విద్యార్థులు సిలబస్ ను ఎంచుకునే ముందు ఆలోచించి ఎంపిక చేసుకోవడం మంచిది.
సీబీఎస్సీ సిలబస్ మంచిదా.. స్టేట్ సిలబస్ మంచిదా.. అనే విషయంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలు నివృత్తి చేసుకోవాలంటే ఈ సిలబస్ లపై చర్చించాల్సిందే. మంచీ చెడుల గురించి తెలుసుకుందాం..
రాష్ట్ర సిలబస్
రాష్ట్ర సిలబస్‌లు ఆ రాష్ట్రంలోని విద్యార్థుల ప్రత్యేక అవసరాలు, సాంస్కృతిక నేపథ్యం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందిస్తారు. ఇది విద్యార్థులకు వారి పరిసరాలను, సమాజాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. స్థానిక భాషకు ప్రాధాన్యత ఇస్తాయి. ఇది విద్యార్థులకు వారి మాతృ భాషలో ప్రాథమిక విద్యను అభ్యసించడానికి, భాషపై మంచి పట్టు సాధించడానికి సహాయపడుతుంది. జాతీయ సిలబస్‌లతో పోలిస్తే, రాష్ట్ర సిలబస్‌లలో తక్కువ పోటీ ఉంటుంది. ఇది విద్యార్థులపై ఒత్తిడిని తగ్గిస్తుంది. వారు స్వేచ్ఛగా నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
రాష్ట్ర సిలబస్‌ల పరీక్షలు సాధారణంగా జాతీయ సిలబస్‌ల పరీక్షల కంటే సులభంగా ఉంటాయి. ఇది సగటు విద్యార్థికి కూడా మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది. రాష్ట్ర సిలబస్‌ల పుస్తకాలు, ఇతర అధ్యయన సామగ్రి జాతీయ సిలబస్‌లతో పోలిస్తే తక్కువ ఖర్చుతో లభిస్తాయి.
రాష్ట్ర సిలబస్‌లో ప్రతికూల అంశాలు
రాష్ట్ర సిలబస్‌కు జాతీయ స్థాయిలో అంతగా గుర్తింపు ఉండకపోవచ్చు. దీనివల్ల విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లో చదువుకోవడానికి లేదా ఉద్యోగాలు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఒక్కో రాష్ట్ర సిలబస్ ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో సిలబస్ చాలా కఠినంగా ఉండవచ్చు, కొన్ని రాష్ట్రాల్లో సులభంగా ఉండవచ్చు. దీనివల్ల విద్యార్థుల విద్యా ప్రమాణాల్లో వ్యత్యాసాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక కోర్సులు లేదా సబ్జెక్టులు అందుబాటులో ఉండకపోవచ్చు. దీనివల్ల విద్యార్థులకు తమకు నచ్చిన కోర్సును ఎంచుకునే అవకాశం తక్కువగా ఉంటుంది.
రాష్ట్ర సిలబస్‌లో జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన JEE, NEET వంటి వాటికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. దీనివల్ల విద్యార్థులు ఈ పరీక్షలకు సిద్ధం కావడానికి అదనపు శిక్షణ తీసుకోవలసి ఉంటుంది. రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల శిక్షణలో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. దీనివల్ల బోధన నాణ్యతలో తేడాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల సిలబస్‌లు ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకు అనుగుణంగా మార్పులు జరగవు. దీనివల్ల విద్యార్థులు పాత సమాచారం నేర్చుకోవలసి వస్తుంది.
CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) సిలబస్
సిబిఎస్‌ఈ సిలబస్‌కు భారతదేశం అంతటా గుర్తింపు ఉంది. ఇది విద్యార్థులకు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి సహాయపడుతుంది. సైన్స్, మ్యాథ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర సైన్స్ సంబంధిత రంగాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. జెఈఈ, నీట్, ఇతర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అనుగుణంగా రూపొందిస్తారు. ఈ పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావడానికి సహాయపడుతుంది.
సిబిఎస్‌ఈ సిలబస్‌ను ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకు అనుగుణంగా అప్‌డేట్ చేస్తారు. ఇది విద్యార్థులకు తాజా సమాచారం, జ్ఞానాన్ని అందించడానికి సహాయపడుతుంది. ఈ సిలబస్‌లో వివిధ రకాల పాఠ్యాంశాలు ఉన్నాయి. ఇవి విద్యార్థులకు వారి ఆసక్తులు, నైపుణ్యాలకు అనుగుణంగా కోర్సులను ఎంచుకోవడానికి ఉపయోగ పడుతుంది. సిబిఎస్‌ఈ సిలబస్‌ను అనుసరించే పాఠశాలలు సాధారణంగా అధిక నాణ్యత గల విద్యను అందిస్తాయి. విద్యార్థులు మంచి విద్యను పొందే అవకాశం ఉంటుంది.
