టార్గెట్ ఉత్తరాంధ్ర....
x
జగన్, చంద్రబాబు

టార్గెట్ ఉత్తరాంధ్ర....

ఆ పార్టీల అధినేతల చూపు ఉత్తరాంధ్ర వైపు పడింది. క్లీన్ స్వీప్ చేయాలని ఒకరు... పూర్వ వైభవం కోసం ఇంకొకరు..ఎవరా నేతలు...?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: పూర్వ వైభవం కోసం బాబు... మళ్లీ క్లీన్ స్వీప్ కోసం జగన్... ఇద్దరు అధినేతలు ఉత్తరాంధ్రనే టార్గెట్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వీరి పర్యటనలు అధికమయ్యాయి. విశాఖలో పారిశ్రామికవేత్తల సదస్సుతో పాటు వైసీపీ సిద్ధం సభను తొలిసారిగా భీమిలిలోనే నిర్వహించారు. ఇక ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి జగన్ విశాఖపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒకప్పటి కంచుకోటను తిరిగి నిర్మించుకోవాలన్న కృతనిశ్చయంతో చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల శ్రీకాకుళంలో నిర్వహించిన 'రా కదిలి రా' సభలో ఆయన ప్రసంగం ఉత్తరాంధ్ర తన టార్గెట్ అని చెప్పకనే చెప్పింది. ఇక ఉత్తరాంధ్ర వాసుల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.

గతంలో ఏం జరిగింది...

ఉత్తరాంధ్ర జిల్లాలు ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేవి. 2014 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ స్థానాలకు గాను 24 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ తొమ్మిది స్థానాలు, బీజేపీ ఒక్క స్థానంలో గెలుపొందాయి. 2014 వరకు ఉత్తరాంధ్రపై టీడీపీ ఆధిపత్యం స్పష్టంగా ఉండేది. అయితే 2019 ఎన్నికల్లో దాన్ని తిరగరాసింది వైసీపీ. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన వైసీపీ ప్రభంజనంలో భాగంగా ఉత్తరాంధ్ర 34 స్థానాలకు గాను 28 స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ.. విశాఖలో నాలుగు స్థానాలు శ్రీకాకుళంలో రెండు స్థానాలు కలిపి ఆరు స్థానాలకే పరిమితం అయింది.

వ్యూహాలేంటి...

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరాంధ్రపై ఆధిపత్యం చాటుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. వ్యూహ, ప్రతి వ్యూహాలలో తలమునకులై ఉన్నాయి. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామంటూ వైసీపీ... ఉత్తరాంధ్ర పరిరక్షణ పేరిట ఉద్యమాలు చేస్తున్న టీడీపీ... ఎవరికి వారు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ ఎన్నికల వేళ ఇద్దరు అధినేతలు హామీలు గుప్పిస్తున్నారు. అయితే ఈసారి ఉత్తరాంధ్ర ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే.



Read More
Next Story