జగన్‌ ఎక్కువేమీ కాదు.. చంద్రబాబు తక్కువేమీ కాదు. ఇద్దరు తమ ఆధిపత్యం కోసం, పగలు, ప్రతీకారాల కోసం ఏపీలో బుల్డోజర్‌ సంస్కృతికి ఆజ్యం పోశారు.


ఉత్తరప్రదేశ్‌ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా బుల్డోజర్‌ సంస్కృతిని తెరపైకి తెచ్చారు. రాజకీయ ప్రత్యర్థుల భవనాలను అక్రమ కట్టడాలనే సాకుతో కూల్చేస్తున్నారు. విష సంస్కృతిని పాలకులే ఆంధ్రప్రదేశ్‌లో వెద జల్లుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తన పాలలను బుల్డోజర్‌తో కూల్చివేతలతోనే ప్రారంభించగా, ఇటీవల నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదే బాటలో పయనిస్తోంది. తామేమి తక్కువ కాదని బుల్డోజర్‌ కూల్చివేతలతోనే తమ పాలలను కూడా మొదలు పెట్టింది. ఎవరు అధికారంలో ఉంటే వారు ప్రతిపక్షంలో ఉన్న వారి భవనాలను నేల కూల్చడం పరిపాటిగా ఆంధ్రప్రదేశ్‌లో మారి పోయిందని, పాలకులే ముఠా నాయకులుగాను, ఫ్యాక్షనిస్టులుగాను మారి పోతున్నారని, ప్రత్యర్థులపై పగలు, ప్రతీకారాలను నెరవేర్చుకోవడానికి అధికారం కోసం వెంపర్లాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద గతంలో నిర్మించిన ప్రజావేదికను నిర్థాక్షణ్యంగా బుల్డోజర్లతో కూల్చివేయించారు. లక్షలాది రూపాయలు ప్రజా ధనం వెచ్చించి నిర్మించిన ప్రజా వేదికను తన ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలనే కనీస జ్ఞానం లేకుండా కేవలం చంద్రబాబు ప్రభుత్వం దీనిని కట్టించిందని, చంద్రబాబు ఇంటికి సమీపంలో ఉందనే కారణంతో ఆయన పగ తీర్చుకునేందుకు నేల మట్టం చేశారు. అందులో ఏర్పాటు చేసిన ఏసీలుతో పాటు ఉపయోగపడే ఇతర పరికరాలు, వస్తువులను కూడా కూలదోశారు. చంద్రబాబు నాయుడుపై ఉన్న అక్కస్సును ప్రజా వేదికను కూల్చడం ద్వారా తీర్చుకున్నారు. అంతటితో ఆగని జగన్‌ ప్రభుత్వం అక్రమ కట్టడాలనే సాకుతో విశాఖపట్నంలోని గీతం యూనివర్శిటీ నిర్మాణాలను కూడా కూల్చివేసింది. అంతేకాకుండ విశాఖలోని టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇల్లును కూడా కూల్చింది. ఇలా పలువురు టీడీపీ నేతల ఆస్తులను నేల కూల్చిందనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి.
ఇటీవల అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇదే దారి పట్టింది. జగన్‌ ప్రభుత్వం తమ ఆస్తులను కూల్చి, ఏ విధంగా పగ తీర్చుకుందో, అలాగే చంద్రబాబు ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చీ రాగానే బుల్డోజర్లకు పని పెట్టింది. తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయాన్ని అక్రమ కట్టం పేరుతో నిర్థాక్షణ్యంగా బుల్డోజర్లను పెట్టించి నేల మట్టం చేసింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగ నిర్మాణంలో ఉన్న ఆ పార్టీ కార్యాలయాలపై దృష్టి పెట్టింది. అనుమతులు లేకుండా భారీ భవనాలను నిర్మిస్తున్నారని వాటిని నేల కూల్చేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది.
ఇదే సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. తిరువూరులో స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసులు ఏకంగా రంగంలోకి దిగారు. కారుపైకి ఎక్కి వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీపీకి చెందిన భవనం అక్రమంగా కట్టారని, దీనిని తక్షణమే నేల మట్టం చేయాలని ఆజ్ఞలు ఇవ్వడం రాజకీయ పగలు, ప్రతీకారాలు ఏ స్థాయిలోకి వెళ్లాయో అర్థమవుతుంది. కాకినాడలో కూడా ఇదే రకమైన సంఘటన చోటు చేసుకుంది. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడు బళ్లా సూరిబాబు భవనాన్ని కూల్చేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు, అధికారులు ఒక పక్క మరో పక్క వైఎస్‌ఆర్‌సీపీ నేతలు గుంపులుగా చేరడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.
ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను మరో ఉత్తరప్రదేశ్‌లా పాలకులే మారుస్తున్నారు. రాజకీయంగా ఉన్న వైరాన్ని వ్యక్తిగత కక్షలుగా మర్చుకుంటూ పగలు, ప్రతీకారాలు తీర్చుకునేందుకు రెచ్చి పోతున్నారు. ఎన్నడు లేని విధంగా బుల్డోజర్‌ సంస్కృతిని అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను అల్లకల్లోలం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే జగన్‌ మోహన్‌రెడ్డి తన ప్రభుత్వంలో ఇష్టా రాజ్యంగా వ్యవహరించగా, ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే వ్యవహరించడంతో బుల్డోజర్‌ సంస్కృతి చివరకు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందనే భయాందోళనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో నెలకొన్నాయి.
Next Story