ఏపీ నుంచి మరో కేంద్ర మంత్రి.. ఏ పార్టీకంటే..!
x

ఏపీ నుంచి మరో కేంద్ర మంత్రి.. ఏ పార్టీకంటే..!

మోదీ కేబినెట్‌లో మరో ఏపీ నేతకు స్థానం దక్కనుంది. ఇప్పటికే ఏపీకి రెండు కేంద్రమంత్రి పదవులను ఖారు చేసిన బీజేపీ తాజాగా మరో కేంద్రమంత్రి పదవిని కూడా ఖారు చేసింది.


మోదీ కేబినెట్‌లో మరో ఏపీ నేతకు స్థానం దక్కనుంది. ఇప్పటికే ఏపీకి రెండు కేంద్రమంత్రి పదవులను ఖారు చేసిన బీజేపీ తాజాగా మరో కేంద్రమంత్రి పదవిని కూడా ఖారు చేసింది. ఈ పదవికి ఏపీ బీజేపీ నేత, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మను ఫైనల్ చేసింది. ఈ అంశంపై ప్రధాన మంత్రి కార్యాలయం ఇప్పటికే భూపతిరాజుకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్‌నాయుడులకు కేంద్ర పదవులు ఖరారయ్యాని సమాచారం. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ ఆంధ్ర బీజేపీ నుంచి కేంద్ర మంత్రి పదవికి పురందేశ్వరికి వస్తుందని అంతా అనుకున్న అంశంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

పురందేశ్వరి పరిస్థితి ఏంటి

కేంద్ర మంత్రి పదవికి ఆంధ్ర బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మకు ఖరారు అయినట్లు వార్తలు పెల్లుబికుతున్న నేపథ్యంలో మరి పురందేశ్వరి పరిస్థితి ఏంటి అన్న అనుమానాలు రేకెత్తున్నాయి. ఈ క్రమంలో పురందేశ్వరికి నియామక పదవులను అందించే అవకాశాలు ఉన్నాయని వాదనలు జోరుగా సాగుతున్నాయి. లేకుంటే ఆమెను ఇప్పుడున్న ఆంధ్ర బీజేపీ అధ్యక్షురాలిగానే కొనసాగిస్తారని తెలుస్తోంది.

భారీ మెజార్టీ సాధించిన భూపతి రాజు

2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నరసాపురం ఎంపీ స్థానంలో భూపతిరాజు శ్రీనివాస వర్మ పోటీ చేశారు. నరసాపురం నుంచి వైసీపీ తరపున గూడూరి ఉమాబాల పోటీ చేశారు. వీరి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుందని, స్వల్ప మెజారిటీతో విజయం ఖరారు అవుతుందని విశ్లేషకులు కూడా అంచనా వేశారు. కానీ అంచనాలన్నింటిని తలకిందులు చేస్తూ భూపతిరాజు 2.76 లక్షల మెజార్టీ సాధించారు. తాను గెలవరు అన్న వారందరికీ తన విజయంతో సమాధానం చెప్పారు భూపతిరాజు.

దశాబ్దాలుగా పార్టీకి సేవ

బీజేపీ కోసం భూపతిరాజు శ్రీనివాస వర్మ దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. 1988 నుంచి వర్మ బీజేపీలోనే కొనసాగుతూ వచ్చారు. అందుకే ఆయనను బీజేపీ వర్మ అని కూడా అనుచరులు పిలుస్తుంటారు. 1980లో కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్‌లో పని చేసిన ఆయన విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. ఆ తర్వాత బీజేపీ సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై 1988లో ఆ పార్టీ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించారు. 1991-97 మధ్య పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షునిగా పనిచేశారు. అలా జిల్లా కార్యదర్శి, నరసాపురం పార్లమెంట్ కన్వీనర్, జాతీయ కౌన్సిల్ మెంబర్‌గా కూడా ఆయన పనిచేశారు. 2020-23 మధ్య బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో నరసాపురం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన ఆయన ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత మళ్లీ 2024 ఎన్నికల్లో నిలబడిన ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించి కేంద్ర కేబినెట్ పదవిని ఖరారు చేసుకున్నారు.

Read More
Next Story