అయ్యా.. ఎస్‌ఐ.. పీఎస్లూ.. అట్టుంటదయ్యా మరి!
x

అయ్యా.. ఎస్‌ఐ.. పీఎస్లూ.. అట్టుంటదయ్యా మరి!

అధికారంలో ఉన్న వారితో అంట కాగితే.. అక్షింతలు తప్పవు. గతం నేర్పిన అనుభవాల నుంచి బ్యూరోక్రాట్లు ఏమి నేర్చుకున్నారు?!


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: స్వామిభక్తిని ప్రదర్శించి బదిలీ అనే శిక్షకు గురైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆంధ్రలో కొదవేమీ లేదని ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బదిలీలు భారీగానే జరుగుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వారిలో రాష్ట్ర ఇంటలిజెన్స్ డిజి పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఉన్నారు. 2024 సార్వత్రికలు ఎన్నికలు పూర్తయ్యే వరకు వారికి ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని సిఈసి ఆదేశాలు జారీ చేసింది. వారి స్థానాల్లో కొత్తవారిని నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసి అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్ పంపాలని కూడా సూచించింది. ఈ తరహాలో చర్యలకు గురైన వారిలో వీరు చివరి వారు కాకపోవచ్చు.

ఆ సంఘటన పాఠం కాదా?

అధికారంలో ఉన్న వారు సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించి పాలన వ్యవహారంలో సహకారం అందిస్తే.. చర్యలు ఉంటాయనే విషయం ఈ బదిలీలతో తేటతెల్లం అవుతుంది. ఇందుకు సంబంధించిన ఓ సంఘటనను చూద్దాం.. 2004- 2009 వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా సబిత ఇంద్రారెడ్డి ఉన్నారు. కడపలో ప్రతిపాదించిన బ్రహ్మనీ స్టీల్ ప్లాంట్ కోసం క్యాప్టివ్ మైన్స్‌గా భావించే ఓబులాపురం గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని తరలించడానికి అనుమతులు మంజూరు చేయడంలో చోటుచేసుకున్న వ్యవహారంపై సీనియర్ ఐఏఎస్ అధికారి వై. శ్రీలక్ష్మిని సిబిఐ అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో అవినీతి కేసులో సిబీఐ అరెస్టు చేసిన తొలి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అని అప్పట్లో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ వ్యవహారం ఎన్నికలకు సంబంధించినది కాకపోయినప్పటికీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సర్వీస్ రూల్స్ పాటించాలనే విషయాన్ని చెప్పకనే చెబుతుంది.

క్రమశిక్షణా చర్యలను ప్రస్తావించినప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు ఏమంటున్నారంటే... "రాష్ట్రంలో అధికారులకు ఉన్నట్లే.. కేంద్ర సర్వీస్ అధికారులకు కూడా అవే నిబంధనలు ఉంటాయి. తప్పిదాలను ఢిల్లీలో ఎస్ఆర్ (సర్వీస్ రిజిస్టర్లో) నమోదు చేస్తారు. రాజకీయంగా అండదండలు ఉన్న వారు నెగ్గుకొస్తారు. అది లేని ముక్కుసూటి అధికారులే కాస్త ఇబ్బందులకు గురవుతారు’’ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు అంటున్నారు. ఇదిలా ఉంటే..

ప్రభుత్వ నిబంధనలు అలా ఉంటాయి..

రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు సామాన్య ప్రజలకు మేలు చేశాయి. రాజకీయ ప్రజాప్రతినిధులు చేసే ఆరోపణలపై చాలామంది స్పందించరు. అందుకు ప్రధాన కారణం సర్వీస్ నిబంధనలు ప్రజాప్రయోజనాలపై ఉన్న గౌరవం. హద్దు మీరితే మాత్రం అధికారులు కాదు కింది స్థాయికి సిబ్బంది కూడా ఉపేక్షించరు. ఒకవేళ సీరియస్‌గా స్పందించిన, రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో తగ్గాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడుతుంది.

