కౌంటింగ్ కి సర్వం సిద్ధం.. టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు
x

కౌంటింగ్ కి సర్వం సిద్ధం.. టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైందని అధికారులు వెల్లడించారు. ఈ అంశంపై చంద్రబాబు నాయుడు.. కూటమికి కీలక నేతలతో సమావేశమయ్యారు. వారికి కీలక సూచనలు చేశారు.


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వంసిద్ధమైంది. ఈ కౌంటింగ్ కోసం పార్టీ నేతలతో పాటు ప్రజలు, అన్ని రంగాల వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కౌంటింగ్ రాష్ట్ర భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేకున్నామని కూడా పెద్దపెద్ద విశ్లేషకులు చెప్పడం ఈ ఎన్నికల ఫలితాలపై ఫోకస్‌ను మరింత పెంచేశాయి. ఆ ఫలితాల కోసం అంతా ఎదరుచూస్తున్న రోజుకు ఇంకా ఒక్కరోజే సమయం ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలని, ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులకు, భద్రతా అధికారులకు కీలక సూచనలు చేసింది. వాటికి అనుగుణంగా కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి

తాజాగా దాదాపు రాష్ట్రంలోని అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి కేంద్రాల్లో ప్రత్యేక నిఘా కెమెరాలను ఏర్పాటు చేశామని, వాటిని అధికారులు నిరంతరం గమనిస్తుంటారని అధికారులు చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి రాష్ట్ర పోలీసులకు అనుమతి లేదని, కేవలం సీఆర్‌పీఎఫ్ పోలీసులు మాత్రమే ఉంటారని అధికారులు తెలిపారు. ‘‘కౌంటింగ్ ప్రక్రియను సాయంత్రం నాలుగు గంటల కల్లా పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. దాంతో పాటుగా అభ్యర్థులకు డిక్లరేషన్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా చూసుకుంటున్నాం. ఎవరికీ ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల వారికి ఏర్పాట్లు చేశాం. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ వేరువేరుగా చేపట్టేలా ఏర్పాట్లు చేశాం. ఈవీఎంల, పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ఏకకాలంలో జరుగుతుంది’’ అని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించమని, సిబ్బంది, అభ్యర్థులు అందరికీ పార్కింగ్ సదుపాయాలు కూడా చేశామని వివరించారు.

అప్పటి వరకు బయటకు రావొద్దు: చంద్రబాబు

రాష్ట్రంలో చేస్తున్న కౌంటింగ్ ఏర్పాట్లపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి ఆయన నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో చర్చించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ అగ్రనేతలు పురందేశ్వరి, అరుణ్ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఈ ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని నేతలకు ధైర్యం చెప్పారు. ఓటమి భయంలో వైసీపీ అల్లరి మూకలు గొడవలు చేయడానికి పాల్పడటానికి ప్రణాళికలు రచిస్తున్నాయని, కావున అందరూ జాగ్రత్తగా వాటిని ఎదుర్కోవాలని వివరించారు. పోస్టల్ ఓట్లలో కూడా వైసీపీ కొర్రీలు చేయాలని వైసీపీ యత్నించించదని, డిక్లరేషన్ ఫాం తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావాలని సూచించారు. శనివారం సాయంత్రం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమే విజయం సాధిస్తుందని చెప్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌ఏ ప్రభుత్వం రానుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

‘లీగల్ టీమ్‌ను అందుబాటులో ఉంచుకోండి’

ఈ సందర్బంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రతి అభ్యర్థి కూడా లీగల్ టీమ్‌ను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఏపీలో ఎన్‌డీఏ కూటమికి 21 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 53శాతం ఓట్లతో కూటమి గెలుస్తుందని పునరుద్ఘాటించారు. లెక్కింపులో ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే రీకౌంటింగ్ అడగాలని వివరించారు. వైసీపీ వాళ్లు రెచ్చగొట్టేలా మాట్లాడినా పట్టించుకోవద్దని, వారికి గెలుపుతో సమాధానం చెప్పాలని పురందేశ్వరి చెప్పారు. కౌంటింగ్ సమయంలో అన్ని నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిద్దామని అభ్యర్థులకు పిలుపునిచ్చారు.

కారణాలు వెతుక్కునే పనిలో వైసీపీ

కౌంటింగ్ రోజు నుంచి అనేక అక్రమాలకు పాల్పడిన వైసీపీ.. కూటమి రోజున కూడా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తుందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి కూటమి అభ్యర్థులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రానికి అందరూ సమచాయానికి చేరుకోవాలని, తమ ఓటమిని గుర్తించిన వైసీపీ ఇప్పటి నుంచి ఏం చెప్పాలా అని కారణాలు వెతుక్కుంటుందంటూ ఎద్దేవా చేశారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి తీసుకొచ్చే సమయం చాలా కీలకమని, ఆ సమయంలో ప్రతిఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More
Next Story