నిర్మలమ్మ ఆంధ్రావరాల మీద మేధావులు అనుమానాలు
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అనుమానాలు వ్యక్తం చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌పై వరాల జల్లు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం రూ.15 వేల కోట్లను ప్రపంచ బ్యాంకు ద్వారా పొందడానికి సహకరిస్తామని, అలాగే ఇతర అంశాల్లో కూడా సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు మేధావులు మాత్రం నిర్మలమ్మ వరాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో విద్య, WEP , ముఖ్యంగా స్కిల్ డెవలప్‌మెంట్ ఇలా ఐదు అంశాల కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించటంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని, కానీ కార్మికులకు ఆర్థిక భద్రత ఇచ్చే విషయంలో చర్యలు లేకపోవడంపై కేంద్ర వైఖరి సరికాదని భావిస్తున్నామని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం..
1. ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టిన దానిమీద ప్రభుత్వ ప్రకటన కింద జతపరుస్తున్నాను. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని రాజధాని కోసం అనేక సంస్థల ద్వారా ప్రత్యేక ఆర్థిక మద్దతు ఈ ఆర్థిక సంవత్సరానికి 15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఏళ్లలో కూడా అదనపు మద్దతు ఉంటుందని ప్రకటించారు. మొట్టమొదటిగా దీనికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇది గ్రాంట్‌గానా లేదా అప్పుగానా అనేది స్పష్టం చేయాలి.
2. చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని, అది రైతులకు, ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి అని ప్రకటించారు. ఈ దేశ ఆహార భద్రత కోసం ఈ ప్రాజెక్టు అవసరం అని కూడా ప్రవచించారు. ఆ ప్రాజెక్టులో 150 అడుగుల నీళ్లు నిలబెడితేనే ప్రాజెక్టు పూర్తయినట్లు తప్ప, ఇక పూర్తి కావాల్సిన ఆ రాతి-మట్టి ఆనకట్ట కట్టేస్తే కాదని అందరికీ తెలుసు. ప్రాజెక్టు పూర్తి కావడానికి అత్యంత ముఖ్యమైనది పునరావాస ప్యాకేజీ అమలు. దానికోసం కూడా పూర్తిగా నిధులు ఇస్తారని స్పష్టంగా ప్రకటించాలి. పునరావాస ప్యాకేజీ వచ్చే రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలి. కెన్ బెట్వా మరియు అప్పర్ భద్ర ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లోనే జాతీయ ప్రాజెక్టులుగా ప్రత్యేక నిధులు ఇంతకుముందే పెట్టింది, పోలవరం విషయంలో పెట్టలేదు.
3. చట్టం ప్రకారం విశాఖపట్నం-చెన్నై మరియు హైదరాబాదు- బెంగళూరు పారిశ్రామిక కారిడార్స్ లోని కొప్పర్తి మరియు ఓర్వకల్లు వద్ద నీళ్లు, రహదారులు, విద్యుత్తు, రైల్వే సదుపాయాలు కల్పించడానికి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఈ సంవత్సరంలోనే అదనపు ఆర్థిక అభివృద్ధి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. సంతోషం దాని కోసం వేచి చూద్దాం.
4. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తరాంధ్రకు చట్టంలో పేర్కొన్న ప్రకారం గ్రాంట్స్ అంటే సహాయం కూడా ప్రొవైడ్ చేయటం జరుగుతుంది అని చెప్పారు. ప్రకాశం జిల్లాని అదనంగా చేర్చారు, సంతోషం. కానీ చట్టం/హామీ ప్రకారం కేబీకే లేదా బుందేల్ఖండ్ తరహాలో పది సంవత్సరాల క్రితమే దాదాపు పాతికవేల కోట్ల రూపాయలు నిధులు రావాలి. ఇంతకుముందు జిల్లాకి 50 కోట్లు చొప్పున ప్యాకేజీ గా ఇచ్చానని చెప్పింది సత్యం కాదు. దేశంలో అనేక జిల్లాలకి 15 సంవత్సరాల క్రితం పెట్టిన పథకం ప్రకారం కొన్ని సంవత్సరాలు ఇచ్చారు తప్ప ప్యాకేజీగా ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అందువల్ల దాంట్లో స్పష్టత రావాల్సి ఉంది. ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి అది అవసరం.
5. ఇవి కాక కడప ఉక్కు కర్మాగారం విషయంపై మాట్లాడలేదు. రామాయపట్నం కేంద్ర ప్రాజెక్టుగా స్వీకరించే విషయమై ప్రస్తావన లేదు. అవి అమలు చేయాలి. విశాఖ ఉక్కుపై కేంద్ర పాకేజీ ఇవ్వాల్సింది.
6. అదేవిధంగా ఏపీలో పెట్టిన అనేక కేంద్ర సంస్థల పరిస్థితి చూస్తే మొత్తం ఆ ప్రాజెక్టుల ఖర్చులో గత 10 ఏళ్లలో దాదాపు 20 శాతం నిధులు మాత్రమే ఖర్చు పెట్టారు, దానిపై వచ్చే రెండు లేదా మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తానని హామీ లేదు. ఉమ్మడి ఆస్తుల లక్షా అరవై తొమ్మిది వేల కోట్ల వివాదం పరిష్కరిస్తామనే మాట లేదు. బడ్జెట్ ఆమోదం లోపు ఆ ప్రకటన ఆశిద్దాం అని పేర్కొన్నారు.
‘‘ఇది కాకుండా ప్రత్యేక హోదా బదులు ఇంకొక రూ.1 లక్షా 30 వేల కోట్ల ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ వచ్చే కొద్ది నెలల్లో ప్రకటించినా, ప్యాకేజీ కచ్చితంగా రావాలి కానీ ప్రత్యేక హోదా దాంతోపాటు వచ్చే రాయితీలకు అది ప్రత్యామ్నాయం కాదు. ఆ రాయితీలు వస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు, సేవా కేంద్రాలు వస్తాయి, అవి భావితరాలకు శ్వాస లాంటివి. ప్రత్యేక హోదా, రాయితీలు విభజన హామీల అన్నిటి అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అఖిలపక్షం వేయాలని కోరుతున్నాం’’ అని చెప్పారు.