ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నారు. వీరు రాష్ట్రాభివృద్ధిలో ఏ విధంగా ముందుకు సాగుతారనేదానిపై చర్చ మొదలైంది.


ఆంధ్రప్రదేశ్‌ నుంచి కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించిన ముగ్గురు మంత్రులపై రాష్ట్ర ప్రజలు పలు ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇద్దరు మంత్రుల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన సౌకర్యాలు సాధించుకునేందుకు తగు చర్యలు తీసుకుంది. శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకు పౌర విమానయాన శాఖను మోదీ ప్రభుత్వం ఇచ్చింది. స్వతంత్ర మంత్రి కావడంతో రాష్ట్రానికి కొత్త విమానాశ్రయలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పలువురు ఊహించుకుంటున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో తప్పకుండా విమానాశ్రయం ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు చెప్పారు.

గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాబివృద్ధి, కమ్యునికేషన్స్‌ సహాయ మంత్రిగా అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గ్రామీణాభివృద్ధి నుంచి ఎక్కువ నిధులు ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తారనే ఆశలో ప్రజలు ఉన్నారు. పైగా ఐటీపై కూడా పెమ్మసానికి అవగాహ ఉంది. అమెరికాలో స్టడీ మెటీరియల్‌ అమ్మకం కంపెనీ స్థాపించి కోటీశ్వరుల జాబితాలోకి వెళ్లారు.
భూపతిరాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పైగా బిజెపికి సంబంధించిన ఎంపీ కావడం వల్ల కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించి విభజన హామీల్లో ఇచ్చిన ఉక్కు కర్మాగారాల ఏర్పాటును పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటారని పలువురు భావిస్తున్నారు.
గన్నవరం విమానాశ్రయానికి మంచి రోజులు..
ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా రూ.611.80 కోట్లతో చేపట్టిన గన్నవరం విమానాశ్రయం టెర్మినల్‌ భవన నిర్మాణం 40 శాతం మాత్రమే పూర్తయింది. ఇప్పుడు కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలు ఏర్పడటం, పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌ నాయుడు బాధ్యతలు చేపట్టి నందున విజయవాడ ఎయిర్‌పోర్టుకు మహర్దశ పట్టే అవకాశాలున్నాయి.
నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయం నిర్మించాలని గతంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం 2016 అక్టోబర్‌ 7న అనుమతులు మంజూరు చేసింది. విమానాశ్రయానికి కేటాయించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రద్దయ్యాయి. పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌నాయుడు నియమితులైన నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి మార్గం ఏర్పడనుంది. పుట్టపర్తిలో ప్రస్తుతం సత్యసాయి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉన్న విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకొని రాయలసీమ ప్రాంతానికి విమాన సేవలను విస్తరించాలని, అక్కడ పైలెట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విశాఖపట్నం భవిష్యత్‌ అవసరాలను దష్టిలో ఉంచుకొని 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు విశాఖ– విజయనగరం మధ్య భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మించాలని నిర్ణయించారు. అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అశోక్‌గజపతిరాజు ఉండటంతో 2016 జనవరిలో స్థల అనుమతులు లభించాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు బాధ్యతలను జీఎంఆర్‌ సంస్థకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం, జీఎంఆర్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు తొలి దశను ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలకు వీలుగా నిర్మించనున్నారు. ఇందుకు అవసరమైన 2,203 ఎకరాల భూమిని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ప్రాజెక్టు ప్రాథమిక వ్యయం రూ. 2,500 కోట్లు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో సహకరించనున్నందున భోగాపురం విమానాశ్రయం త్వరితంగా∙పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది పూర్తయితే విశాఖపట్నానికి అంతర్జాతీయ విమాన రాకపోకలు పెరిగి పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివద్ధికి బాటలు పడతాయి.
వర్మపై ఆధారపడిన ఉక్కు పరిశ్రమ
విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను నష్టాల నుంచి గట్టెక్కించడానికి కేప్టివ్‌ బొగ్గు, ఇనుప గనులు కేటాయించాలని కార్మికులు సుదీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ ఉక్కు శాఖ సహాయమంత్రిగా నియమితులవడం వల్ల విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడంతో పాటు, విభజన చట్టంలో చెప్పినట్లుగా బయ్యారం, కడపల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది.
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం అమలు జరుగుతుందా?
2014లో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో అంటే 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అలా చేయాల్సిన వాటిలో ఉత్తరాంధ్రకు సంబంధించి, విశాఖ రైల్వే జోన్, గిరిజన యూనివర్సిటీ ఉన్నాయి.
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌
విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్‌ కావాలంటూ దశాబ్దానికి పైగా ఆందోళనలు జరిగాయి. ఉత్తరాంధ్ర ప్రజలు రైల్వే జోన్‌ వస్తే తమకు ఉపాధి అవకాశాలు రావడంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి స్థానిక ప్రజలు అనేక పోరాటాలు చేశారు.
ఏపీ విభజన హామీల్లో భాగంగా ఏపీకి రైల్వే జోన్‌ ప్రకటించిన కేంద్రం, జోన్‌ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రకటించింది. ఆ తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కు సంబంధించి అనేక ప్రకటనలు వచ్చాయి. కానీ అసలు రైల్వే జోన్‌ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ట్రిపుల్‌ ఐటీ, ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్‌ యూనివర్సిటీ, పెట్రో యూనివర్సిటీ, అగ్రికల్చర్‌ యూనివర్సిటీతో పాటు తెలంగాణ, ఏపీలలో ఒక్కొక్కటి చొప్పున గిరిజన యూనివర్సీటీలు కూడా ఏర్పాటు చేయాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇంకా పలు ఆస్తుల విభజన గురించి కూడా పరిష్కారాలు కావాల్సి ఉంది. ఇవన్నీ త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
నిధుల సమీకరణ అత్యంత కీలకం
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి గ్రాంట్స్‌ తీసుకు రావాల్సి ఉంది. వేరే మార్గం కూడా కనిపించడం లేదు. ఒకప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉండగా మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రం విభజన తరువాత అప్పుల కుప్పగా మారింది. పాలకులు ఎవరి ఇష్టానుసారం వారు హామీలు ఇచ్చి వచ్చిన నిధులను పందేరం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. దీంతో రాష్ట్రం దివాళా తీసింది. ఈ స్థితి నుంచి రాష్ట్రాన్ని రక్షించి నిధులు కేంద్రం నుంచి తీసుకు రావడంలో ముగ్గురు మంత్రులు కీలక పాత్ర పోషించాల్సి ఉంది.
Next Story