సాఫ్ట్‌వేర్లకు, సినిమాలకు వెర్షన్లు పెట్టడం చూస్తుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులు వెర్షన్లు ప్రకటించుకోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది.


ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వెర్షన్లు అనేవి ఓ ట్రెండ్‌గా మారింది. తాము గతంలో కంటే భిన్నంగా ఉన్నామని, భిన్నంగా ఉంటామని చెప్పేందుకు వెర్షన్లను ప్రకటించుకుంటున్నారు. సాఫ్ట్‌ వేర్లకు సహజంగా వెర్షన్లు నిర్ణయిస్తుంటారు. అలాగే ఆండ్రాయిడ్‌ ఫోన్లు కూడా వెర్షన్లతో రిలీజ్‌ చేస్తుంటారు. సీక్వెల్‌ సినిమాల్లో కూడా దీనిని పాటిస్తుంటారు. సౌత్‌ ఇండియన్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌–ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమాతో ఇది పాపులర్‌ అయింది. తాజాగా ఈ వెర్షన్లు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. తాము గతంలో ఎలా ఉన్నాము.. భవిష్యత్‌లో ఎలా ఉండబోతున్నామో అని సంకేతాలిస్తూ వెర్షన్లు గురించి ప్రస్తావించడం తాజాగా ట్రెండీగా మారింది.

తొలుత సీఎం చంద్రబాబు నాయుడే ఈ వెర్షన్ల ట్రెండ్‌కు నాంది పలికారు. నాలుగో సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పీఠమెక్కిన తర్వాత 2024 జూలైలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పథకం ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన ప్రజావేదికలో ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి సీఎం చంద్రబాబు 4.o చూస్తారని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి సారిగా 1995లో సీఎం అయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంత టెర్రర్‌ క్రియేట్‌ చేశానో.. అంతకు మించి ఈ సారి ఉంటుందని అన్నారు.
అప్పుడు హైదరాబాద్‌లో నేను బయలు దేరానంటే.. ఏపీ అంతా రెడ్‌ అలెర్ట్‌ ఉండేదని అన్నారు. నాలుగో సారి సీఎం అయిన తర్వాత.. రివర్స్‌ గేర్‌ నుంచి బండిని పాజిటివ్‌గా నడిపిస్తున్నాం. ఇక స్పీడ్‌ పెంచడం తప్ప వెనక్కి పోయే సమస్యే లేదు. ఆ ఆలోచనే ఎవ్వరికి రాకూడదు. ఒక షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తే అందరూ సెట్‌ అయిపోతారు. ఆ రకమైన షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. అందుకే చెప్పాను 1995 ముఖ్యమంత్రిని మర్లా చూస్తారు అని. సీబీఎన్‌ 4.oని చూస్తారు. 1995లో చరిత్ర ఒక సారి గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రోడివి. నీకూ ఐడియా లేదు.. అంటూ మంత్రి లోకేష్‌ ఉద్దేశించి అన్నారు. దానికి తండ్రీ, కొడుకుల మధ్య నవ్వులు విరబూశాయి. తర్వాత చంద్రబాబు తన స్పీచ్‌ను కంటిన్యూవ చేస్తూ.. అప్పడు నా చరిత్ర గుర్తు పెట్టుకుంటే.. అప్పుడు తాను హైదరబాద్‌లో బయలుదేరానంటే రాష్ట్రం మొత్తం రెడ్‌ అలెర్ట్‌ ఉండేది. అప్పుడంత భయంకరంగా చేయను కానీ.. తప్పు చేస్తే మాత్రం ఎవ్వరినీ వదిలి పెట్టను. అందుకే మైండ్‌ అంతా మార్చుకోవాలి. అందుకే 1995 అన్నా.. 1995 సీబీఎన్‌.. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంటే తన 4.o వెర్షన్‌ గురించి చెబుతూ తాను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అవి అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశాయి.
తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన వెర్షన్‌ గురించి ప్రస్తావించారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్లు, ఇతర నాయకులతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇక నుంచి జగనన్న 2.oను చూస్తారని, ఆ జగనన్న 2.oవెర్షన్‌ చాలా వేరుగా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. జూన్‌లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఇంచు మించు ఇలాంటి వ్యాఖ్యలే మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేశారు. జగన్‌ తన స్పీచ్‌ను కొనసాగిస్తూ.. ఈ సారి జగనన్న 2.oవెర్షన్‌ చాలా వేరుగా ఉంటుంది. జగనన్న 2.o.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కోసం ఎలా పని చేస్తుందో కూడా చూపిస్తుంది.
ఇది మాత్రం చాలా ఖచ్చితంగా చెబుతున్నా. జగనన్న 1.oలో బహుశా కార్యకర్తల కోసం గొప్పగా చేయలేక పోవచ్చు. ప్రజల కోసమే కేటాయించాను. వారికి మంచి చేసేందుకే వెచ్చించా. ప్రజల కోసం తాపత్రయ పడ్డా. కానీ జగనన్న 2.oకి వచ్చే సరికి మాత్రం.. చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు పెడుతున్న ఇబ్బందు చూస్తున్నా. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు పడుతున్న అవస్థలు చూస్తున్నా. కార్యకర్తలు పడుతున్న బాధలను గమనించా. వీళ్ల కోసం జగనన్న ఉంటాడని హామీ ఇస్తూ.. తాను తిరిగి అధికారంలోకి వస్తే.. జగనన్న 2.oగా తాను ఎలా చేస్తారో.. ఏమి చేస్తారో అనే విషయాలను సూచన ప్రాయంగా వెల్లడిస్తూ.. చంద్రబాబు, లోకేష్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగానికి, టీడీపీ పార్టీ నేతలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
Next Story