అన్నపై చెల్లి సమరం. వ్యక్తిగత వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడతారా, ఏమ్ పీక్కుంటారో పీక్కోవాలని సవాల్ విసురుతున్నారు షర్మిల.


ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాటల తూటాలు పేలుస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకునే రోజు నుంచే అన్నపై సమరం మొదలు పెట్టారు. తొమ్మది రోజుల పాటు ఆంధ్రపదేశ్ నలుమూలల కాంగ్రెస్ పార్టీ సమావేశాలు పెట్టారు. ఈ సమావేశాల్లో తన అన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకు పడ్డారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకునేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడలోని ఆహ్వానం కళ్యాణ మండపానికి వెళుతుండగా పర్మిషన్ లేదంటూ పోలీసులు వాహనాలను రోడ్డు మధ్యలో ఆపారు. అప్పటి నుంచే అన్నపై చెల్లి సమరశంఖం పూరించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మొదలైన పర్యటన కర్నూలు జిల్లాలో ముగిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రాష్ట్ర సమస్యలపై స్పందించారు. సీఎం జగన్, చంద్రబాబు నాయుడు బీజేపీకి తొత్తులుగా మారారంటూ విమర్శిస్తూ వచ్చారు. రాజమండ్రి చేరుకున్నాక ఆమె స్వరం పూర్తిగా మారింది. అప్పటి వరకు ప్రత్యేక హోదా, పోలవరం, అప్పులు, రైతులు పడుతున్న బాధలు, ఇతర సమస్యలపై స్పందిస్తూ వచ్చారు.




సజ్జలపై నిప్పులు చెరిగిన షర్మిల

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తూర్పుగోదావరి జిల్లాలో నిప్పులు చెరిగారు. ఒక జోకర్ తో నాపై విమర్శలు గుప్పిస్తున్నారని మండి పడ్డారు. ఇక ప్రతి జిల్లాలోనూ సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. సోషల్ మీడియాలో తనపై లేనిపోని విమర్శలు వైఎస్సార్సీపీ వారు ఎక్కుపెట్టారని చెబుతూ సజ్జల రామకృష్ణారెడ్డిని దుయ్యబట్టారు. సజ్జల కుమారుడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాకు ఇన్చార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ‘వైఎస్సార్సీపీ అంటే వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి’ అంటూ కొత్త అర్థం చెప్పారు. రామకృష్ణారెడ్డి నోరు అదుపులో ఉంచుకోవాలంటూ హెచ్చరిక కూడా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు రాగానే మరో కొత్త అర్థానికి తెరతీశారు. బీజేపీ అంటే ‘బాబు, జగన్, పవన్’ అంటూ కొత్త అర్థం చెప్పి పార్టీ కార్యకర్తలు, నాయకులను మెప్పించగలిగారు.

రాష్ట్రంలో బీజేపీ అనధికారిక పాలన

ఇక కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రజా సమస్యలు, స్థానికంగా ఉన్న ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా, నిరుద్యోగులకు ఉద్యోగాలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ అధికార పక్షానికి కాంగ్రెస్ అధ్యక్ష్హురాలు వైఎస్ షర్మిల కొరకరాని కొయ్యగా మారారు. తెలుగుదేశం పార్టీ విమర్శలనైనా తట్టుకుంటున్నారు కానీ షర్మిల విమర్శల ధాటికి వైఎస్సార్సీపీ వారు తట్టుకోలేకపోతున్నారు. బీజేపీ అనధికారికంగా రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నదని, ఈ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ, టీడీపీ ఎంపీలు గెలిచినా కేంద్రంలోని బీజేపీ చెప్పినట్లు ప్రభుత్వం కేంద్రానికి ఊడిగం చేస్తున్నదని విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం కూడా ఇదే తంతు కొనసాగిస్తున్నదని, ఎవరికి ఎవరూ తీసిపోవడం లేదని ఎద్దేవా చేశారు.

