మీకు టిక్కెట్‌ ఇవ్వలేను: సీఎం జగన్‌

ఇక్కడ బీసీలకు టిక్కెట్‌ ఇవ్వాలి. మీరు గుంటూరు లేదా విజయవాడ లేదంటే విశాఖపట్నం నుంచి పోటీ చేయవచ్చు. ఎందుకు.. ఏమిటని అడగొద్దు


మీకు టిక్కెట్‌ ఇవ్వలేను: సీఎం జగన్‌
x
Lavu Srikrishna Devarayalu, MP

మీకు టిక్కెట్‌ ఇవ్వలేను. ఇక్కడ బీసీలకు టిక్కెట్‌ ఇవ్వాలి. మీరు గుంటూరు లేదా విజయవాడ లేదంటే విశాఖపట్నం నుంచి పోటీ చేయవచ్చు. ఎందుకు.. ఏమిటని అడగొద్దు, కారణాలు ఉన్నాయి. సర్వేల ప్రకారం ముందుకు పోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు చెప్పారు. శుక్ర, శనివారాల్లో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్యమంత్రిని కలిసారు. రెండు సార్లూ ఒకే సమాధానం వచ్చింది.

నర్సరావుపేట పార్లమెంట్‌ స్థానం నుంచి మొదటిసారిగా ఎన్నికల రంగంలోకి దిగి లక్షకు పైన మెజారిటీతో ఎంపీగా శ్రీకృష్ణ దేవరాయలు గెలుపొందారు. నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. అన్ని మండలాల్లోనూ అభిమానులను సంపాదించుకోగలిగారు. యువకుడు, విద్యా వంతుడు కావడంతో ఐదేళ్లలో పార్లమెంట్‌ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విద్యా సంస్థలు వీరివే. వీరి తండ్రి లావు రత్తయ్యకు నర్సరావుపేట, గుంటూరు పార్లమెంట్‌ స్థానాల పరిధిలో ప్రజాభిమానం ఉంది. అయితే ఆయన కాకుండా కుమారుడిని నర్సరావుపేట పార్లమెంట్‌ నుంచి పోటీచేయించారు. 2019లో వైఎస్‌ జగన్‌ కూడా శ్రీకృష్ణదేవరాయలును ప్రోత్సహించారు. ఆ తరువాత ఎవరి ప్రోత్సాహం లేకపోయినా రాజకీయాల్లో రాణించగలిగారు. ప్రజాభిమానం చూరగొన్నారు.
అయితే సర్వేలనే ప్రభుత్వం నమ్ముకున్నది. సర్వే సంస్థల ద్వారా సేకరించిన సమాచారంతో నర్సరావుపేట పార్లమెంట్‌ స్థానాన్ని బీసీలకు ఇస్తే బాగుంటుందనే నిర్ణయానికి ముఖ్యమంత్రి జగన్‌ వచ్చారు. ఈ విషయాన్ని ఎంపీకి తెలిపారు. నర్సరావుపేట కాకుండా వేరే చోట నుంచి నేను పోటీ చేయనని, నాకు నియోజకవర్గంలో ప్రజాభిమానం ఉందని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. ఇవేవీ జగన్‌ పట్టించుకోలేదు. నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నర్సరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లె, గురజాల, మాచర్ల, పెద్దకూరపాడు నియోకజవర్గాలు ప్రస్తుతం ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలుకు అనుకూలంగా ఉన్నట్లు, ఆయన సొంతంగా చేయించుకున్న సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. శ్రీకృష్ణ దేవరాయలు కాకుండా వేరేవారు పోటీలో ఉంటే వినుకొండ, చిలకలూరిపేట, పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్సార్‌సీపీ జారవిడుచుకున్నట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అకారణంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ నియోజకవర్గాల్లో ఓడిపోతారని కూడా సీఎం వద్ద కుండ బద్దలు కొట్టి చెప్పారు. అయినా జగన్‌ అంగీకరించలేదని సమాచారం.
Next Story