
రాయలసీమ ప్రాంత వరుస కరువులకు కారకులు ఎవరు?
స్వదేశీ పాలకులకంటే, విదేశీ తెల్లవాళ్లే నయమేమో అనిపిస్తుంది.
-టి. నాగార్జున రెడ్డి
అమరావతి మునక ప్రాంతం అని తెలిసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజధాని రక్షణ కోసం ప్రకాశం బ్యారేజి నుండి వైకుంఠపురం వరకు కృష్ణానదికి కరకట్ట నిర్మాణం చేపట్టనున్నట్లు వార్తలొచ్చాయి.
ఈ వార్తల ప్రకరాం ఈ కరకట్ట సుమారు 22కిలోమీటర్లు ఉంటుందట! దీనిలో 18.5కిలోమీటర్లు అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఉందట! తొలిదశలో కేవలం 7.2 కిలోమీటర్ల కరకట్టకు రెండు వైపులా రిటెయినింగ్ వాల్స్ నిర్మిస్తారు. అదే విధంగా నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దీనికి రు. 1300కోట్లు ఖర్చు అవుతుందని ఈ ప్రభుత్వ అంచనా. మిగిలిన దానికి ఇంకెన్ని కోట్లు కృష్ణార్పణం కావాలో వేచి చూడాలి.
ఇంత ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ అక్కడ రాజధానిని నిర్మించడం ఆంధ్రప్రదేశ్ కు మంచిది కాదని 2014నుండి రాయలసీమ ఉద్యమకారులేకాదు,మేధావులు కూడా చెబుతూనే ఉన్నారు. కృష్ణానది పై సిద్దేశ్వరం దగ్గర కేంద్రం నిర్మించతలపెట్టిన తీగెల వంతెన నిర్మాణం బదులుగా ‘బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ’ నిర్మించాలని కేంద్రాన్ని కోరలేని రాష్ట్ర ప్రభుత్వం ఇలా వేల కోట్లు రాజధాని రక్షణ కోసం కృష్ణానది గట్టున కుమ్మరించాలనుకోవడం విచిత్రంగా లేదూ.
ఈ సందర్భంగా చిన్న కథ చెబుతాను.
నా చిన్నప్పుడు చీని చెట్లకు నీల్లు కట్టడానికి వెళ్లేటప్పుడు రెండు 'సామెన్ల' మధ్య ఉన్న కాలువకు బావుల నీళ్లు వదలగానే చాలా నీళ్లు వచ్చేవి. దీనితో కాలువ అక్కడక్కడ తెగుతూ పోయేది. నాకు దిక్కు తోచేది కాదు. ఎందుకంటే ఒక చోట ముగేస్తానే మరోచోట తెగిపోయి నీళ్లు బీటికి పోయేవి. అప్పుడే వచ్చిన మా నాయన నా అనస్థను గమనించి, ‘తిక్కనా కొడకా! నాలుగైదు చెట్లకు నీల్లు పోయేలాగా తీరు వేసి కింద ఉన్న కాలువకు మిగిలిన నీళ్లు వదిలి చూడు రా. అప్పుడు కాలువ తెగదు. నీకు ఈ అవస్థ ఉండదు,’ అన్నాడు. నాయన చెప్పినట్లే నేను కాలువకు ఇరువైపులా మెదట ఉన్న నాలుగైదు చీని చెట్లకు నీల్లు పోయేలా ప్లాన్ చేసి మిగిలినవి కాలువకు వదిలాను అప్పుడు ఎక్కడా కాలువ తెగ కుండా నీళ్లు వృధాగా కాకుండా మా తొట తగ్గున ఉన్న రోడ్డు గాతం గుంతలోకి పోకుండా చినీ చెట్లకు మాత్రమే నీళ్లు పారించగలిగాను.
