రాజకీయాల్లో వైఎస్ కుటుంబం తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. ఓటమి ఎరుగని కుటుంబంగా చరిత్ర సృష్టించింది. మరి షర్మిల పరిస్థితి ఏమిటి?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరకు గెలుస్తూ వస్తూనే ఉన్నారు. వారిద్దరే కాకుండా ఆ కుటుంబం తరఫున పోటీ చేసిన వైఎస్ వివేకనందరెడ్డి, వైఎస్ పురుషోత్తమరెడ్డి, వైఎస్ విజయమ్మ ఇలా అందరూ ఓటమి ఎరుగని నేతలుగా నిలచారు. ఇదే కుటుంబ సభ్యులుగా రంగంలోకి దిగిన వైఎస్ అవినాష్‌రెడ్డి కూడా గత రెండు ఎన్నికల్లోను విజయం సాధించారు. అయితే ఇదే కుటుంబం నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిల ఎన్నికల రంగంలోకి దిగారు. కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ స్థానంలో వైఎస్ కుటుంబానిది తిరుగులేని ఆధిపత్యం నిలుపుకుంటూ వస్తోంది. అయితే ఈ సారి వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు ప్రత్యర్థులుగా రంగంలోకి దిగడం ఇప్పుడు హాట్ టాపిక్. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి సీఎం జగన్ రంగంలోకి దింపగా ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల పోటీకి దిగింది. అవినాష్‌కు సీఎం జగన్ అండగా నిలువగా షర్మిలకు ఆమె సోదరి వైఎస్ వివేక కూతురు సునీత, వారి కుటుంబం మాత్రమే అండగా నిలుస్తోంది. వైఎస్‌ఆర్ వారసురాలిగా షర్మిల రంగంలోకి దిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. షర్మిల గెలిచి ఇప్పటి వరకు ఓటమి ఎరుగని వైఎస్ కుటుంబం చరిత్రను కొనసాగిస్తుందా లేదా ఓడి ఓటమి చరిత్రను ప్రారంభిస్తుందా అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.
తిరుగులేని వైెఎస్ఆర్ కుటుంబం
కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గంలో 1978 నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబానికి తిరుగు లేదు. వైఎస్‌ఆర్ కుటుంబ సభ్యులే ఇప్పటి వరకు ఇక్కడ విజయం సాధిస్తూ వచ్చారు. దాదాపు 10 సార్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తే 10 సార్లు ఓడిపోయింది. 1983 నుంచి ఒక్క సారి (2012 ఉప ఎన్నిక) మినహా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడమే కాకుండా వైఎస్ కుటుంబ సభ్యులు ప్రతి ఎన్నికలోను మెజారిటీని పెంచుకుంటూ పోయారు. 1978 నుంచి 13 సార్లు ఎన్నికలు జరిగితే ఒక సారి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో సారి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తన మరిది వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన వైఎస్ విజయమ్మ ఓటమి పాలయ్యారు. వైఎస్‌ఆర్ కుటుంబానికి ఇదే తొలి పరాజయం. పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గంలో కానీ కడప పార్లమెంట్‌లో కానీ ఓటమి ఎగురగని వైఎస్‌ఆర్ కుటుంబం కడప జిల్లా బయట మాత్రం ఓటమి చవిచూసింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి 1978లో మొదటి సారిగా పులివెందుల నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 1983, 1985లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి టీడీపీని ఓటించారు. 1989 ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 1991లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన వైఎస్ పురుషోత్తం రెడ్డి గెలుపొందారు. తిరిగి 1994లో వైఎస్ వివేకానందరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1999, 2004, 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం జరిగిన బై ఎలక్షన్‌లో వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014, 2019 లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.
1955లో పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గం ఏర్పడింది. తొలి సారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పెంచికల బసి రెడ్డి విజయం సాధించారు. 1962లో ఇండిపెండింట్‌గా పోటీ చేసిన సి బాలిరెడ్డి విజయం సాధించగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బసిరెడ్డి ఓడి పోయారు. 1967,1972లో జరిగిన ఎన్నికల్లో పి బసిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు.
మొదటి నుంచి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గమే పోటీ
పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ నాలుగు సార్లు, కాంగ్రెస్ ఐ తొమ్మి సార్లు, వైఎస్‌ఆర్‌సీపీ మూడు సార్లు, ఒక సారి ఇండిపెండెంట్ గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఒక్క సారి కూడా గెలవ లేదు. అయితే పులివెందుల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో గెలిచిన వారు కానీ ఓడిన వారు కానీ నాటి నుంచి నేటి వరకు రెడ్డి సామాజిక వర్గం వారే కావడం విశేషం.
