ఏపీలో ఉచిత బస్సు పథకంపై చంద్రబాబు ఏమన్నారంటే..!
x

ఏపీలో ఉచిత బస్సు పథకంపై చంద్రబాబు ఏమన్నారంటే..!

‘వినాయకుడి పెళ్ళి ఎప్పుడు అంటే రేపు’ అన్నట్లు ఉంది ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం పరిస్థితి. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ అందరినీ ఆకట్టుకున్న హామీల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రధానంగా ఉందనడంలో సందేహం అక్కర్లేదు.


‘వినాయకుడి పెళ్ళి ఎప్పుడు అంటే రేపు’ అన్నట్లు ఉంది ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం పరిస్థితి. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ అందరినీ ఆకట్టుకున్న హామీల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రధానంగా ఉందనడంలో సందేహం అక్కర్లేదు. ఈ ఒక్క పథకంతో మహిళలందరినీ తనమైపు తిప్పుకోవడంలో చంద్రబాబు గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఎన్నికల్లో కూడా అంతే చారిత్రాత్మక విజయం సాధించింది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ పథకంపై సరైన అప్‌డేట్ లేదు. ఎప్పుడు చూసినా చర్యలు చేస్తున్నామన్న వ్యాఖ్యలే తప్పు ఈ పథకం అమలు దిశగా పడుతున్న అడుగులు మాత్రం శూన్యం. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ కూడా ఈ వ్యవహారంపై పలుసార్లు స్పందించినా ప్రతి సారి ఒకే విషయం చెప్పడం గమనార్హం. తాజాగా ఈ పథకం అమలు గురించి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే స్పందించడంతో ఈ పథకం మరోసారి వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

పకడ్బందీగా అమలు

‘‘ఎన్నికల సమయంలో ఇచ్చిన విధంగానే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. ఇప్పటికే ఈ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈ పథకానికి సంబంధించి ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లోని విధివిధానాలను అధ్యయనం చేస్తున్నాం. అక్కడ అమలు చేస్తున్న విధానాలను అధికార బృందం పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక అందిస్తుంది. ఆ మేరకు అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక ఇవ్వాలి. కాస్తంత ఆలస్యమైనా లోపాలు లేకుండా, మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా విధానాలను రూపొందించాలి’’ అని అధికారులను దిశానిర్దేశం చేశారు.

ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చాలి..

భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కూడా అధికారులను ఆదేశించారు చంద్రబాబు. ‘‘డీజిల్, ఎలక్ట్రిక్ బస్సుల మధ్య అన్ని అంశాల్లో ఉన్న వ్యత్యాసాన్ని లెక్కించాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీలో కూడా ఈవీ బస్సులను తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడానికి కేంద్రం అందిస్తున్న సబ్సిడీలను వినియోగించుకోవాలి. తద్వారా 1253 ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకోవాలి. దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపితే ఛార్జింగ్ విషయంలో వచ్చే సమస్యలకు అధికారులు పరిష్కారాలు చూపాలి’’ అని సూచించారు.

ఆ బస్సులను తొలగించాలి

ఇప్పటికే ప్రతిపాదించిన 1489 డీజిల్ బస్సులను కూడా సమకూర్చుకోవాలని సీఎం అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది తప్ప, ఆర్టీసీలోని సమస్యలను మాత్రం గాలికి వదిలేసిందని, ఉద్యోగుల సమస్యలను కూడా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రమాదాల నివారణకు ఎస్పీ, కలెక్టర్, రోడ్ సేఫ్టీ అధికారులు సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా 15 ఏళ్లు దాటిన వాహనాలను తొలగించాలని, ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని సూచించారు.

Read More
Next Story