రాయలసీమ జిల్లాల్లో జగన్ పై తీవ్ర విమర్శలు

ఇక రాయలసీమ జిల్లాల్లో స్వరం బాగా పెంచారు. ఏమి చేసుకుంటారో చేసుకోండి, ఏమి పీక్కుంటారో పీక్కోండి అంటూ హెచ్చరించారు. సమస్యలు ప్రశ్నించడమే తప్పా అంటూ పిరంగులు వదిలారు. ఆమె మాటల తూటాలకు ముందుగా సీఎం జగన్ కు, ఆ తరువాత చంద్రబాబుకు దిమ్మ తిరిగింది. కేంద్రాన్ని నిలదీసే దమ్మూ ధైర్యం మీకు లేకపోతే మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి, ఎందుకు ఓటెయ్యాలి అంటూ ప్రశ్నించారు. బీజేపీకి బానిసలయ్యారు. బీజేపీ వశమైంది ఆంధ్రప్రదేశ్. బీజేపీ అంటే బాబూ, జగన్, పవన్. దేశమంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు. బీజేపీ ఏపీకి ఏమీ చేయదు. అయినా బీజేపీకి ఊడిగం చేస్తారు. బానిసలవుతారు. ఎన్నికలొచ్చాయి అంటూ ఈ ఎన్నికల్లో జాతకాలు మారాలి. ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ క్యాడర్ కు పిలుపునిచ్చారు.

జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక నియంతగా మారాడు

కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల జిల్లాల పర్యటనలో షర్మల చేసిన వ్యాఖ్యలు కాకపుట్టించాయి. తన అన్న సీఎం జగన్ మోహన్ రెడ్డిపైనే ఎక్కువ విమర్శలు గుప్పించారు. తాను ఆడపిల్లనని కూడా చూడకుండా ఉచ్చ నీచాలు మరిచి నాపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే నేను పులి బడ్డనంటూ అన్నకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా కడప జిల్లాలో ఏమన్నారో ఆమె మాటల్లోనే...

ఇది కడప జిల్లా. మిగిలిన జిల్లాల కంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అధికార పార్టీపై, ప్రతిపక్షమైన టీడీపీపై ఎక్కువ త్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే ఇది జగన్ మోహన్ రెడ్డి జిల్లా కాబట్టి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మనిషి మారిపోయాడు. ఈ జగనన్న నాకు తెలియదు. నేను వైసీపీ కోసం నిస్వార్థంగా 3,200 కి.మీ. పాదయాత్ర చేశా. నా ఇంటినీ, బిడ్డలను పక్కన బెట్టి నా సర్వస్వాన్నీ వదులుకొని ఎండనకా వాననక రోడ్లమీదనే నడిచా. ఆరోజు ఆపార్టీకి ఉనికే లేకుండా పోతుందని భయపడుతుంటే ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్క మహిళగా పాదయాత్ర సాగించా. ఈరోజు వైసీపీకి, వాళ్ల సోషల్ మీడియాకు అవేవీ గుర్తులేవు. నేనోక మహిళనని, వైసీపీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని, రాజశేఖర్ రెడ్డి బిడ్డనని గానీ, వాళ్లకు ఇంత మేలు చేసిన దాన్నని కానీ గుర్తు పెట్టుకోలేదు. ఈరోజు మూకుమ్మడిగా నామీద దాడులు చేస్తున్నారు. సిగ్గు ఎగ్గూ లేకుండా, ఉచ్చం నీచం లేకుండా వ్యక్తిగతంగా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. నిన్నయితే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే చెబుతున్నాడు. నా భర్త సోనియాగాంధీ దగ్గరకు వెళ్లాడట. ఆయనకు పదవీ కాంక్ష ఎప్పటి నుంచో ఉందట, సోనియాగాంధీతో నా భర్త చెప్పాడట, షర్మలమ్మను ముఖ్యమంత్రిని చేయండి, మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. జగన్ ను జైల్లో పెట్టండని నా భర్త ఆమెకు చెప్పాడట. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ లేరు. అలాంటి పెద్ద మనిషిని కూడా వదలడం లేదు. మీ కుట్రలకు, కుతంత్రాలకు అద్దు, అదుపు ఉందా? నా భర్తకు పదవీ కాంక్ష ఉందా? మాకు పదవీ కాంక్షే ఉంటే మానాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఒక్క పదవైనా తీసుకున్నామా? మాకు పదవీ కాంక్ష ఉంటే తప్పకుండా తీసుకునే వాళ్లం కదా. నేను పదవీ కాంక్ష ఉన్నదాన్నే అయితే మీకోసం నేను పాదయాత్ర చేయడం ఏమిటి? నాకోసం నేను పాదయాత్ర చేసుకుంటే సరిపోతుంది కదా. నా భర్త సోనియాగాంధీ వద్దకు వెళ్లాడట. నా భర్త వెళ్లింది భారతీరెడ్డితో పాటు, పోనీ నా భర్త షర్మలమ్మను ముఖ్యమంత్రిని చెయ్యమని అడిగారంటున్నారే, అది భారతిరెడ్డి ముందు అడిగాడా వెనకాల అడిగారా.. పోనీ దీనికి భారతీరెడ్డి సాక్ష్యం చెబుతారా? పోనీ ప్రణబ్ ముఖర్జీ చెప్పారంటున్నారే ఆయన ఆన్ రికార్డు ఎక్కడైనా ఈ మాట మాట్లాడారా.. ఆయన ఇప్పుడు చనిపోయారు, ఆయన ఇప్పుడు బదులు చెప్పలేడు. పోనీ ఆయన కొడుకు చేతైనా చెప్పించండి. మీకు దమ్మూ, దైర్యం వుంటే ఒక్క మాట రుజువు చేసుకోగలరా? పనికి మాలిన వారిచేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే, ఆడపిల్లననే ఇంగితం కూడా లేదా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా?

