ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేల మందికిపైగా అనుమానిత క్యాన్సర్‌ బాధితులను గుర్తించారు.


ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్‌ భయం పట్టుకుంది. రాష్ట్రంలో ఏటా దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలను క్యాన్సర్‌ బలి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో దీనిని కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది నవంబర్‌ 14 నుండి ప్రారంభమైన ఈ స్క్రీనింగ్‌ పరీక్షలు మరో పది నెలల పాటు కొనసాగనున్నాయి. 18 సంవత్సరాల పైబడిన వారికి నోటి, రొమ్ము క్యాన్సర్, 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేపట్టారు.

వైద్య సిబ్బంది ఎంత మందంటే..
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 155 మంది స్పెషలిస్టు డాక్టర్లు, 238 జిల్లా ఆస్పత్రుల నిపుణులు, 3,944 మంది వైద్యాధికారులు, 10,032 మంది సామాజిక ఆరోగ్యాధికారు(సిహెచ్‌ఓ)లు, 3,944 మంది ఏఎన్‌ఎంలు, 42 వేల మందికి పైగా సామాజిక ఆరోగ్య కార్యకర్తలు భాగస్వాములయ్యారు.
స్క్రీనింగ్‌ ఎలా చేస్తారంటే..
ముందు సామాజిక స్థాయి స్క్రీనింగ్‌లో భాగంగా ఆశా కార్యకర్తలు క్యాన్సర్‌ వ్యాధి దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తారు. ఏఎన్‌ఎం, సీహెచ్‌ఓలు అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీ)సర్వేలు నిర్వహించి మహిళలు సర్వైకల్‌ పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహిస్తారు. ప్రాథమిక రోగ నిర్ధారణ కోసం బీపీ, ఆర్‌ బీఎస్, హిమొగ్లోబిన్, నోటి, రొమ్ము క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రామీణ ఆరోగ్యకేంద్రం స్థాయిలో జరిపే స్క్రీనింగ్లో వైద్యాధికారులు అనుమానిత కేసులను పరిశీలించనున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నిర్ధారించి చికిత్స అందచేస్తారు. అనుమానిత క్యాన్సర్‌ కేసులను ఉన్నత స్థాయి వైద్య కేంద్రాలకు రిఫర్‌ చేస్తారు. రోగ నిర్ధారణ కోసం బీపీ ఆర్‌ బిఎస్, సర్వైకల్‌ క్యాన్సర్‌ వంటి వ్యాధుల నిర్ధారణ కోసం వీఐఏ పరీక్షతో పాటు హెచ్‌ఐవీ, హెచ్‌సీవీ, హెచ్బిఎస్‌ఎజీ వంటి వాటి కోసం వైరల్‌ మార్కర్ల పరీక్షలు నిర్వహిస్తారు. ఒక వేళ అలాంటి వ్యాధులు ఉన్నట్లు తేలిదే వాటి నివారణ కోసం ప్రివెంటివ్‌ అంకాలజీ యూనిట్‌కు రిఫర్‌ చేస్తారు. అంకాలజీ యూనిట్‌ (పీఓయు)స్థాయిలో సూపర్‌ స్పెషలిస్ట్‌ సమక్షంలో రోగ నిర్ధారణ, చికిత్స అందిస్తారు. దీనికోసం రాష్ట్రంలో 17 పీఓయులను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో బయాప్సీ, రేడియాలజీ పద్ధతుల ద్వారా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కీమో థెరపీ, రేడియేషన్‌ శస్త్రచికిత్సల వంటి వాటిని ప్రభుత్వ, అనుబంధ ఆస్పత్రులలో ఉచితంగా అందజేస్తారు.
వేలల్లో అనుమానిత కేసులు..
ఇప్పటి వరకూ దాదాపు 53,07,448 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 19,447 మంది నోటి క్యాన్సర్, 15,401 మంది రొమ్ము క్యాన్సర్, 17,373 మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ అనుమానితులను గుర్తించారు. క్యాన్సర్‌ వ్యాధి సంపూర్ణ నివారణ లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. క్యాన్సర్‌ వైద్య సేవలకు భారీగానే ఖర్చు చేశారు. డాక్టర్‌ ఎన్‌ టీఆర్‌ వైద్యసేవ ద్వారా క్యాన్సర్‌ చికిత్సలకు 2019–20లో రు.217 కోట్లు ఖర్చు పెట్టగా, 2023–24 నాటికి అది రూ.624 కోట్లకు పెరిగిందని వైద్యఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Next Story