కొన్ని గంటల తర్వాత నీళ్ల ఉధృతి బోరు దగ్గర తగ్గింది. కారణం మనది రాయలసీమ కదా భూగర్భ జలాలు లోపలికి పోవడంతో ఎడ కాలువ పడేది.... ఇప్పుడు కాలక్రమంలో మన రాయలసీమ ప్రాంతంలో 15000,2000అడుగులు బోర్లు వేస్తే పడే 1,2 ఇంచుల నీళ్లతో కాలువలకు వదిలే పరిస్థితి లేదని కాబోలు మన రాయలసీమ ప్రాంత రైతుల కోసం దేవుడు డ్రిప్పులు కనిపెట్టేలా చేశాడేమో అనిపిస్తుంది. మన రాయలసీమ ప్రాంతంలో వచ్చి రాని నీళ్లతో పండ్ల తోటలను బతికించుకునేందుకు డ్రిప్పులు పనిచేస్తున్నాయి.
నీతి ఏమంటే, రాయలసీమ ప్రాంతం నుండి పారిపోయే వరద జలాలను రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి అందించడానికి మన తుంగభద్ర కృష్ణానదుల పై ప్రాజెక్టులను నిర్మిస్తే విజయవాడ అమరావతి ప్రాంతాలకు వరద ముప్పు తగ్గించవచ్చు అనేది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గ్రహించి కరకట్టకు పెట్టే వేల కోట్లను రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులను నిర్మించడానికి పెడితే శాశ్వతముగా అమరావతి విజయవాడ నగరాలను రక్షించవచ్చును.
చిత్రమేమిటంటే, రాయలసీమ మీద బ్రిటిష్ వాళ్లే ఎక్కువ దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో కరువుకష్టాలు తగ్గించేందుకు చాలా ప్రయత్నించారు. స్వాతంత్ర్యం వచ్చాకే రాయలసీమను నిర్లక్ష్యం చేయడం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో 18వ శతాబ్దంలో దాతు, డొక్కల కరవులు వచ్చాయని చెబుతారు.వేలా మంది ఆకలితో మాడి చచ్చిపోయారని పెద్దలు గుర్తు చేస్తుంటారు. డెక్కల కరువులు కథలూ వూరూర వినబడతాయి. రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలు ‘అన్నమో రామచంద్ర’ అని అలమటిస్తున్నపుడు, అప్పటి పాలకులుగా ఉన్న తెల్లోళ్లకు దయ కలిగి మెకెంజీ అనే అధికారి ఆధ్వర్యంలో నల్లమల దట్టమైన అడవులలో గుర్రాల పై వెళ్లి సర్వే చేయించి ప్రాజక్టుల కట్టే సాధ్యాసాధ్యదాలను పరిశీలించారు. క్రిష్ణానది సిద్దేశ్వరం దగ్గర, సప్తనదుల కలయిక తర్వాత, భారీ రెండు కొండల మధ్య చిన్న పాయగా ఉదృతంగా పారుతూ పోయే ప్రదేశంలో అలుగు నిర్మించాలని భావించారు. రాయలసీమ ,తెలంగాణా ప్రాంతంలో ఉన్న ప్రజలకు వరద నీటిని మళ్లించి కాపాడాలనే చిత్త శుద్ధితో వాళ్లు ఆపని చేశారు. సిద్దేశ్వరం-అలుగు నిర్మణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన తెలుగు రాష్ట్రాలను మూడు సార్లు విభజన చేశారు. ఈ ప్రాంతాలకు పనికొచ్చే పనులేమైనా చేశారా? స్వదేశీ పాలకులే అయినా విభజన చట్టంలో సిద్దేశ్వరం-అలుగు ప్రాజెక్టును పెట్టి నిర్మించాలనే ద్యాసే లేదు. ఫలితంగా రాయలసీమ ప్రాంతానికి నేటి దుస్థితి వచ్చింది. రాయలసీమ ప్రాంత వరుస కరువులకు కారకులు ఎవరు? మన పాలకులు కదా?
(టి. నాగార్జున రెడ్డి, రాయలసీమ యాక్టివిస్ట్)