చరిత్ర సృష్టించిన జగన్
వైఎస్‌ఆర్‌సీపీని స్థాపించి ఆ పార్టీని విజయ పథంలో నడిపించి ఆంధ్రప్రదేశ్‌లో చరిత్ర సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కానీ ముఖ్యమంత్రులుగా పని చేసిన వారి పిల్లలెవ్వరూ ముఖ్యమంత్రి కాలేదు. కానీ జగన్ ఆ ఆనవాయితీని బ్రేక్ చేశారు. గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 151 స్థానాలు సాధించి సీఎం అయ్యారు.
జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 నుంచి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ఐ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి రెండో సారి 2009లో సీఎం అయ్యారు. తర్వాత జరిగిన అనూహ పరిణామాల నేపథ్యంలో మూడు నెలల్లోనే హెలికాప్టర్ ప్రమాదంలో కన్ను మూశారు. అప్పుడు మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని తీర్మానించినా ఏఐసీసీ అధ్యక్షరాలుగా ఉన్న సోనియా గాంధీ అంగీకరించ లేదు. తండ్రి మరణం తట్టుకోలేని వారు కన్ను మూస్తే ఓదార్పు యాత్ర చేస్తానని సోనియాను అడిగినా కాంగ్రెస్ అనుమతించ లేదు. దీంతో ఆయన ఓదార్పు యాత్రను సొంతంగా ప్రారంభించి కాంగ్రెస్‌కు గుడ్‌బాయి చెప్పి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.
అనంతరం పరిణామాల్లో కాంగ్రెస్ నాయకులు జగన్‌పై కేసు పెట్టడం, తండ్రి పదవిని ఉపయోగించుకుని క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారనే నేరం కింద సీబిఐ జగన్‌ను అరెస్ట్ చేయడం జరిగాయి. 16 నెలలు జైల్లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన కొందరు ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 15 చోట్ల గెలిచారు. 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ సొంతంగానే పోటీ చేసింది. టీడీపీ, జనసేన, బిజెపీ కలిసి పొత్తులో పోటీ చేయడంతో పాటు ఆ కూటమి రైతు రుణమాఫీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి 67 సీట్లు మాత్రమే వచ్చాయి. అనంతర పరిణామాల్లో 23 వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వారిలో కొంత మందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు.
అసెంబ్లీ నుంచి బహిష్కరించిన జగన్ రాష్ట్రంలో సుదీర్ఘ యాత్ర చేశారు. ప్రజల ఆదరణ చొరగొని పులివెందుల నుంచి 90,110 ఓట్ల మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. పులివెందులలో వైఎస్ కుటుంబం 1978 నుంచి నేటికీ రాజకీయాల్లో కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని ఏ నియోజక వర్గంలోను ఒకే కుటుంబం ఇన్ని సార్లు గెలిచిన కుటుంబం లేదు.
వైఎస్‌ఆర్ మరణ అనంతరం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న వివేకానందరెడ్డి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో పని చేశారు. ఆ తర్వాత ఆయన కూడా వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన హత్యకు గురయ్యారు. వివేకానందరెడ్డి రెండు సార్లు ఎంపీగా కూడా గెలుపొందారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 4 సార్లు ఎంపీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడుగా, ప్రతిపక్ష నేతగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన పాద యాత్ర చేశారు. వైఎస్‌ఆర్ మరణ అనంతరం కొడుకు జగన్, కుమార్తె షర్మిల కూడా అధికారం కోసం పాద యాత్రలు చేశారు. టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రి వర్గాల్లో వైఎస్‌ఆర్ పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓటమి ఎరుగని నాయకుడిగా ఐదేళ్ల పూర్తి కాలం ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2009లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత పార్టీ పెట్టి ఎంపీకి రాజీనామా చేసి, తిరిగి ఎంపీగా పోటీ చేసి 5.45లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
కొస మెరుపు
2024లో జరిగే ఎన్నికల్లో ఈ కుటుంబం నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా, జగన్‌ను విభేదించి చెల్లెలు షర్మిల కపడ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైఎస్ కుటుంబానికి ఎప్పటికీ కాంగ్రెస్సే అండగా ఉంటుందని వైఎస్‌జగన్ పెట్టిన వైఎస్‌ఆర్‌సీపీని ఓడించాలని ఆమె పిలుపునివ్వడం విశేషం.