పింఛన్ పథకంలో మార్పులు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీలో అమలవుతున్న పింఛన్ పథకంలో పలు మార్పులు చేస్తూ నూతన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పథకం పేరును ఎన్‌టీఆర్ భరోసాగా మార్చారు.
ఏపీలో అమలవుతున్న పింఛన్ పథకంలో పలు మార్పులు చేస్తూ నూతన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్దిదారులకు అందే పింఛన్‌ను పెంచడంతో పాటు పథకం పేరును కూడా మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇన్నాళ్లూ వైఎస్‌ఆర్ పింఛన్ ఫథకంగా ఉన్న ఈ పథకం పేరును ఎన్‌టీఆర్ భరోసాగా మారుస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఫథకంలో మరిన్ని మార్పులకు కూడా శ్రీకారం చుట్టారు. వాటిలో ఇప్పటివరకు రూ.3 వేలుగా ఉన్న పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతున్న ఉత్తరవులు కూడా ఉన్నాయి.
పింఛన్ల మార్పు ఇలా..
పింఛన్ పథకంలో కొత్తగా తీసుకొచ్చిన మార్పుల ప్రకారం వృద్ధాప్య పింఛన్ ఒక నుంచి నెలకు రూ.4వేల రానున్నాయి. ఈ మార్పు ఏప్రిల్ నెల నుంచి అమలవుతుంది. దీంతో ఈ మూడు నెలలు అందాల్సిన అదనపు వెయ్యి రూపాయలను కూడా వచ్చే పింఛన్‌లో కలిపి మొత్తం రూ.7వేలు అందించనున్నట్లు సమాచారం. దాంతో పాటుగా దివ్యాంగులకు ఇప్పటివరకు రూ.3 వేలుగా ఉన్న పింఛన్‌ను రూ.6వేలకు పెంచారు. కుష్టుతో వైకల్యాం సంభవించిన వారికి కూడా ఆరు వేల రూపాయలు అందించనున్నారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇన్నాళ్లూ రూ.5వేలుగా ఉన్న పింఛన్‌ను రూ.10వేలకు పెంచుతున్నట్లు తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా అనారోగ్యం, వృద్ధాప్యం వల్ల మంచానికే పరిమితమయిన వారికి నెలకు రూ.5 వేలు ఇస్తుండగా ఆ మొత్తాన్ని రూ.15వేలకు పెంచుతున్నట్లు కూడా వెల్లడించింది.
ప్రభుత్వం మారితే పేరూ మారాలా..
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ పథకం పేరును ఎన్‌టీఆర్ భరోసాగా మార్చడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వం మారిన ప్రతిసారి ప్రభుత్వ పథకాల పేర్లు మారాల్సిందేనా? అదేమైనా సంప్రదాయమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు మహానుభావుల పేర్లు పెట్టడం అనేది వారికి మనం ఇచ్చే గౌరవం? కానీ ప్రభుత్వ పథకాలపై ప్రభుత్వ చిహ్నం కాకుండా ముఖ్యమంత్రి ఫొటోలు, పథకాలకు సీఎం పేర్లు ఎందుకు పెట్టాల్సి వస్తుందని నిలదీస్తున్నారు. ఇలా వారు చేస్తున్న ఆలోచనారహిత పనుల కారణంగా ప్రభుత్వం మారిన ప్రతిసారి వీటిని మార్చుకోవడానికి వందల కోట్ల రూపాయాల ప్రజాధనాన్ని వెచ్చించాల్సి వస్తుందని పలువురు మేధావులు అంటున్నారు.
ఇప్పుడు ఆ రంగులూ మారతాయా..
2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ పార్టీ రంగులు వేయించారు. అప్పట్లో ఇదొపెద్ద వివాదం కూడా అయింది. ఇందుకోసం వైసీపీ ప్రభుత్వం దాదాపు రూ.4వేల కోట్లు ఖర్చు చేసిందని అప్పట్లో ఆరోపణలు వెళ్లువెత్తాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది. జెండా, రంగూ మారింది. దీంతో ఇప్పుడు ఆ భవనాల రంగులు కూడా మారతాయా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. మరోవైపు అసలే రాష్ట్ర ఖజానా భారీ చిల్లు పడి ఉందని, ఇప్పుడు ఆ రంగుల మార్పు కార్యక్రమం పెట్టుకుంటే మరో రూ.4 వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అవుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
‘ఈ వృధాకు బాధ్యులెవరు’
ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల విషయంలో భారీగా దుర్వినియోగం అవుతుందని ప్రజాప్రతినిధుల సొమ్ము కాదు. ప్రజల సోమ్మే అని సామాజికవేత్త పీ వేణుగోపాల్ చెప్పారు. ఈ అంశంపై గతంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘భవనాలకు ఒక పార్టీకి చెందిన రంగులు వేయడం వల్ల, ఒక పార్టీ నేతకు సంబంధించిన పేర్లతో పథకాలు పెట్టడవం వల్ల వచ్చే లాభమేంటో తెలియదు. ఒక్కసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే.. ఈవేమీ చెల్లవు. వేసిన రంగులు తీయాల్సిందే. పెట్టిన పథకాలు ఆపాల్సిందే. గతంలో రంగుల విషయంలో కోర్టు తీర్పుతో దాదాపు రూ.100 కోట్లు అధికారికంగా బూడిదలో పోసినట్లు అయిపోయాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే కొన్ని చోట్ల మార్పులు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ స్థాపన జరగడంతో వైఎస్ పేరుతో ఉన్న అన్ని పథకాల పేర్లు మారతాయిన మెధావులు చెప్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. వీటితో పాటుగా జగన్, వైఎస్ఆర్ ఫొటోలను చంద్రబాబు, ఎన్‌టీఆర్ ఫొటోలు రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని చోట్ల భవనాల రంగులు మార్చడానికి కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అసలు ప్రభుత్వ పథకాలకు ప్రభుత్వ చిహ్నాన్ని గుర్తుగా పెట్టుకుంటే ప్రతి ఐదేళ్లకు నిధులు వినియోగించి మరీ ఫొటోలు మార్చుకోవాల్సిన అవసరం ఉండదు కదా అని కూడా పలువురు నిపుణులు చెప్తున్నా వాటిని రాజకీయ పార్టీలు మాత్రం పెడచెవిన పెడుతున్నాయి. ఖర్చు పెరిగినా తమ ఫొటోలే ఉండాలన్నట్లు వ్యవహరిస్తున్నాయి.
ఈసారైనా మార్పు ఉంటుందా..?
ఇప్పటికే ప్రభుత్వ ఖజానాలో నిధులు అడుగంటి ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పేర్ల మార్పుతో ఆగుతారా లేకుంటా ఫొటోలు, రంగులు కూడా మారుస్తారా అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే కొందరు మాత్రం ఈసారి పాత మార్పుల సంప్రదాయానికి చంద్రబాబు స్వస్థి పలుకుతారని అంటున్నారు. మరి టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.