సాక్షిలో నాకూ సమానభాగం

ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్ లు చేసి షర్మలమ్మకు వ్యతిరేకంగా మాట్లాడితే మేము మీకు సాక్షిలో కవరేజ్ ఇస్తామని చెప్పిస్తున్నారు. అక్కడ తెలంగాణ పార్టీలో నాతో కలిసి పనిచేసిన వాళ్లు నాకు ఫోన్ చేసి అమ్మా మాకు ఇలా చెబుతున్నారంటున్నారు. ఇంతగా దిగజారాల్సిన అవసరం వుందా? మీరు ఏ సాక్షి ద్వరా అయితే ఇంతగా దూషణలు చేస్తన్నారో ఇదే సాక్షిలో నాకు భాగం వుంది. జగన్ మోహన్ రెడ్డికి ఎంత భాగం ఉందో అదే సాక్షిలో రాజశేఖర్ రెడ్డి బిడ్డకు కూడా అంతే బాగం వుందని రాజశేఖర్ రెడ్డి నిర్ణయించారు. ఇది రాజశేఖర్ రెడ్డి నిర్ణయం. ఏ సాక్షిలో అయితే సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకుని నామీద దూషణలకు పాల్పడతారా? ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా? ఇంత నీచంగా వ్యవహరిస్తారా? వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముందీ అని అడుగుతున్నా. నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా, ఒక్కదానికైనా సమాధానం చెప్పారా? ఒక జోకర్ తో చెప్పించి దాన్ని సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఇస్తున్నారు.

ఏంపీక్కుంటారో పీక్కోండి.. ఖబర్ధార్..

విలువలు, విశ్వసనీయతలు అని పెద్దపెద్ద మాటలు చెప్పారు. మీకు లేవా విలువలు, విశ్వసనీయతలు. తెలుగు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పడుతుంది. రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే.. ఎవరు కాదన్నా, ఔనన్నా, ఎవరు ఘీపెట్టినా నేను వైఎస్ షర్మిల రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడకొచ్చా. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు. పోలవరం వచ్చేంతవరకు రాజశేఖరరెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. అంతవరకు రాజశేఖరరెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు. ఏమి చేసుకుంటారో చేసుకోండి. ఏమ్ పీక్కుంటారో పీక్కోండి. ఇక్కడ భయపడే వాళ్లు ఎవ్వరూ లేరు. ఖబడ్దార్.

Next Story