ఏపీని ఆదుకుంటాం.. చంద్రబాబుకు కేంద్రమంత్రి హామీ
x

ఏపీని ఆదుకుంటాం.. చంద్రబాబుకు కేంద్రమంత్రి హామీ

భారీ వరదలతో విజయవాడ విలవిలలాడింది. రెండు రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయింది. ఆస్తి, ప్రాణ నష్టం కూడా భారీగానే జరిగింది.


భారీ వరదలతో విజయవాడ విలవిలలాడింది. రెండు రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయింది. ఆస్తి, ప్రాణ నష్టం కూడా భారీగానే జరిగింది. వరద బాధితులకు సహాయక చర్యలను కూడా ఏపీ ప్రభుత్వం యుద్దప్రాతిపదికన అందిస్తోంది. ఈ సహాయక చర్యలను సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ఈ తరుణంలోనే కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ఏపీలోని వరద పరిస్థితులను పర్యవేక్షించడానికి ఏపీకి చేరుకున్నారు. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ ఆయనకు రాష్ట్రంలోని పరిస్థితులను పూసగుచ్చినట్లు వివరించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పంట నష్టానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ పర్యటన పరిశీలన అనంతరం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

విజయవాడను ఆదుకుంటాం..

బుడమేరు వరదతో అతలాకుతలమైన విజయవాడ నగరాన్ని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా విజయవాడలో 400 మిల్లీమీటర్ల వర్షం కురిసి విపత్తుకు దారితీసిందని, బుడమేరుకు పలు చోట్ల గండ్లు పడటం వల్లే విజయవాడకు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి ఎదురైందని ఆయన అన్నారు. ఈ విపత్తు వల్ల కలిగిన నష్టం నుంచి విజయవాడ బయటపడేలా చేయడానికి కేంద్రం అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న పరిస్థితిని కేంద్రం గుర్తించిందని, రాష్ట్రానికి మద్దతును, సహాయసహకారాలను కేంద్రం అందిస్తుందని ఆయన వెల్లడించారు.

చంద్రబాబు నాయకత్వం గొప్ప విషయం

ఊహించని విధంగా వచ్చిన ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి కలెక్టర్ కార్యాలయాన్ని తన ఆఫీసుగా మార్చుకుని స్వయంగా సీఎం అక్కడే బస చేస్తూ పరిస్థితులను పరిశీలించడం గొప్ప విషయమని కేంద్ర మంత్రి అన్నారు. అధికారిక బృందానికి నేతృత్వం వహిస్తూ 24 గంటల పాటు శ్రమించి సహాయక కార్యక్రమాలను ముందుండి నడించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సంక్లిష్ట వరద పరిస్థితుల్లో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో పని చేసిందని, దానికి సీఎం నాయకత్వం వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ప్రజలకు అందించే ప్రతి సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన అమలు చేయడమే కాకుండా, అమలవుతున్న అన్ని అంశాలపై గంటల వ్యవధిలోనే సమీక్షలు నిర్వహిస్తూ వాటిలోని లోటుపాట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వాటిని సవరించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో చంద్రబాబు తన అనుభవాన్ని నిరూపించుకున్నారన్నారు.

రాష్ట్రప్రభుత్వమే కారణం..

సరైన సమయంలో సరైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం వల్లే ఇంతటి వరదల్లో మరణాల సంఖ్య ఇంత తక్కువగా ఉందని కేంద్రమంత్రి అన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేసినా, అలసత్వం చూపినా పరిస్థితులు వేరేలా ఉండేయని అన్నారు. వరదలను లేక్కచేయకుండా ప్రజల సంక్షేమం కోసం నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పనిచేయడం హర్షనీయమని ప్రశంసించారు. ఇక్కడ పర్యటించిన క్రమంలో వరద బాధితులను కలిసి వారి కష్టాలతో పాటు వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ చర్యలను కూడా అడిగి తెలుసుకున్నామని చెప్పారాయన. దేశంలో మొదటిసారి డ్రోన్లను వినియోగించి వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు, తాగునీరు,ఔషధాలు చేరవేయడం జరిగిందని, ఈ ఆలోచన చాలా గొప్పగా ఉందని కొనియాడారు.

సహాయక చర్యలు అందించి చేతులు దులుపుకోకుండా వరదలు తగ్గిన తర్వాత బాధితుల ఇళ్లు, రోడ్లను ఫైర్ ఇంజిన్ల సహాయంతో శుభ్రం చేయడం, అంటువ్యాధులు ప్రబలకుండా యుద్దప్రాతిపదికన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం వినూత్నంగా ఉందని, ఇలా చాలా మంచి ఆలోచన అని అన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం..

బుడమేరు ముంపుకు గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. బుడమేరు సమీపంలో గత ప్రభుత్వం హయాంలో జరిపిన అక్రమ తవ్వకాలు కూడా ఈ వరద విపత్తుకు ప్రధాన కారణాల్లో ఒకటిన చెప్పారు. ఈ వరదలతో 1.80 లక్షల హెక్టార్ల పంట నష్టం జరిగిందని, దీని కారణంగా రెండు లక్షల మంది రైతులు నష్టపోయారని తెలిపారు. ఈ పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఎన్‌డీఆర్ఎఫ్, వ్యవసాయ, ప్రణాళిక బృందాలు ఇప్పటికే ఏపీలో తమ పని ప్రారంభించాయని వెల్లడించారు కేంద్రమంత్రి. గత ప్రభుత్వం పంటల బీమా కట్టకపోవడం వల్ల రైతులు నష్టపోయారని, కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం అలాంటి తప్పు చేయదని, వరదల వల్ల నష్టపోయిన రైతులకు కేంద్ర పంటల బీమా పథకం ద్వారా వచ్చే లబ్ధి పూర్తిగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Read More
Next Story