బోధన ప్రధానంగా ఆంగ్లంలో ఉంటుంది, ఇది ఆంగ్లం మాట్లాడే వాతావరణంలో చదువుకోవాలని యోచిస్తున్న విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రతికూల అంశాలు
సిబిఎస్‌ఈ సిలబస్‌లో జాతీయ స్థాయిలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. చాలా మంది విద్యార్థులు అధిక మార్కులు సాధించడం కోసం ట్యూషన్లు, కోచింగ్ సెంటర్లకు వెళ్లవలసి వస్తుంది. సిబిఎస్‌ఈ పాఠశాలల ఫీజులు రాష్ట్ర సిలబస్ పాఠశాలలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు భారంగా మారుతుంది. సైన్స్, మ్యాథ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఆర్ట్స్, హ్యుమానిటీస్ చదవాలనుకునే విద్యార్థులకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అన్ని రకాల ఆసక్తులు ఉన్న విద్యార్థులకు సమాన ప్రాధాన్యత ఉండకపోవచ్చు.
కొన్నిసార్లు సిబిఎస్‌ఈ సిలబస్‌లో థియరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో కొంతవరకు ఆటంకం కలిగిస్తుంది. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, నిజ జీవితంలో ఉపయోగపడే నైపుణ్యాలకు కూడా ప్రాధాన్యత ఉండాలి. సిలబస్ జాతీయ స్థాయిలో ఉంటుంది కాబట్టి స్థానిక చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది విద్యార్థులకు తమ ప్రాంతం గురించి పూర్తి అవగాహనను లేకుండా చేస్తుందని చెప్పొచ్చు. సిలబస్‌లో అందరికీ ఒకే విధమైన విధానం ఉంటుంది. ప్రతి విద్యార్థి సామర్థ్యాలు, ఆసక్తులు వేరుగా ఉంటాయి. వారి ఆసక్తులకు తగినట్లుగా సిలబస్‌లో మార్పులు ఉండకపోవచ్చు. సిబిఎస్‌ఈ ఎప్పటికప్పుడు సిలబస్‌లో మార్పులు చేస్తుంటుంది. దీనివల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు కొత్త విధానాలకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది.
NCERTని అనుసరించని రాష్ట్రాల బోర్డులు
రాష్ట్ర బోర్డుల వరుసలో పశ్చిమ బెంగాల్ స్టేట్ బోర్డు, పాఠ్యాంశాలు NCERT (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) కి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మీడియం కూడా స్థానిక భాషల్లోనే ఉంది. పశ్చిమ బెంగాల్ స్టేట్ బోర్డ్ CBSE కంటే చాలా వివరణాత్మక, విస్తారమైన పాఠ్యాంశాలతో ఉంటుంది. కానీ సమస్య ఏమిటంటే, ప్రస్తుతం NEET, JEE మెయిన్స్, CUET వంటి అన్ని పోటీ పరీక్షలు NCERT సిలబస్‌పై ఆధారపడి ఉన్నాయి.
పేరెంట్స్ అసోసియేషన్ ఏమంటోందంటే..
స్టేట్ సిలబస్, సీబీఎస్సీ సిలబస్ మంచీ చెడుల గురించి ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్ష్యులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఏపీలో నారాయణ, చైతన్య వంటి... ప్రైవేట్ జూనియర్ కళాశాలలు తమ ఆదిపత్య దోపిడీ కొనసాగించాలంటే జూనియర్, సీనియర్ ఇంటర్ పరీక్షలు ఉండాలనే వాదన బలంగా వినిపిస్తాయన్నారు. వీరు పాఠ్యాంశాల బోధన కాకుండా బట్టీ పట్టించే మెటీరియల్ అంతా ఎన్సీఈఆర్టీ.. సీబీఎస్సీ సిలబస్ ల నుంచి తీసుకుంటారన్నారు. ఉన్నతమైన ఒత్తిడి లేని విద్య.. విద్యార్థులకు అందకూడదనేది వారి భావన. ఈ విద్య ఏదో అందని ద్రాక్ష పండులాగా, ఇదో బ్రహ్మ విద్య లాగా చూపిస్తున్నారని అన్నారు.
దేశవ్యాప్తంగా జరిగే పోటీ పరీక్షలు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ ఇతర పరీక్ష లలో రాణించాలంటే, కేంద్రం సీబీఎస్సీ సిలబస్ ఆధారంగా పరీక్షలు నిర్వహించడం కారణంగా దేశవ్యాప్తంగా జరిగే పోటీ పరీక్షలలో ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పిల్లలు రాణించాలంటే సీబీఎస్ఈ తప్పనిసరి అవుతోందన్నారు.