ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు బుడమేరు. విజయవాడ వరదల నేపథ్యంలో బుడమేరు మరో సారి ప్రపంచ వ్యాప్తమైంది. బుడమేరు ఎక్కడ పుట్టింది.. దాని చరిత్ర ఏంటి?


బుడమేరు విజయవాడ ప్రజలకు కల్లో కూడా కునుకులేకుండా చేస్తోంది. నగరాన్ని ఆనుకొని కృష్ణా నది ప్రవహిస్తున్నా.. దాని ప్రమాదం కంటే బుడమేరు వరదలే భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నగర శివారు ప్రాంతాలైన అజిత్‌సింగ్‌నగర్, మధురానగర్, రాజరాజేశ్వరావు పేటలు, సుందరయ్యనగర్, పాయకాపురం, కండ్రిగ వంటి అనేక ప్రాంతాల వాసులు వణికి పోతున్నారు.

బుడమేరు విజయవాడ దు:ఖ దాయనిగా పేరు గాంచింది. బుడమేరుకు ఉన్న ఆ పేరులోనే బుడ్డ ఏరు అనే పేరు ద్వనిస్తుంది. అంటే చిన్న ఏరు అని అర్థం. ఎందుకు దీనిని చిన్న ఏరు అని పిలుసారంటే.. విజయవాడ పక్కనే ఒక పెద్ద ఏరు ఉంది. అది కృష్ణా నది. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ఉంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో దీనిని పేరకమ్మని, పేరేరమ్మ అని పిలుస్తారు. అంత పెద్ద ఏరు లేదా నది విజయవాడ పక్కనే ఉండటం వల్ల బుడ్డేరు అని పిలిచే వారు. తర్వాత అది బుడమేరుగా స్థిరపడిందని మాజీ ఇరిగేష¯Œ అధికారి, జలవనరుల విభాగం నిపుణులు వరప్రసాద్‌ ఇటీవల ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
భౌగోళిక చరిత్ర ప్రకారం.. ఈ బుడమేరు ఒకప్పుడు కృష్ణా నదిలో కలిసే ఒక ఏరు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కృష్ణాలో కలిసే ఒక ఏరు ఈ బుడమేరు. అయితే భూగర్భంలో వచ్చిన అనేక రకాలైన మార్పుల కారణంగా ఈ బుడమేరు విజయవాడ నగర పరిసర ప్రాంతాలకు వచ్చిన తర్వాత షార్ప్‌గా ఒక టర్న్‌ తీసుకుని గన్నవరం ప్రాంతం మీదుగా కొల్లేరు సరస్సులో కలుస్తుంది.
ఈ బుడమేరు మొత్తం పొడవు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా, అటు తెలంగాణ సరిహద్దులో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి ఇది మొదలవుతుంది. నాటి ఉమ్మడి కృష్ణా జిల్లా నేటి ఎన్టీఆర్‌ జిల్లాలోని ఏ కొండూరు మండలం జమ్మలవాయి దుర్గం అనే అత్యంత ఎల్తైన కొండ ప్రాంతం దీని జన్మ స్థలం. అక్కడ నుంచి పూర్వపు ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలను తాకుతూ ఎన్టీఆర్‌ జిల్లాలోని తిరువూరు, గంపలగూడెం, మైలవరం, రెడ్డిగూడెం వంటి మండలాల గుండా ఇది ప్రహిస్తుంది. పైన కురిసే వర్షపు నీటిని తీసుకొని జీ కొండూరు మీదుగా మైలవరం చేరుకొని అక్కడ నుంచి విజయవాడ సమీపానికి చేరుకుటుంది. అంటే ఉత్తరాన పుట్టిన ఈ బుడమేరు తొలుత దక్షిణ దశగా ప్రవహంచి విజయవాడ చేరుకొని తిరిగి డైవర్షన్‌ తీసుకొని తూర్పు దిశగా ప్రవహిస్తూ గన్నవరం, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా బాపులపాడు,గుడివాడ మండలాలను దాటి ఇలపర్రు వద్ద కొల్లేరులో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 100 కిలోమీటర్లు. వెడల్పు 30 నుంచి 50 మీటర్ల వరకు ఉంటుంది.
