సీఎం చంద్రబాబు ముందు టీడీపీలో ద్వితీయశ్రేణి నేతలు ఎదురు చెప్పాలంటేనే జంకుతారు. అలాంటిది మిత్రపక్ష జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాతోనే తనదైన పాలన సాగించాలని ఉవ్విళ్లూరడమే సంబంధం లేని శాఖల్లో అవినితి, పరిపాలన తీరును ప్రశ్నించడంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఈ చర్యల ద్వారా పరిపాలన వ్యవహారాల్లో రెండో కేంద్ర బిందువుగా మారినట్లు కనిపిస్తోంది. తనను ప్రశ్నించే స్వభావాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ఈ పరిణామాలను స్వాగతించాల్సిన పరిస్థితుల్లో ఉన్నట్లే కనిపిస్తోంది.
ఎన్నికలకు ముందు ప్రచారం జరిగినట్లు పవన్ కల్యాణ్ హోంశాఖ తీసుకుకోకపోవడమే టీడీపీకి మేలు చేసిందా? అంటే పరిస్థితులు మాత్రం ఔననే సమాధానం ఇస్తున్నాయి. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం వ్యవహారంతో ఈ విషయం తెరపైకి వచ్చింది.
టీడీపీ కూటమిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్టైల్ ఓ సినిమాను తలపిస్తోంది.
ఓ సినిమాలో గిరిబాబు సీఎం. అతనిది మైనార్టీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నది ప్రతిపక్షంలోని డాక్టర్ రాజశేఖర్ నాయకత్వంలోని పార్టీ. ఆ సినిమాలో రాజశేఖర్ హోమ్ మినిస్టర్. హోంశాఖ మంత్రి అంటే ఏ విభాగంలో అయినా జోక్యం చేసుకోవచ్చు. ఆ సినిమాలో హీరో రాజశేఖర్ అదే చేశాడు. అవినీతిపై కొరడా పట్టిన రాజశేఖర్ విద్యా వ్యవస్థలో లోపాలు ఎత్తిచూపుతాడు. పేదలకు రేషన్ బియ్యం పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెడతాడు. దీనిపై మంత్రివర్గ సమావేశంలో కమెడియన్లుగా ఉన్న విలన్లు నిగ్గదీస్తారు.
"హోంశాఖ అంటే ఏంటో తెలుసా? ఏ శాఖలో అయినా జోక్యం చేసుకునే పవర్ ఉంది" అని సమాధానం ఇచ్చే హీరో రాజశేఖర్ ఏకంగా తుపాకీతో సమాధానం చెబుతారు.
సీన్ కట్ చేస్తే
2024 ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీకి టీడీపీని దగ్గర చేయడంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలో ఎన్డీఏ సారధ్యంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. అందులో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పవన్ 'సినిమా టిక్స్' బాగా పండిస్తున్నారు. దీనికి జనంలో కూడా హీరో ఇమేజ్ మరింత పెంచింది.
రాష్ట్రం నుంచి కేంద్రంలోని బీజేపీ పెద్దలకు బాగా కావాల్సిన వ్యక్తిగా పవన్ కల్యాణ్ ఎదిగారు. ఆ మేరకు ప్రస్తుతం ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధాని మోదీ నుంచి కేంద్ర మంత్రుల వరకు పవన్ పాపులారిటీ పెరిగింది.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఆంధ్రాకు సరిహద్దు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన అన్ని స్థానాలు బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఈ పరిణామంపై పవన్ కల్యాణ్ ను కేంద్ర హోంశాఖ మంత్రి "క్రౌడ్ పుల్లర్" అని పొగుడుతూ ఆకాశానికి ఎత్తారు. ఈ పరిస్థితుల్లో ..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ కాకపోవడమే చంద్రబాబుకు మేలు చేసిందా? ఒకవేళ అయ్యుంటే..!?
టిడిపి కూటమి అధికారంలోకి రావడానికి జనసేన మద్దతు కలిసి వచ్చింది. అని అనడం కంటే, వైసీపీపై ఉన్న వ్యతిరేకత టీడీపీ కూటమికి కలిసొచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. కేంద్రంలో పలుకుబడి కలిగిన పవన్ కళ్యాణ్ మొదట హోం శాఖ మంత్రి అవుతారని ప్రచారం జరిగింది. సీఎం చంద్రబాబు రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించి, దళిత మహిళ వంగలపూడి అనితకు హోంమంత్రి పదవి కట్టబెట్టారు. టోపీ ఆమె నెత్తిన పెట్టి, లాటి చంద్రబాబునాయుడు చేతిలో ఉంచుకున్నారు. అనేది జగమెరిగిన సత్యం. అయితే,
టీడీపీ కూటమిలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక బాధ్యత పోషిస్తున్నారు. తాజాగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలోనే ఆయన ప్రతి విషయంలో చొరబడి పోతున్నారు. ఆ క్రమంలోనే కాకినాడ పోర్టులో చౌక బియ్యం స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో "ఆ ఓడను సీజ్ చేయమని ఆదేశాలు జారీ చేయడంతో పాటు, ఈ విషయాన్ని నేరుగా కేంద్రంతోనే మాట్లాడుతా" అని కూడా ప్రకటించారు. దీనివల్ల మనకు అర్థం అయ్యేది సీఎం చంద్రబాబును ఓవర్ లుక్ చేస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతున్నప్పటికీ సీఎం చంద్రబాబు నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే, తనకు ఉన్న అధికార పరిధికి మించి, చక్కగా సద్వినియోగం చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నోరుమెదపడ లేదు.
