బొజ్జా తారకం ‘బుద్ధుని ప్రవచనం’ పుస్తకావిష్కరణ
x

బొజ్జా తారకం ‘బుద్ధుని ప్రవచనం’ పుస్తకావిష్కరణ

పేదల పక్షాన డబ్బులు తీసుకోకుండా వాదించిన న్యాయవాది బొజ్జాతారకం. ఆయన రచయితగా, అనువాదకుడిగా కూడా ప్రసిద్ధుడు. ఈ పుస్తకం ‘ద వరల్డ్ ఆఫ్ బుద్ధ’ కు అనువాదం


కారం చేడు కేసులో బాధితుల తరపున కన్నాభిరాన్, బాల గోపాల్ తో పాటు బొజ్జాతారకం కూడా వాదించారని, శిరోముండనం కేసులో నిందితుడికి శిక్షపడే వరకు బొజ్జాతారకం చాలా పోరాడాల్సి వచ్చిందని రిటైర్డ్ జిల్లా జడ్జి గుర్రప్ప గుర్తు చేశారు. బొజ్జాతారకం 85వ జయంతి సందర్భంగా ఆయన అనువాదం చేసిన ‘బుద్ధుని ప్రవచనం’ పుస్తకాన్ని తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా ఆయన మాట్టాడుతూ, పేదల పక్షాన డబ్బులు తీసుకోకుండా వాదించిన బొజ్జాతారకం న్యాయవాదిగా, రచయితగా, అనువాదకుడిగా ప్రసిద్ధులని గుర్తుచేశారు.


' బుద్ధిని ప్రవచనం ' పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతున్న రిటైర్డ్ జిల్లా జడ్జి గుర్రప్ప.

సభలో మరో ముఖ్యఅతిథి సీనియర్ జర్నలిస్ట్ రాఘవ మాట్లాడుతూ, భారత దేశంలో సంచారజీవనం నుంచి వ్యవసాయానికి అలవాటుపడి, ఒక స్థిర జీవనం మొదలైన కాలంలోనే మూడు ప్రధాన ఆలోచనలు మొదలయ్యాయన్నారు. ఒక పక్క వైదిక సాహిత్యం, మరొక పక్క బౌద్ధ, జైన రచనలు వెలువడి దేశంలో ఆలోచనలకు బీజం వేశాయన్నారు. బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గానికి, ప్రస్తుతమున్న బౌద్ధ మతానికి అసలు ఏ మాత్రం పొంతనే లేదని చెప్పారు. బుద్ధుడు అహింసను బోధిస్తే, బౌద్దం అధికార మతంగా ఉన్న మయన్మార్ లో రోహింగ్యా ముస్లింలను బౌద్ధ సన్యాసులే ఊచకోత కోశారని, బౌద్ధం అధికార మతంగా ఉన్న శ్రీలంక లో తమిళులను దారుణంగా హతమార్చారని గుర్తు చేశారు.

సభలో ప్రసంగిస్తున్న సీనియర్ జర్నలిస్టు రాఘవ


అధికారంలో ఏ మతమున్నా అల్ప సంఖ్యాకులపై దారుణాలు జరుగుతాయన్నారు. బుద్ధుడి ప్రవచనాల పేరుతో ప్రచారంలో ఉన్న వన్నీ బుద్ధుడి చెప్పినవి కావని, బుద్ధుడి పేరుతో ఆయన శిష్యులు కానీ, తరువాత వచ్చిన బౌద్ధ సన్యాసులు కానీ చెప్పినవేనని పేర్కొన్నారు.


సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ, బౌద్ధం ఎప్పుడైతే ఎల్లలు దాటి పోయిందో అప్పుడే దేశం ఆత్మహత్య చేసుకుందని గురజాడ చెప్పిన మాటను గుర్తుచేశారు. బౌద్ధ జైన దర్శనాలు ప్రశ్నించే తత్వాన్ని నేర్పాయన్నారు. ఈ రెండు దర్శనాలు ప్రశ్నని బతికించడానికి కృషి చేశాయని చెప్పారు. ఇటీవల గుజరాత్ లో 50 వేల మంది బౌద్ధాన్ని స్వీకరించారని, దేశంలో 79 లక్షల మంది బౌద్ధులు ఉన్నారని అన్నారు.



ఆలిండియా రేడియో విశ్రాంత డైరెక్టర్ ఆకుల మల్లేశ్వరరావు మాట్లాడుతూ, ఇంగ్లీషులో వచ్చిన ‘ద వర్ఢ్ ఆఫ్ ద బుద్ధ’ పుస్తకాన్ని బొజ్జాతారకం ‘బుద్ధుని ప్రవచనాలు’ పేరుతో అనువాదం చేశారని, ఇది పాళీ భాషలో ఉన్న రచనలకు మూలమని తెలిపారు. ఈ పుస్తకంలో అష్టాంగ మార్గం, నిర్వాణం గురించి ఉందని, ఇది కంఠస్తం చేసుకోవలసిన పుస్తకమని అన్నారు. దు:ఖం విముక్తికి సత్యం. దు:ఖం మాత్రమే కాదు, విముక్తి గురించి కూడా చెప్పిన దివ్య జ్ఞాని బుద్ధుడని కొనియాడారు. ‘బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి’ అని చెప్పిన వారు బౌద్ధులవుతారని అన్నారు.


సభకు అధ్యక్షత వహించిన దళిత సాహిత్య వికాస వేదిక బాధ్యులు పి.అంజయ్య మాట్లాడుతూ, బొజ్జాతారకం తండ్రి అమలాపురం లో పదేళ్ళు ఎమ్మెల్యేగా చేశారని, టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా నియమితులయ్యారని గుర్తు చేశారు. బొజ్జాతారకం 50 పుస్తకాలు రాశారని, పేదల పక్షపాతని పేర్కొన్నారు. వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి నాగార్జున, కవి గొడుగు చింత గోంవిదయ్య తోపాటు పలువురు సభలో ప్రసంగించారు.


Read More
Next Story