తన ప్రేమ పెళ్ళికి తానే విలన్‌గా మారిన వధువు.. అసలు ఏమైందంటే..
x
Source: Twitter

తన ప్రేమ పెళ్ళికి తానే విలన్‌గా మారిన వధువు.. అసలు ఏమైందంటే..

రాజమండ్రిలో సినిమా స్టైల్లో పెళ్ళి కూతరు కిడ్నాప్‌కు ప్రయత్నం. అసలేం జరిగిందంటే..


‘నా ప్రేమ కథకు నేనే కదా విలను. తప్పు ఎవరిదనను’ అంటూ హీరో నారా రోహిత్ పాట ఒకటి ఉంది. ఈ పాట బాగా నచ్చేసినట్టుంది.. రాజమండ్రిలో ఓ యువతి తన పెళ్ళికి తానే విలన్‌లా మారింది. తన అతితెలివో, తెలివి తక్కువ తనమో కానీ పెళ్ళిని చేజేతులారా చెడగొట్టుకుంది. అది కూడా సినిమా స్టైల్లో జరిగింది. ప్రియుడితో యువతి పెళ్ళి పీటలపై ఉండగా ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చారు మన బ్యాడ్‌గైస్. కారంతో నిండిన కవర్లు పట్టుకుని పెళ్ళి మండపంలో ఉన్న అతిథులపైన హోళీలా చల్లారు. కళ్లలో కారం పడటంతో మండపం అంతా పెళ్ళి కొడుకు బంధువుల హాహాకారాలతో నిండిపోయింది. అదే అదును అనుకున్న బ్యాడ్‌గైస్.. పెళ్ళి కూతురును కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు. కానీ అది విఫల ప్రయత్నంగానే మారిపోయింది. వరుడి బంధువులు మన బ్యాడ్ గైస్‌ను అడ్డుకుని వధువును రక్షించేశారు. పైగా పోలీసులకు కూడా కబురు పెట్టారు. సస్పెన్స్, యాక్షన్‌తో నిండి ఉన్న ఈ సినిమాటిక్ ఘటన రాజమండ్రిలోని కడియం ప్రాంతంలో జరిగింది.

అసలు విషయం ఏంటంటే.. కడియం గ్రామానికి చెందిన బత్తిన వెంకటనందు అనే యువకుడు ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఓ కళాశాలలో డిప్లొమా పూర్తిచేశాడు. అతడితో పాటే కర్నూలు జిల్లా చాగలమర్రి మండలానికి చెందిన స్నేహ కూడా అదే కళాశాలలో చదివింది. వారిద్దరి మధ్య చదువుతున్న కాలంలోనే స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా కాలక్రమేణా ప్రేమగా చిగురించింది. చదువును పూర్తి చేసిన వెంటనే వివాహంతో ఒక్కటి కావాలని ఇద్దరూ కలలు కన్నారు. కానీ తమ పెళ్ళిపై పెద్దలు ఏమంటారన్న భయం మరోవైపు వాళ్లని వెంటాడుతూనే ఉంది. కానీ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ వాళ్లకి ధైర్యాన్ని పెంచింది.



పెళ్ళి చేసుకుని ఆ తర్వాత పెద్దలను ఒప్పిద్దామని అనుకున్నట్లు ఉన్నారు కాబోలు. ప్రేమ ఇచ్చిన ధైర్యాన్ని కూడగట్టుకుని ఏప్రిల్ 13న విజయవాడలోని దుర్గాదేవి సన్నిధిలో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తమ ఆలోచన మేరకే కడియం వెంకటనందు తన ఇంట్లో చెప్పడం, వాళ్లు ఓకే అంటూ పచ్చజెండా ఊపేయడం కూడా అచ్చం సినిమా తరహాలోనే జరిగింది. అంతేకాదు.. సినిమాల మాదిరిగానే ఇక్కడ కూడా అమ్మాయి ఇంట్లో రెడ్ ఫ్లాగ్ వేశారు. దీంతో ప్రేమికులిద్దరూ వెంకటనందు బంధువుల సమక్షంలో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుని, అందుకు కావాల్సిన ముహూర్తాలు అన్నీ పెట్టుకున్నారు. ఈ తంతు వధువు ఇంట్లో తెలియదు.

పెళ్ళికి అంతా రెడీ అయింది. కడియంలోని ఓ ఫంక్షన్ హాలులో బంధువులు, మంగళ వాయిద్యాల మధ్య నవ వధూవరులు ఇద్దరూ పెళ్ళి పీటలపై కూర్చున్నారు. ‘మాంగల్యం తంతునానేనా’ అంటూ పురోహితుల వారు పెళ్లి తంతును ఆరంభించారు. పక్కా అనుకున్నట్లుగానే కారం ప్యాకెట్లతో మన బ్యాడ్ గైస్ ఎంట్రీ ఇచ్చి.. కారం చల్లి.. అమ్మాయిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. ఇంత జరుగుతుంటే మన హీరో చూస్తూ ఊరుకుంటాడా.. ఊరుకోలేదు. మన బ్యాడ్ గైస్‌కి అడ్డుపడ్డాడు.. అతడితో కలిసి అతడి బంధువులు కూడా ఎదురుతిరిగి వధువును కాపాడుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆఖరికి పోలీసులు కూడా సినిమాల్లో చూపినట్లు ఆలస్యంగా వచ్చి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.

ఈ పెళ్ళి తంతు ఆగిపోవడానికి, సినిమా స్టైల్ సీన్ క్రియేట్ కావడానికి మొత్తానికి పెళ్ళి కూతురే కారణమని. తన పెళ్ళి విషయాన్ని.. పెళ్ళి ఎక్కడ జరిగేది.. ఎప్పుడు జరిగేది అన్న అన్ని విషయాలు యువతే తన తల్లీదండ్రికి చెప్పింది. తన పెళ్లికి ఇన్వైట్ కూడా చేసింది. అన్ని వివరాలు తెలిసి.. తమ కూతురు తమకు ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటుంలే ఆమె తరపు వాళ్లు చూస్తూ ఊరుకుంటారా.. అడ్డుకున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరి ఈ సినిమా లాంటి రియల్ స్టోరీలో ఇంకెన్ని విషయాలు బయటకొస్తాయో సెకండ్ పార్ట్‌లో చూడాలి. ఎందుకంటే ఈ సినిమా తొలి భాగం.. అసలు మన హీరోయిన్ తమ పెళ్ళి సీక్రెట్ లొకేషన్‌ను ఎందుకు రివీల్ చేసింది? అన్న ప్రశ్నతో నిలిచిపోయింది కాబట్టి.

Read More
Next Story