పది రోజుల తరువాత నష్టం వివరాలు, నీట మునిగిన ఇళ్ల గురించి తెలుసుకునేందుకు ఎన్యుమరేటర్లు వచ్చారు. మా ఇంటికి వచ్చిన వివరాలు తీసుకున్న వాళ్లది కడప జిల్లా అంట. ఆ విషయం మాకు వాలాంటీరు చెప్పారు. అన్ని వివరాలు తీసుకున్నారు. చుట్టుపక్కల కొంత మందికి సాయం రూ. 25వేలు, బైకులు నీట మునిగిన వారికి రూ. 3వేలు బ్యాంకు అకౌంట్లో వేశారు. మాకు మాత్రం రాలేదు. ఎందుకు రాలేదని తెలుసుకునేందుకు మా ఏరియాకు చెందిన 74వ సచివాలయానికి వెళ్లాను. మాకు ఎందుకు సాయం ఇవ్వలేదని అడిగితే తెలియదన్నారు. మీ ఫోన్‌కు మెసేజ్ వచ్చిందా అని ప్రశ్నించారు. రాలేదని చెప్పాను. అయితే మీకు రానట్లేనన్నారు. ఎందుకంటే తెలియదన్నారు. మీలాగే చాలా మందికి రాలేదని వారు కూడా ఆవేదనతో చెప్పారు. చాలా మంది సచివాలయానికి వచ్చి అడుగుతున్నారు. ఎన్యుమరేషన్ జరిగిన తరువాత చాలా మంది వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాలేదు. అందుకే రెండు రోజుల ముందు సచివాలయానికి వచ్చిన వారిని వివరాలు అడిగి అప్‌లోడ్ చేశాము. ఇప్పుడు మా చేతుల్లో లేదు. కలెక్టర్ ఆఫీసుకు వెళ్లాల్సిందేనన్నారు. అప్లికేషన్ ఏమైనా ఉందా అని అడిగాను. కలెక్టరేట్‌లోనే ఇస్తారన్నారు.
మా వాలంటీర్‌కు ఫోన్ చేశాను. మా వీధిలో కొంత మందికి డబ్బులు అకౌంట్లలో పడ్డాయి. మాకు రాలేదు. మా పక్క ఇంటి వాళ్లకు రాలేదు. చాలా మందికి మా వీధిలో రాలేదు. ఎందుకని అని అడిగాను. ఏమో నాకూ తెలియదు అన్నారు. మీరు కూడా ఎన్యుమరేటర్లతో వచ్చారు కదా. మీకెందుకు తెలియదు అంటే నిజమే వచ్చాను. వివరాలు వారే నోట్ చేసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. కొంత మందివి అప్‌లోడ్ అయ్యాయి. మరి కొంత మందివి కాలేదు. నేనేమీ చేయలేను అన్నారు. ఇప్పుడు సచివాలయం వాళ్లు రమ్మంటున్నారు. నేను వచ్చి వృధాగా వాళ్లకు పని ఎందుకు చేసి పెట్టాలి. ప్రభుత్వం మమ్మల్ని తీసుకుంటుందో లేదో ఇంత వరకు చెప్పలేదు. అందుకే నేను రాలేనన్నాను అని చెప్పి ఫోన్ పెటేసింది.
ఇక చేసేది లేక కలెక్టరేట్‌కు వెళ్లాను. శనివారం కలెక్టరేట్ గేట్ వద్ద వందల మంది కాగితాలు చేతపట్టుకుని ఉన్నారు. గేట్ మూసేసి ఉంది. లోపలివైపు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు కార్యాలయ సిబ్బంది ఉన్నారు. కాగితాలు తీసుకునే టైం ఉదమే అయిపోయింది. ఇక వెళ్లండి అంటూ గదమాయిస్తున్నారు. అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుందని అక్కడి వారిని అడిగాను. ఆదుగో ఆమె అమ్ముతుందన్నారు. ఆక్కడ ఒకావెడ కాగితాలు చేతపట్టుకుని ఉంది. ఒక కాగితం ఇమ్మని అడిగాను పది రూపాయలు ఇమ్మంది. పది రూపాయలు ఇచ్చి ఆ కాగితం తీసుకుని పూర్తి చేశాను. పొద్దుకూకుతున్నా చాలా మంది కాగితాలు పట్టుకుని నాలాంటి బాధితులు అక్కడే ఉన్నారు. అప్పుడు సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం అక్టోబర్ 9వ తేదీ వరకు అప్లికేషన్ ఇవ్వొచ్చని చూశాను. అందుకే వెళ్లాను. అయితే అర్జీ తీసుకోలేదు. కాసేపు చూసి వెనక్కి తిరిగి వచ్చేశాను.
