ఏపీలో పర్యటించిన కేంద్ర బృందం.. రైతులకు సీఎం భరోసా
x

ఏపీలో పర్యటించిన కేంద్ర బృందం.. రైతులకు సీఎం భరోసా

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. వరదల వల్ల వాటిల్లిన పంట నష్టాన్ని కేంద్ర అధికారులు పరిశీలించారు.


వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. వరదల వల్ల వాటిల్లిన పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే పెనమలూరు, కంకిపాడు గ్రామీణం, వేమూరు, బాపట్ల ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. రైతులతో మాట్లాడి వారు వేసిన పంట, ఎన్ని ఎకరాలు వంటి వివరాలను సేకరించింది. కాగా తాము ఇంతకాలం పడిన కష్టం కళ్లెదుటే కొట్టుకుపోయిందని, తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు మొదలు పెట్టిన రెండు నెలలకే పంటలకు కొట్టుకుపోయాయని, ఇళ్లు సైతం మునిగి పోయి తీవ్ర అవస్థలు పడుతున్నామని బాధితులు చెప్పారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా తాడేపల్లిలో వరద నష్టంపై నిర్వహించిన ఫొటో గ్యాలరీని సందర్శించింది కేంద్ర బృందం ఈ సందర్భంగానే కృష్ణానదికి వచ్చిన వరద వల్ల కలిగిన నష్టంపై బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి.. కేంద్ర బృందంతో మాట్లాడారు. కృష్ణానదికి ఏన్నడూ రాని విధంగా భారీ వరద వచ్చిందని, దీని వల్ల దాదాపు రూ.1085.46 కోట్ల నష్టం వాటిల్లిందని కలెక్టర్ వివరించారు.

10.63 లక్షల మందిపై వరద ప్రభావం

వరదల రాష్ట్రానికి జరిగిన నష్టం ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.6,880 కోట్లుగా ఉన్నప్పటికీ ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ఇంకా పలు ప్రాంతాల్లో కొనసాగుతోందని అధికారులు చెప్పారు. ఈ వరదలు సుమారు 10.63 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు అభిప్రాయపడ్డారు. బాధితులు ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా కేంద్రం చూడాలని ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా కేంద్ర బృందాన్ని కోరారు. ఇదిలా ఉంటే వరదల కారణంగా పంటను కోల్పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత సాయం చేస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దైర్యం చెప్పారు.




రైతులకు మరింత సాయం: సీఎం

రాష్ట్రాన్ని కేంద్ర బృందం సందర్శిస్తుండగా రైతులకు సీఎం చంద్రబాబు ప్రత్యేక భరోసా కల్పించారు. రైతన్న కంట నీరు రాకుండా చూసుకోవాలని, వరదల వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క రైతుకు సహాయం అందాలని, పెట్టుబడి సాయం మరింత అధికంగా చెల్లించే అకాశాలు ఉన్నాయని ఆయన రైతులకు వివరించారు. మిరప, పసుపు, వరి, పత్తి తదితర పంటలకు నిబంధనల ప్రకారం హెక్టారుకు రూ.17వేలు ఇవ్వాల్సి ఉండగా తమ ప్రభుత్వం హెక్టారు భూమికి రూ.25వేలు అందిస్తుందని సీఎం ప్రకటించారు. దీని ప్రకారం చూస్తే ఒక ఎకరానికి రూ.10 వేలు అందించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

ఏపీలో పంట నష్టం ఇలా..

భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లో 5.64 లక్షల ఎకరాల్లోని వ్యవసాయం, ఉద్యాన పంటలను దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖ పరిధిలో 5.33 లక్షల టన్నుల ఉత్పత్తికి ఈ వరదల కారణంగా విఘాతం కలిగింది. 3 లక్షల మంది రైతులు నష్టపోయారు. వారి నష్టం రూ.1,244 కోట్ల మేర ఉంటుంది. మత్స్యశాఖలో పరిధిలో కూడా 9 జిల్లాల్లో భారీ నష్టం ఏర్పడింది. చేపల చెరువులు, పడవలు, వలల తదతర రూపాల్లో దాదాపు రూ.142 కోట్ల వరకు మత్స్య రైతులు నష్టపోయారని అధికారుల ప్రాథమిక అంచనా.

Read More
Next Story