ఈ బుడమేరులోకి నీటి చేర్చే పరివాహక ప్రాంతం(ఏయే ప్రాంతాల్లో వర్షం పడితే దీనిలో కలుస్తుందో ఆ ప్రాంతాన్ని బుడమేరు పరివాహక ప్రాంతం అంటారు) విస్తీర్ణం దాదాపు 2వేల చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ పరివాహక ప్రాంతంలో మూడు ప్రధాన రహదారులు ఉన్నాయి. విజయవాడ నుంచి విస్సన్నపేట వెళ్లే రహదారితో పాటు, విజయవాడ నుంచి మైలవరం మీదుగా తిరువూరు వెళ్లే రహదారితో పాటు నూజివీడు రహదారులు ప్రధానమైనవి. బుడమేరు జన్మస్థలమైన జమ్మలవాయదుర్గం నుంచి విజయవాడ వరకు వెళ్లే బుడమేరుకు ఇరువైపుల అనేక వాగులు వంకలు ఉన్నాయి. ఇది రెండు కొండల వరుసల మధ్యలో ఉన్న లోయ ప్రాంతంలో ఈ వాగు ప్రవాహం ఉంటుంది. దాదాపు 30 వరకు చిన్న చిన్న వాగులు వంకలు వచ్చి బుడమేరులో కలుస్తుస్తాయి. అంటే ఆ ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరంతా చివరకు ఈ బుడమేరులోకి వచ్చి చేరుతుంది.
విజయవాడకు ఎగువ వైపున వెలగలేరు, వెలగటూరు అనే ప్రాంతంలో కొన్ని కొండవాగులు, కొన్ని పాలవాగుల, మరి కొన్ని తంగిడి వాగులు ద్వారా మైలవరం వైపు నుంచి వచ్చే ప్రవాహం వచ్చి బుడమేరులోనే వచ్చి చేరుతుంది. అన్నారావుపేట, రెడ్డిగూడెం, నాగులూరు మండలాల పరిధిలోని కొండల నుంచి వచ్చే కోతుల వాగు అనే వాటి ద్వారా వర్షపు నీటి ప్రవాహం ఉంటుంది. జి కొండూరు నుంచి పులివాగు, మునగపాడు నుంచి బీమ్‌ వాగు, సీహెచ్‌ మాదవరం నుంచి లోయవాగు, గడ్డమణుగు లోయ ప్రాంతం నుంచి దొర్లింతలవాగుల నీటి ప్రవాహం దీనిలో కలుస్తుంది. ఈ వాగుల ద్వారా వచ్చే నీటి ప్రవాహమంతా కలిసి వెలగలేరు చెరువు ద్వారా బుడమేరులోకి వచ్చి చేరుతుంది.
విజయవాడకు దిగువ భాగాన ఆగిరిపల్లి, గన్నవరం వంటి ప్రాంతాల నుంచి చీమల వాగు, కుంఫిణీ అనేక వాగుల ద్వారా వచ్చే వర్షపు నీరు బుడమేరులోనే కలుస్తుంది. గన్నవరం దాటిన తర్వాత బుడమేరు డెల్టా ప్రాంతాల్లోకి ప్రవేశిస్తుంది. విజయవాడ ఎగువ ప్రాంతాలన్నీ స్లోప్‌గా ఉంటాయి. ఉరవడి ఎక్కువుగా ఉంటుంది. గనవరం దాటిన తర్వాత అంతా డెల్టా ప్రాంతం కావడం వల్ల అంతగా ఉరవడి ఉండదు.
