జగన్ బ్రాండ్లు జనం నవనాడుల్నీ గుల్లచేశాయా?
x

జగన్ 'బ్రాండ్లు' జనం నవనాడుల్నీ గుల్లచేశాయా?

ఏపీ లిక్కర్ స్కాంకి 'జే' బ్రాండ్ల మద్యానికి లంకె కుదిరినట్టేనా?


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీప్ లిక్కర్ బ్రాండ్లు ప్రజా ఆరోగ్యాన్ని గుల్లచేశాయా? గతంలో ఎన్నడూ లేనంతగా లివర్, కిడ్నీ వ్యాధులు పెరిగాయా? మానసిక రోగాలు గతం కంటే భారీగా పెరిగాయా? అంటే అవుననే చెబుతోంది 2024లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ (గతంలో ఆరోగ్యశ్రీ) పథకం ప్రకటించిన లెక్కల ప్రకారం మద్యపానం సంబంధిత వ్యాధులు, వైద్యం ఖర్చులు గణనీయంగా పెరిగాయి. 2019 నుంచి 2024 మధ్య ఈ పెరుగుదల స్పష్టంగా కనిపించింది.
2019 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ పాలనతో పోలిస్తే ఆల్కహాల్ కారణంగా వచ్చే లివర్ వ్యాధుల కేసులు ఏకంగా 109 శాతం పెరిగాయని నిపుణుల కమిటీ వెల్లడించింది.

రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు నాయకత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఆరోగ్యశ్రీ ద్వారా లభించిన అధికారిక డేటా ఆధారంగా ఈ కమిటీ రిపోర్టు ఇచ్చింది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఈ నివేదికను తయారు చేసింది. ప్రస్తుతం ఈ నివేదిక రాష్ట్రంలో సంచలనం రేపింది. ఒళ్లు జలతరించే నిజాలను ఈ నివేదిక బయటపెట్టింది. వీటిలో ఎంత నిజముందనేది ఇంకా నిర్ధారణ కానప్పటికీ ఆల్కహాల్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందన్నది అందరూ ఎరిగిన నిజమే.
2014 నుండి 2019 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఆల్కహాల్ సంబంధిత వ్యాధులు గణనీయంగా పెరిగాయి. ఈ పరిస్థితికి ముఖ్య కారణం "చీప్ లిక్కర్" (కమర్షియల్‌గా తక్కువ ధరకు అమ్ముడయ్యే మద్యం). నివేదిక తేల్చిన వివరాలు రాష్ట్ర ఆరోగ్య రంగానికే కాదు, సామాజిక రాజకీయ పరిపరిశీలనకూ ప్రధాన ఆవశ్యకతను కలిగిస్తున్నాయి.
ఆల్కహాల్ సంబంధిత వ్యాధుల పెరుగుదల..
"2019-24లో లివర్, నరాల సంబంధిత రోగుల సంఖ్య 2014-19తో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఇది తీవ ఆందోళనకు గురిచేసింది. ఈ డేటాను విశ్లేషించి తదుపరి చర్యలు తీసుకోబోతున్నాం" అన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు . దీనిపై జాతీయ, అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులతో కూడిన సలహా మండలిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. వీరి సహకారంతో మరింత లోతుగా డేటాను విశ్లేషించి, రోగనిరోధక చర్యలు తీసుకోనుంది.
2014-2019 మధ్య కాలంలో ఆల్కహాల్ తో కాలేయ (లివర్) వ్యాధులు, కిడ్నీ దెబ్బతినడం, మానసిక రుగ్మతలు వంటి సమస్యలు గణనీయంగా పెరిగినట్టు ఈ నివేదిక చెబుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి కేసుల్లోనూ ఇవే ఎక్కువగా కనిపించినట్టు తేల్చింది.
2014-19లో నమోదైన ఆల్కహాల్ సంబంధిత లివర్ వ్యాధుల కేసులు 14,026 కాగా, 2019-24లో అదే సంఖ్య 29,369కి పెరిగింది. ఇది 100 శాతం పెరుగుదల.
2014-19లో న్యూరలాజికల్ డిజార్డర్ కేసులు కేవలం 1,276 మాత్రమే ఉండగా, 2019-24లో 12,663కి చేరాయి. అంటే ఏకంగా 892 శాతం పెరుగుదల. లివర్, కిడ్నీ, మానసిక ఆరోగ్యం, నాడీ సంబంధిత వ్యాధులు 2019-24 కాలంలో గణనీయంగా పెరిగినట్టు తేలింది.
లిక్కర్ స్కాం‌పై ఈడీ దర్యాప్తు ప్రారంభం
చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో చోటుచేసుకున్న రూ. 3,200 కోట్ల లిక్కర్ స్కాంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధాన నిందితుడిగా జగన్‌ ఐటీ సలహాదారు రాజ్ కాశిరెడ్డి సహా ఇద్దరు అరెస్టయ్యారు.
ఈ వారం ప్రారంభంలోనే కేంద్ర ఆర్థిక నేరాల శాఖ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), గత వైఎస్సార్సీపీ పాలనలో చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్న లిక్కర్ స్కాంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.
2024 సెప్టెంబర్‌లో రాష్ట్ర CID నమోదు చేసిన FIR ఆధారంగా ఈ కేసు మొదలైంది. పీఎంఎల్‌ఏ (PMLA) చట్టంలోని సెక్షన్ల కింద ECIR (Enforcement Case Information Report) నమోదు చేశారు. ఈ కేసులో లిక్కర్ ఏజెంట్లు, విక్రేతలపై విచారణ జరిపే ఉద్దేశంతో ED ముందుకెళ్లనుంది. ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. SIT నివేదిక ప్రకారం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బ్రాండ్లు తొలగించి, కొత్త బ్రాండ్లకు ఆర్డర్లు ఇచ్చారు. చీప్ బ్రాండ్లపై కేసుకు రూ. 150, మిడిల్ బ్రాండ్లకు రూ. 200, హైఎండ్ బ్రాండ్లకు రూ. 600గా కిక్‌బ్యాక్‌లు వసూలు చేశారని SIT ఆరోపించింది.
అధికారిక డిపోలలో పాత బ్రాండ్ల స్టాక్ ఉన్నా వాటిని సరఫరా చేయకుండా, కొత్త బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు మంజూరు చేశారని పేర్కొంది.
వైఎస్సార్సీపీ అనుబంధ సంస్థల బ్రాండ్లు
SIT ప్రకారం, వైఎస్సార్సీపీ అనుబంధ కంపెనీలు ఆంధ్ర గోల్డ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్ విస్కీ, డేర్ హౌస్ బ్రాండీ, ఛాంపియన్ స్పెషల్ విస్కీ, హార్ట్‌స డిజైర్ విస్కీ వంటి లోకల్ బ్రాండ్లను తయారు చేశాయి. జాతీయ స్థాయి బ్రాండ్లను తొలగించి, వీటినే ప్రోత్సహించారని ఆరోపణ.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ 'పరిమితికి మించి' ప్రజారోగ్యాన్ని దెబ్బతీసిందని ఈ నివేదిక స్పష్టంగా తెలిపింది. చీప్ బ్రాండ్ల ప్రవేశం, క్వాలిటీ తగ్గడం వల్ల లివర్, కిడ్నీ వ్యాధులు విపరీతంగా పెరిగాయని అనుమానం వ్యక్తమవుతోంది.
చీప్ లిక్కర్ ప్రధాన కారణం...
ఈ నివేదిక ప్రకారం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న కాలంలో ప్రభుత్వరంగ మద్యం ఉత్పత్తి, విక్రయ విధానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి రావడంతో వినియోగం పెరిగింది. తక్కువ నాణ్యత వల్ల ప్రజారోగ్యానికి తీవ్రమైన దెబ్బ తగిలినట్టు నిపుణులు తేల్చారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమైనా ఉందా..
గత ప్రభుత్వ హయాంలో (2014-2019) మద్యం నియంత్రణపై సరైన ఆంక్షలు లేకపోవడం, ప్రజలలో అవగాహన లేకపోవడం, ఆరోగ్యశాఖ–పోషణ శాఖ మధ్య సమన్వయం లేకపోవడం వంటి అంశాలను కమిటీ తీవ్రంగా విమర్శించింది.
రాజకీయ కోణంలో...
2024లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ నివేదికను సహజంగానే తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. వైసీపీ పాలనలో ప్రజారోగ్యం, మద్యం నియంత్రణ విధానాలపై పెద్దఎత్తున విమర్శలు చేస్తోంది. ఈ నివేదికను ఆధారం చేసుకుని "వైఎస్ జగన్ హయాంలో ప్రజల జీవితాలకు భద్రత లేకుండా పోయింది" అని దుమ్మెత్తిపోస్తోంది.
గ్రామీణ ప్రాంతాలపై అధిక ప్రభావం..
చీప్ లిక్కర్ ను ఎక్కువగా పేదవర్గాలు వినియోగించాయి. వ్యవసాయ కార్మికులు, రోజువారీ కూలీలు ఆరోగ్యపరంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. పారిశుద్ధ్యం, కుటుంబ జీవన ప్రమాణాలపై ప్రభావం చూపింది. కుటుంబాల్లో హింస, విడాకులు, పేదరికం మరింత పెరిగినట్టు కమిటీ తేల్చింది.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు..
నూతన ప్రభుత్వం చీప్ లిక్కర్ ఉత్పత్తి, సరఫరా, విక్రయాలపై నియంత్రణ విధానాలను తీసుకువచ్చిది. ఆల్కహాల్ డీ-అడిక్షన్ కేంద్రాలను పెంచి, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టే యోచనలో ఉంది.
ఆల్కహాల్ దుర్వినియోగం ఒక వ్యక్తిగత సమస్య కాదని, పరిపక్వత లేని ప్రభుత్వ విధానాల ఫలితమని ఈ కమిటీ తేల్చింది. చీప్ లిక్కర్ వ్యాప్తి, ఆరోగ్యవ్యవస్థపై ప్రభావం, సామాజిక జీవితాన్ని విచ్ఛిన్నం చేసే విధానం –లాంటివన్నీ విమర్శలకు దారితీయవచ్చు.
ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం ఈ నివేదికను ఆరోగ్య ప్రణాళిక పునఃనిర్మాణానికి ఉపయోగించుకుంటుందా, లేక రాజకీయ దుష్ప్రచారానికి ఉపయోగించుకుంటుందా అన్నది చర్చనీయాంశంగా ఉంది.
Read More
Next Story