అందుకు సాక్షాలుగా అనేక సంఘటనలు ఉన్నాయి. అధికారులపై ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. అయితే, రోజుల వ్యవధిలోనే బదిలీ అయిన అధికారులు మౌనంగా వెళ్లడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తిరుపతి జిల్లాకు మొదటిసారి వచ్చిన మహిళ ఐపీఎస్ అధికారి మల్లికా గర్గ్. ఆమె బాధ్యతలు స్వీకరించిన రోజుల వ్యవధిలోనే బదిలీ అయ్యారు. అది కూడా ప్రభుత్వంపై రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లే. " ప్రభుత్వ ఉద్యోగులుగా ఎక్కడికి బదిలీ చేసినా వెళ్లడం అనేది మాకు ఇచ్చిన బాధ్యత" అని కూడా ఆమె అప్పట్లో ఫెడరల్ ప్రతినిధితో వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం వేరు. వివాదాస్పద నేపథ్యంలోకి వస్తే..

తప్పని ముట్టికాయలు...

అయితే రాజ్యాంగ నిబంధనలకు లోబడి పని చేయాల్సిన వారు వాటిని అతిక్రమించారంటూ ఎందరో ఐఏఎస్ అధికారులకు విభజిత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్వల్పకాలిక శిక్షలు అనేకం వేసింది. సర్వీస్ రూల్స్ అమలు చేయడంలో కోర్టు ఆదేశాలు ధిక్కరించారన్న ఆరోపణపై గత ఏడాది నవంబర్లో విద్యాశాఖకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు శ్యామలరావు పోలా భాస్కర్‌కు న్యాయస్థానం నెల రోజుల జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానా కూడా విధించింది. ఇది ఉదాహరణ మాత్రమే.

నకిలీ ఎపిక్ కార్డులతో ప్రారంభం...

ప్రస్తుత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ కాలంలోనే.. చిత్తూరు జిల్లా తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించడం వల్ల 2021 ఏప్రిల్ 17వ తేదీన ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో 33 వేల నకిలీ ఎపిక్ కార్డులో జారీ అయ్యాయని ఆరోపణతో పాటు, ఆ కార్డుల ఆధారంగా దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యంపై టిడిపి నాయకులు జిల్లాస్థాయి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి సోమవారం ఫిర్యాదు చేశారు.

అనేక మలపులు తిరిగిన తర్వాత 2.5 ఏళ్ల తర్వాత డొంక కదిలింది. అప్పటి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన గిరీషపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ వేటువేసింది. ఆ సమయంలో ఆయన కడప జిల్లా నుంచి వేరుచేసి కొత్తగా ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. ఇటీవల ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసింది అది వేరే విషయం.

నకిలీ ఎపిక్ కార్డుల వ్యవహారంలో కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తిరుపతి తూర్పు సీఐ బీవీ శివప్రసాద్ రెడ్డి, ఎస్సై ఏ జయ జయ స్వాములు, హెడ్ కానిస్టేబుల్ కే ద్వారకానాథ్ రెడ్డి, తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో దర్యాప్తును పక్కదారి పట్టించినందుకు సీఐ శివప్రసాద్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. వీరిని సస్పెండ్ చేస్తూ అప్పట్లో అనంతపురం డిఐజి ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇది ఎన్నికలకు సంబంధించిన వ్యవహారమే.

దెబ్బ మీద దెబ్బ....

ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికార వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు నాయకుల కనుసనల్లో పనిచేస్తున్నారు అంటూ అనేకమంది అధికారులపై టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. బిజెపి రాష్ట్ర నాయకత్వం కూడా కేంద్రానికి ఫిర్యాదు చేసింది. వీటన్నిటిని అందుకున్న కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది.

2024 సార్వత్రిక ఎన్నికల క్రియలు ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. ఒకేసారి ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులపై కొరడా ఝులిపించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పి రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అనుబురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిపై వేటు వేసింది. వారందరినీ ఎన్నికల విధుల నుంచి తప్పించి, సాధారణ విధుల్లోకి తీసుకోవాలని కూడా సంఘం సూచించింది. అంతేకాకుండా సీనియర్ ఐపీఎస్ అధికారి గుంటూరు రేంజ్ ఐజి జి బాలరాజును కూడా బదిలీ చేసింది. వారిలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రకాశం జిల్లా వద్ద జరిగిన బహిరంగ సభలో భద్రత వైఫల్యాలకు బాధ్యులను చేస్తూ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని ఆ విధుల నుంచి పక్కకు తప్పించారు.

ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు! విభజిత రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో అధికారులు ఎన్నికల సంఘం వేటుకు గురి కావడం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదులు వెళితే పరిశీలన విచారణ అనంతరం చర్యలు తప్పవని తెలిసినా కొందరు అధికారులు అధికార పార్టీ వారితో అంట కాగుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర సర్వీస్ రూల్స్‌ను పాటించాల్సిన అధికారులు, రాష్ట్రంలో పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షించడానికి కీలకపాత్ర వహించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీరు చర్చనీయాంశం అవుతోంది. కొందరి వల్ల ఆ శాఖల పరువు, ప్రతిష్టపై మసకపడుతోందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం వేటుకు గురైన బ్యూరోక్రాట్స్‌పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు ఏమంటున్నారంటే… "నిత్యం నీటిలో తిరిగే చేప.. నీరు తాగడం చూడగలమా? చూశామా!" అని ధర్మ సందేహాన్ని ముందుంచారు.

"వారిని ఎన్నికల విధుల నుంచి మాత్రమే తప్పించారు. తీవ్రమైన ఒత్తిడి వంటి విధుల నుంచి బయటపడే వారికి మంచి సమయం దొరుకుతుంది. అప్పుడు ప్రభుత్వానికి ఇంకాస్త ఎక్కువ సహకారం అందించేందుకు అవకాశం లేదా? ఉంటుంది కదా!" అని ఫెడరల్ ప్రతినిధితో అన్నారు. ఇక్కడ అమలు అయ్యేదంతా చాణిక్యనీతే. అధికారులను తప్పించింది ఎన్నికల విధులు నుంచే కదా. బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించి ఉంటే వేరేగా ఉంటుంది. అది జరగదు సాధ్యం కాదు.

"ప్రతిపక్షాలు చేసే ఫిర్యాదులపై విచారణ అనంతరం తాత్కాలిక చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత పరిశీలిస్తారు" అంటూనే.. "గతంలో ఈ తరహా సంఘటనలు అనేకం జరిగాయి. ఇప్పుడు ఏమి కొత్తవి కాదు. కాకుంటే మీడియా ఈ ప్రాంతంలో ఈ సంఘటనను హైలేట్ చేస్తోంది" అని దాసరి శ్రీనివాసులు అంటున్నారు. " నా సర్వీసులో ఐదారు రాష్ట్రాలకు పరిశీలకునిగా వెళ్లాను" ప్రతిపక్షాలు చేసే ఫిర్యాదులపై అప్పటికప్పుడు చర్యలు ఉంటాయి. వాటిలో ఎన్నిటికి సరైన సాక్షాలు ఆధారాలు చూపగలరు అనేది ప్రశ్న" అని ఆయన తన అనుభవాలను పంచుకున్నారు.

ఆ ఇద్దరిని ఎందుకు తప్పించారు..

తాజాగా విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఇంటెలిజెన్స్ ఐజి పీఎస్ఆర్ ఆంజనేయులును ఎన్నికల విధుల నుంచి తప్పించాడానికి అసలు కారణం ఏంటి? ప్రధాని మోదీ పర్యటనకు వచ్చినప్పుడు తమ పార్టీ శ్రేణులను సభకు రానీకుండా అవరోధాలు సృష్టించారంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం పైనే పీఎస్ఆర్ ఆంజనేయులుపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు దిగినట్లు భావిస్తున్నారు.

విజయవాడలో కూడా పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తమ పార్టీ కార్యకర్తలను అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని కూడా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు కేంద్రానికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల నేపథ్యంలోనే వారిని ఎన్నికల విధులు నుంచి మాత్రమే తప్పించారు. ఈ పర్యవసానాల నడుమ ఆ అధికారుల ద్వారా ప్రభుత్వానికి మరింత మేలు జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Read More
Next Story