రేపే రెండో జాబితా.. ‘వైసీపీ ఓడితేనే ప్రజలు గెలుస్తారు’
x
Source: Twitter

రేపే రెండో జాబితా.. ‘వైసీపీ ఓడితేనే ప్రజలు గెలుస్తారు’

టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను రేపు ప్రకటించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. సమయానుకూలంగా బీజేపీ, జనసేన కూడా అభ్యర్థులను ప్రకటిస్తాయని చెప్పారు.



అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థుల రెండో జాబితాను రేపు విడుదల చేయనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు అంతిమ దశకు చేరింది, రెండో జాబితాలో వీలైనంతమంది అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. బీజేపీ, జనసేన ఏయే స్థానాల్లో పోటీ చేయాలో ఆ పార్టీలకు ఒక స్పష్టత ఉందని, సమయానుకూలంగా వారు కూడా తమ అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన ‘కలలకు రక్కలు’ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. ఇందులో వైసీపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారాయన.

‘మహాశక్తి’ కింద ఐదు కార్యక్రమాలు

తమ హయాంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చామని చెప్పారీ అగ్రనేత. అప్పట్లో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు ఇప్పుడు ప్రపంచానికే ఆదర్శంగా మారాయని, ఒకవేళ త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ‘మహాశక్తి’ కింద ఐదు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ‘తల్లికి వందనం’ పేరుతో ఏడాదికి రూ.15 వేల ఇస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వచ్చాయంటే అది టీడీపీ చొరవతోనే సాధ్యమైందని, తమ పార్టీ హయాంలోనే 22 కొత్త పథకాలను అమలు చేసినట్లు ఈ మాజీ సీఎం గుర్తు చేశారు.

వికసిత్ భారత్ @2047 జరిగి తీరుతుంది

దేశాభివృద్ధికి దేశంలో అధికంగా యువత ఉండటం కలిసొచ్చే అంశమని, ప్రధాని మోడీ చెబుతున్న ‘వికసిత్ భారత్@2047’ జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం సృష్టించిన విధ్వంసం వల్ల ఏ వ్యవస్థా కూడా సక్రమం లేదు. వైసీపీ హయాంలో రైతులు, యువత, కార్మికులు, నిరుద్యోగులు అందరూ నలిగిపోయాయని ఆవేదన చెందారు. విద్యా రాజధానిగా ఎదగాల్సిన రాష్ట్రం జగన్ పాలనలో సర్వనాశనమైంది. ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడి తీరాలి’’ అని చంద్రబాబు.. వైసీపీ టార్గెట్ చేశారు.

ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తా

రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పొత్తు పెట్టుకుంటే, మాది ఇచ్చిపుచ్చుకునే వ్యవహారమని జగన్ అభివర్ణించారని గుర్తు చేశారు. చేయరాని తప్పులు చేసిన జగన్ ఇప్పుడు నన్ను ఏకాకినంటున్నారని మండిపడ్డారు. పొత్తులో ఉన్న మూడు పార్టీలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న ఆలోచనలు కూడా లేవని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల సీట్లు దక్కని ఆశావహులు నిరాశచెందకుండా పొత్తు ధర్మాన్ని పాటించాలని, పొత్తు విజయం కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ, పొత్తు బలోపేతం, గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో పొత్తు విజయం కోసం ప్రతి కార్యకర్త, నేత కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి వైసీపీ చేసిన అన్యాయాన్ని, వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారాయన. అధికారం ఉందన్న అహంకారంతో టీడీపీ కార్యకర్తలు తప్పుడు కేసులు బనాయించడం, దాడులు చేసిన వైసీపీ పొత్తు విజయంతో బదులివ్వాలని ఆయన తెలిపారు.


Read More
Next Story