బుడమేరు తొలుత 5 నుంచి 6 వేల క్యూసెక్కుల వరకు నీటి ప్రవాహం ఉండేది. తర్వాత ఆ పరిధిని పెంచారు. 14వేల క్యూసెక్కుల వరకు ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటర్‌ నిర్మాణం చేపట్టి దాని ద్వారా నియంత్రిస్తు వస్తున్నారు. అయితే తాజగా చోటు చేసుకున్న వరదల్లో దాదాపు 40వేల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చి చేరడంతో వరదలు చోటు చేసుకున్నాయనే వాదన ఉంది.
ఇది వరకు కూడా బుడమేరు వరదలు చోటు చేసుకున్నాయి. 1964లోనే బుడమేరు బీభత్సం సృష్టించింది. నాడు చోటు చేసుకున్న జళప్రయంలో 10 మంది వరకు గల్లంతయ్యారు. విజయవాడ నగరంలోని అజిత్‌సింగ్‌ నగర్‌తో పాటు సత్యనారాయణపురం వంటి ప్రాంతాలు నీటిలో మునిగి పోయాయి. నాటి నుంచి తరచుగా వరదలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ వరదలను నియంత్రించడానికి 70వ దశకంలో వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటర్‌ను నిర్మించారు. 2005లో వచ్చిన బుడమేరు వరదల్లో మరో సారి విజయవాడ నగరం అతలాకుతలమైంది. నాడు సీఎంగా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్వయంగా వచ్చి బుడమేరు సృష్టించిన జలప్రళయాన్ని చూశారు. ఈ వదలను నియంత్రించాలంటే బుడమేరు నీటి ప్రవాహాన్ని కట్టడి చేయడం ఒక్కటే మార్గమని ఇరిగేషన్‌ అధికారులు ఆయనకు వివరించారు. దీంతో పోలవరం కుడికాలువ ద్వారా బుడమేరు నీటిని కృష్ణా నదిలో కలిపాలని నిర్ణయించారు. దీంతో పాటుగా బుడమేరు మలుపులను సరి చేసి నీటి ప్రవాహం నేరుగా చేరే విధంగా చేయాలని నిర్ణయించారు. ఆ ప్రకారం 2007–08లో బుడమేరు నీటి ప్రవాహాన్ని పోలవరం కుడి కాలువలోకి మళ్లించారు.
అయితే వీటీపీఎస్‌ నుంచి వచ్చే జలాలను కూడా ఇదే మార్గం ద్వారా కృష్ణా నదిలోకి మళ్లించడంతో సాంకేతిక సమస్య వచ్చి పడింది. సామర్థ్యం లేక పోవడంతో దానిని పెంచాలనే నిర్ణయం ఇంత వరకు అమలు కాలేదు. దీనికి తోడు డైవర్షన్‌ పనులు అటకెక్కాయి. బుడమేరు ప్రవాహం విజయవాడలోకి రాకుండా ఏర్పాటు చేసిన కట్ట చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో బుడమేరు వరదలు అనివార్యంగా మారాయనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో గతంలో పంట పొలాలు మాత్రమే ముంపునకు గురయ్యే బుడమేరు వరదల ప్రభావం నేడు విజయవాడ నగరంపై పడుతోందని, అందువల్ల విజయవాడ, నిడమానూరు ప్రాంతాల్లో ఉన్న బుడమేరు మలుపులను సవరించాలని దాదాపు 20 ఏళ్ల క్రితమే ఇరిగేషన్‌ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. దీని వల్లే వరద ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఇరిగేషన్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు కృష్ణా నది ముఖ ద్వారంలో ఉన్న భవన నిర్మాణాలు కూడా వరద ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయనే వాదన కూడా ఉంది. కొల్లేరు కూడా ఆక్రమణలకు గురి కావడంతో బుడమేరు నుంచి వరద నీటిని స్వీకరించలేక పోతోందని, దీంతో వరద ప్రవాహం వెనక్కు తన్నడంతో వరదలు సంభవిస్తున్నాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఇరిగేషన్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.
Next Story