కృష్ణా జిల్లాలో అధికంగా బీపీ, షుగర్‌ వ్యాధులతో బాధపడుతున్న బాధితులు ఉన్నారు. 18.57 శాతం బీపీతోను, 14.95 శాతం మంది షుగర్‌తోను బాధలు పడుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువుగా వినిపిస్తున్న మాట ‘హబ్‌’. ఏ రంగం మీద సమీక్షలు జరిగినా, లేదా సమావేశాలు జరిగా ఆ రంగంలో హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పడం పరిపాటిగా మారింది. అయితే ఆయా రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను హబ్‌గా మారుస్తారో లేదో తెలియదు కానీ బీపీ, షుగర్‌ల విషయంలో మాత్రం హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ అవతరించనుందనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వైద్య పరీక్షలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంత వరకు చేపట్టిన స్క్రీనింగ్‌ టెస్టుల్లో అధిక శాతం మంది బీపీ, షుగర్‌లతో సతమతమవుతున్నట్లు తేలింది. బీపీ, షుగర్‌ల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నాన్‌ కమ్యూనికేబుల్‌ రోగాల గుర్తింపు సర్వే–3లో ఈ విషయాలు వెలుగులో వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో 14.73 శాతం మంది బీపీ, 11.78 శాతం మంది షుగర్‌ వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన వారు 4.09 కోట్ల మంది ఉన్నారు. వీరిలో 1.34 కోట్ల మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. 19,76,579 మందికి బీపీ, 15,78,897 మందికి షుగర్‌ ఉన్నట్లు తేలింది. వీరిలో కొత్తగా చేపట్టిన పరీక్షల్లో 2,36,638 మందికి బీపీ, 2,16,205 మందికి షుగర్‌ నిర్థారణ కాగా, 17,39,941 మంది బీపీతోను, 13,62,692 మంది షుగర్‌ వ్యాధులతోను ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నట్లు గుర్తించారు. బీపీతో బాధపడుతున్న వారిలో ఐదు జిల్లాల్లో ఎక్కువ మంది ఉండగా మరో ఐదు జిల్లాల్లో షుగర్‌తో ఇబ్బందులు పడుతున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 19.35శాతం, కృష్ణా జిల్లాలో 18.57 శాతం, వెస్ట్‌ గోదావరి జిల్లాలో 18.17 శాతం, ఏలూరు జిల్లాలో 17.47 శాతం, బాపట్ల జిల్లాలో 16.62 శాతం మంది బీపీ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. తక్కువుగా మరో ఐదు జిల్లాలో తక్కువ మంది బాధపడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7.66 శాతం, కర్నూలు జిల్లాలో 7.68 శాతం, అనంతపురంలో 7.82 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 7.99 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 9.39 శాతం మంది ఉన్నారు.
ఇక షుగర్‌ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారు అధికంగా కృష్ణా జిల్లాలో 14.95 శాతం, బాపట్ల జిల్లాలో 14.20 శాతం, గుంటూరులో 14.30 శాతం, వెస్ట్‌ గోదావరి జిల్లాలో 14.03 శాతం, ఈస్టు గోదావరి జిల్లాలో 13.01 శాతం మంది ఉన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2.62శాతం, కర్నూలు జిల్లాలో 4.84 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 5.49 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 5.94 శాతం, అనంపురం జిల్లాలో 5.94 శాతం చొప్పున తక్కువ సంఖ్యలో బాధపడుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు సర్వే చేపట్టగా, మూడో సారి సర్వే జరుగుతోంది.
Next Story