BC caste enumeration in AP

జన సంక్షేమమా.. ఓట్ల తంత్రమా


డిసెంబరు 9 నుంచి రాష్ట్రమంతా కుల గణన

పరిగణలోకి సామాజిక, ఆర్థిక అంశాలు

స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారి

ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనపై సమాదానం ఇవ్వని కేంద్రం

(జి.పి. వెంకటేశ్వర్లు)

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీసీ కుల గణన తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేపట్టనున్న బీసీ కులగణనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. 1931లో మాత్రమే దేశంలో కుల గణన జరిగిందని, ఎస్సీ, ఎస్టీలు మినహా ఆ తరువాత కుల గణన జరగలేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చెప్పారు. భారత దేశంలో కులానికి ముఖ్య ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే. దేశంలో బలంగా ఉన్న అసమానతలు తొలగించేందుకు కులగణన ముఖ్యమని ప్రభుత్వాలు భావిస్తుంటే రాజకీయ నాయకులు మాత్రం ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కుల గణనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. డిసెంబరు 9 నుంచి పూర్తి స్థాయిలో కుల గణన చేపడతామని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు.

కులాల సంఖ్యను బట్టి సాయం

ప్రజలకు ప్రయోజనాలు అందించాలంటే అత్యధిక కులం వారి సంఖ్య తెలియాలి. వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలియాలి. అప్పుడు వారికి ఎలాంటి సాయం ప్రభుత్వం చేయాలో తెలుస్తుందని గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు ఫెడరల్‌ న్యూస్‌ ప్రతినిధికి చెప్పారు. ప్రతి దాంట్లోనూ రాజకీయ కోణం ఉంటుంది. దాని వల్ల బీసీలకు ప్రయోజనం జరుగుతుందంటే ఇంకేంకావాలని అన్నారు.

1953లోనే బీసీల గుర్తింపు

1953లో ఏర్పాటైన కాలేల్కర్‌ కమిషన్‌ జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీలను కాకుండా ఇతర వెనుకబడిన తరగతులను తొలిసారి గుర్తించింది. మండల్‌ కమిషన్‌ నివేదిక 1980లో బీసీలను 52 శాతంగా అంచనా వేసింది. మొత్తం 49.5శాతం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లకు సిఫార్స్‌ చేసింది. ఇందులో బీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ ఉండాలని చెప్పింది. జాతీయ బీసీ కమిషన్‌ అత్యంత వెనుకబడిన తరగతులు, మరింత వెనుకబడిన తరగతులు, వెనుకబడిన తరగతులుగా బీసీలను విభజించాలని సిఫార్స్‌ చేసింది.

కుల గణనకు అనుకూలంగా ఆర్టికల్‌ 340

దేశంలోనే మొదటి సారిగా బీహార్‌ రాష్ట్రంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 340 ప్రకారం బీసీల కులగణనకు కమిషన్‌ వేసి 2023 అక్టోబరు 4న కుల గణను పూర్తి చేసి 63 శాతం బీసీలు ఉన్నట్లు ప్రకటిచింది.

భారత రాజ్యాంగం కూడా కుల గణన నిర్వహించడానికి అనుకూలంగా ఉంది. ఆర్టికల్‌ 340 సామాజిక, విద్యా పరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితులను పరిశోధించడానికి, ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలకు సంబంధించి సిఫార్స్‌లు చేయడానికి, కమిషన్‌ను నియమించాలని నిర్దేశించింది.

కుల గణనకు కేంద్రం నుంచి రాని అనుమతి

ఏపీలో బీసీ కుల గణనకు కేంద్రం నుంచి ఎటువంటి అనుకూల సంకేతాలు రాలేదు. అందువల్ల ఎస్సీ, ఎస్టీల మాదిరి కుల ప్రాతిపదికన కేంద్రం నిధులు కేటాయిస్తుందా? లేదా? అనేది సందిగ్ధం.

బీసీల్లో సంచార జాతుల గణన ప్రత్యేకంగా చేపట్టాలనే డిమాండ్‌పై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. వీరిని నుమాడిక్‌ ట్రైబ్స్‌ అని కూడా అంటారు.

ఇకపై రాష్ట్రమంతా ఒకే కేటగిరీ కిందకు బీసీలు

ఇప్పటి వరకు ఏపీలో ప్రాంతాల వారీగా బీసీను వివిధ కేటగిరీలుగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రమంతా ఒకే కేటగిరీ కిందకు తీసుకొస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీసీ కుల గణన చేపట్టడానికి తొలిమెట్టుగా భావించవచ్చు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో బీసీలుగా ఉన్న కులాలవారు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓసీలుగా ఇప్పటి వరకు ఉన్నారు. ఇటువంటి కులాలు రాష్ట్రంలో 21వరకు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రధానంగా శెట్టి బలిజలు, కలింగ కోమట్లు, నగరాలు, కురకుల, పొందర, అచ్చుకట్ల వాండ్లు, మున్నూరుకాపు, పొలినాటి వెలమ, అరవ, అయ్యరాక, బేరిశెట్టి/బేరివైశ్య, కూర్మితో పాటు మరికొన్ని కులాలన్నీ రాష్ట్రమంతటా బీసీలుగా పరిగణిస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని వల్ల రాయలసీమ, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం వంటి జిల్లాల్లో బీసీల జనాభా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇంకా కొన్ని కులాల వారు తమను బీసీలుగా పరిగణించాలని అనాదిగా డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై కమిషన్‌లు వేసి రిపోర్టులు తీసుకున్నా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇది కూడా జరిగితే బీసీల కులగణన అర్థవంతంగా ఉంటుందని ఆయా కులాల వారు కోరుతున్నారు.

ఏపీ రాజకీయాల్లో కీలకం కానున్న కులం

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కులం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తన హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించానని, ఆ పథకాల ద్వారా సాయం అందితేనే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓటువేసి గెలిపించాలని సీఎం జగన్‌ బహిరంగ సభల్లో చెబుతున్నారు. అందువల్ల కులం పాత్ర ఏపీ రాజకీయాల్లో కీలకమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

138 బీసీ కులాలకు 56 కార్పొరేషన్‌లు

ఏపీలో 138 బీసీ కులాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కులాలలను ఒక గ్రూపుగా చేసి మొత్తం 56 బీసీ కులాల కార్పొరేషన్‌లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం వద్ద అనధికారికంగా రాష్ట్రంలో బీసీ కులాల వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు ఉన్నాయని చెప్పవచ్చు. దేశంలో ఎక్కడా లేని గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వివరాలు సేకరించి పెట్టుకున్నారు.

బీసీ కుల గణన రాజకీయ అంశం కాకూడదు

బీసీ కులగణను కేవలం ఎన్నికల అంశంగా ఏపీ ప్రభుత్వం భావించకుండా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు బీసీ కులగణన పూర్తి చేస్తే తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్లు అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4.02 కోట్ల ఓటర్లు ఉన్నారు. వీరిలో రెండు కోట్లకు పైగా బీసీ ఓటర్లు ఉన్నారనేది స్పష్టం.

Next Story