" వాస్తవానికి డిప్యూటీ సీఎం అనే హోదా రాజ్యాంగంలో లేదనేది నిపుణుల అభిప్రాయం. అధికార పార్టీలో పదవులతో సంతృప్తి పరచడానికి దీనిని సృష్టించారు" అనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాట.
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా మారింది. "ఓట్లు చీలనివ్వను. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడమే నా ముందు నా కర్తవ్యం" అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించారు.
ఆ తర్వాత సీట్లు పంపకంలో కూడా పరిస్థితులకు రాజీ పడ్డారు. సుపక్షం జనసేన నుంచి అసంతృప్తులు వ్యక్తమైన వారిని పవన్ కళ్యాణ్ తనదైన పద్ధతుల్లో సముదాయించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత, సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ, పవన్ కళ్యాణ్ అటవీ, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ మంత్రి శాఖలు కీలకమైనవి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలపై నాలుగు నెలల తరువాత అంటే నవంబర్లో పవన్ కళ్యాణ్ మాటలతూటాలుపేలిచారు.
"హత్యాచారాలు. గంజాయి అక్రమ రవాణా. శాంతిభద్రతలు" ఈ సమస్యలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. " నేనే కనుక హోమ్ మంత్రిని అయి ఉంటే.." అని చేసిన వ్యాఖ్యల ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలో పూర్తిగా లోపించాయనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. చివరికి పోలీసు అధికారులను కూడా ఆయన వదలలేదు. ఈ వ్యవహారం టిడిపి కూటమిలో పెను ప్రకంపనలు సృష్టించింది.
ఈ అంశంపై అనంతపురంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు "కళ్యాణ్ గారు ఏ కేసుకు సంబంధించి మాట్లాడారో నాకు తెలుసు. ఆయనతో నేను మాట్లాడతా" అని చెప్పడం ద్వారా అగ్నికి మరింత ఆజ్యం పోశారు. ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారినా, సీఎం చంద్రబాబు తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించి సమస్యను టీ కప్పులో తుపానులా చల్లబరిచారు. ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు ట్రబుల్ షూటర్ గా నిరూపించుకున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం దాదాపు కొన్ని రోజులపాటు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
బియ్యం స్వాధీనంతో..
వైసీపీ పాలనలో సాగిన వ్యవహారాలపై టీడీపీ కూటమి దృష్టి నిలిపిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందులో భాగంగా కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి "ఆర్థిక మూలాలపై దృష్టి పెట్టారు" అందుకు తగినట్టుగానే అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రొయ్యలశుద్ధి పరిశ్రమల వ్యవహారంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పక్కాగా దొరికారు. అంతేకాకుండా, పేదల బియ్యం అక్రమ రవాణాల్లో కూడా పట్టుబడ్డారు.
ఈ వ్యవహారాలు చూడడానికి జనసేన నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న నాదెండ్ల మనోహర్ ఉండనే ఉన్నారు. కానీ ఈ వ్యవహారాలపై జోక్యం చేసుకోవడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు.
"తనది కాని మంత్రిత్వ శాఖలపై జోక్యం ఉండకూడదు" అని సీఎం చంద్రబాబు చెప్పే సాహసం చేయలేని పరిస్థితి. అవినీతిపై కూడా కొనసాగింపులో తాజాగా కాకినాడ పోర్టులో రవాణాకు సిద్ధంగా ఉన్న ఓడను స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఓడలో పరిశీలించడంతోపాటు అధికారుల మందలించారు. "సీజ్ ద షిప్" అని ఆదేశాలు కూడా జారీ చేశారు.
ఇక్కడ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కంటే, సీఎం చంద్రబాబును కూడా కాదని డిప్యూటీ సీఎం హోదాలోని పవన్ కళ్యాణ్ తన విస్తృత అధికారాలను వినియోగించినట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో జనసేన పార్టీ శ్రేణులు, పేదల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. కానీ,
సీఎం చంద్రబాబు ఈ పరిణామాలన్నిటిని మౌనంగానే పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. కాకినాడ పోర్టులో స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యంతో ఉన్న ఓడను ఏమి చేయాలనే విషయంపై మల్ల గుల్లాలు పడుతున్నారు. దీనిపై ప్రత్యేకంగా కూడా చర్చించారు. ఇవన్నీ పక్కకు ఉంచితే, పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమిలో కీలకమైన వ్యక్తి. మంత్రి కూడా. ఆయనకు రాష్ట్రంలోనే కాదు అంతకంటే ఎక్కువగా కేంద్రంలోని బీజేపీ అగ్రనేతల నుంచి మెండైన ఆశీస్సులు ఉన్నాయి. ఈ పరిణామాలతోనే సీఎం చంద్రబాబు మౌనంగా చూస్తూ స్వాగతిస్తున్నారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
సాధారణంగా టిడిపిలో కానీ, ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయాలకు ఆ పార్టీలో నాయకులు ఎదురు చెప్పడం కాదు కదా. అభ్యంతరాలు చెప్పడానికి కూడా వెనకంజవేస్తారు. సూచనలు మాత్రం తీసుకోవడంలో, చెప్పింది ఆలకించడంలో చంద్రబాబుకు ఉన్న ఓ మంచి అలవాటు ఉందని ఆయనకు సన్నిహితంగా మెలిగే వారు చెబుతారు. జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ధిక్కారాన్ని సహించని చంద్రబాబు ఈ పరిణామాలను ఎలా ఎదుర్కొంటారు. ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారనేది వేచి చూడాలి.