదవి విరుస్తున్నాయి.

Read More
Next Story