ఇప్పుడు చెప్పండి నా పరిస్థితే ఇలా ఉంటే ఇంకా ఎంతో మంది పరిస్థితి ఇలాగే ఉంది. ఇది ప్రభుత్వ పెద్దల తప్పు కాదు. ఎన్యుమరేట్ చేసిన వారి తప్పు. ఎందుకు వారు సక్రమంగా చేయలేదో వారిపై చర్యలు తీసుకోవాలి.
ఇదీ విజయవాడలో ప్రస్తుత పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాథమికంగా అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం సుమారు 6 లక్షల మంది ప్రజలు వరదల భారిన పడ్డారని ప్రకటించారు. ఎన్యుమరేషన్ తరువాత 2.75 లక్షల కుటుంబాలు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వారి ఇళ్లు నీట మునిగాయని అధికారులు చెప్పారు. వీరందరికీ ప్రభుత్వం ప్రకటించిన విధంగా సాయం అందుతుందని చెప్పారు. ఇప్పటి వరకు అందని వారికి సోమవారం పూర్తిగా సాయం అందిస్తామన్నారు. ఈ రోజుకూ ఇంకా సాయం అందని వారు వేలల్లో ఉన్నారు.
ప్రభుత్వం చెబుతున్న లెక్కలు పరిశీలిస్తే 75,427 కుటుంబాల వారికి రూ. 25వేల వంతున సాయం అందించినట్లు ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ప్రకటించారు. మరి మిగిలిన రెండు లక్షల కుటుంబాల మాటేమిటి? బాధితులతో సీపీఎం వారు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. దానికి కూడా ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు.
విజయవాడ నగరంలోని వరద బాధితుల్లో సగం మందికి సాయం అందలేదు. బుడమేరు బాధితులు కొందరైతే, కృష్ణా నది ఒడ్డున్న ఉన్న బాధితులు కొందరు. ఎవరిని కదిలించినా ఏముందయ్యా... బుడమేరు గేట్లు ఎత్తారు... సాయం కోసం విజయవాడ కలెక్టరేట్‌కు వస్తే గేట్లు మూసేశారు... ముఖ్యమంత్రి నీట మునిగిన ప్రతి కుటుంబానికీ సాయం అందిస్తామన్నారు. మా ఇంటి ముందు వారికి వస్తే మాకు రాలేదు. ఇదేమి లెక్క.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అందరికీ సాయం అందిస్తున్నామని చెబుతున్నా ఎన్యుమరేషన్‌లో ఎన్నో లోపాలు ఉన్నాయని అర్థమవుతోంది. 30,722 మంది ద్విచక్ర వాహన దారులకు సాయం అందించినట్లు చెబుతున్నారు.
బుడమేరు బాధితులు కాకుండా కేవలం కృష్ణ లంక వరకు పరిశీలిస్తే ఇళ్లలో బైకులు, కార్లు పెట్టకునే వీలు లేదు. వీరంతా రోడ్డుపైనే పెట్టుకుంటారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి రామలింగేశ్వర నగర్ వరకు హైవేకు కింది భాగాన ఉన్న ఇళ్లన్నీ మొదటి అడ్డరోడ్డు వరకు పూర్తిగా మునిగాయి. అంటే సుమారు లక్షకు పైనే ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. ఈ లెక్కలు చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయి. బాధితుల ఆవేదన చూస్తుంటే ఏమిటిది? అని ఆలోచించాల్సి వస్తోంది. అంతా బాగానే ఉందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కానీ లక్షల మందికి ప్రభుత్వ సాయం అందలేదు. ఇది నిజమని బాధితులను కదిలిస్తే కథలు కథలుగా చెబుతున్నారు. ఇంట్లో తడిసి పాడైన వస్తువులకు నష్టపరిహారం ఇవ్వకపోయినా కనీసం మునిగిన ఇంటికి ఇస్తామన్న రూ. 25వేలు కూడా ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు అన్నిరకాల లబ్ధిదారులకు 1,09,729 ఖాతాల్లో రూ. 173.69 కోట్ల జమ చేసినట్లు కలెక్టర్ సృజన తెలిపారు. అసలు ఎన్యురేషన్‌కు నోచుకోని వారి పరిస్థితి ఏమిటనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న.