సీఎం జగన్‌కు చంద్రబాబు కౌంటర్.. ‘అవును నేను పశుపతినే’
x
Source: Twitter

సీఎం జగన్‌కు చంద్రబాబు కౌంటర్.. ‘అవును నేను పశుపతినే’

జగన్ చేసిన పసుపుపతి వ్యాఖ్యలకు చంద్రబాబు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అవును నేను పశుపతినేనని చెప్పారు. పరమశివుడి తరహాలోనే ప్రజల కోసం పోరాడతానని అన్నారు.


‘అరుంధతిలో సమాధి నుంచి వచ్చిన పశుపతి మాదిరిగా ఐదేళ్ల తర్వాత చంద్రబాబు కూడా పసుపుతిలా వచ్చారు. పేదల రక్తాన్ని పీల్చడానికి సీఎం కుర్చీని చూసి కేకలు వేస్తున్నారు’ అన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అవును.. నేను పశుపతినేనంటూ ఆసక్తికరంగా బదులిచ్చారు. ‘‘పశుపతి అంటే పరమశివుడు. మానవాళి కోసం గరళాన్ని మింగిన శివుడిలా నేను కూడా ప్రజల కోసం పోరాడతాను. ప్రజల సంక్షేమం కోసం శివుడి అవతారమెత్తాను’’అంటూ కొత్తపేటలో జరిగిన ప్రజాగళం రోడ్ షోలో చంద్రబాబు రిప్లై ఇచ్చారు. జగన్, చంద్రబాబు మధ్య కౌంటర్ రీకౌంటర్లతో ఆంధ్రలో ఎన్నికల వేడి పెరిగిపోతోంది. ఓవైపు ఈసారి సీఎం జగన్ చిత్తు కావడం ఖాయమని టీడీపీ కూటమి శ్రేణులు అంటుంటే.. 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

జగన్ మాటలు విని నవ్వుకున్నా

‘‘నన్ను ఉద్దేశించి సీఎం జగన్.. పశుపతి అని మాట్లాడటం చూసి నవ్వుకున్నా. ఎందుకంటే పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడటానికి వచ్చిన పరమశివుడు. ప్రపంచ సంక్షేమం కోసం గరళాన్ని మింగాడు. అదే విధంగా నాపై ఎన్నో రకాల దాడులు, అవహేళనలు, ఆరోపణలు, విమర్శలు చేసినా వాటన్నింటినీ గరళంగా మింగి ప్రజలను కాపాడుకోవడానికి పోరాడుతున్నాం. పవన్ కల్యాణ్‌ను కూడా వ్యక్తిగత దూషణలతో అవమానించారు. కానీ మా లక్ష్య సాధనకై వాటన్నింటినీ భరించాం. తెలుగుజాతిని కాపాడుకోవాలన్న లక్ష్యంతో అన్ని రకాల దాడుల్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఎన్నికల ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నాం’’ అని ఈసారి విజయం తమదే అని చెప్పకనే చెప్పారు చంద్రబాబు.

వందకు వందశాతం అధికారం మాదే

2024 ఎన్నికల్లో తప్పకుండా కూటమే విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘‘రాయలసీమ కావచ్చు కోనసీమ కావచ్చు.. ఎక్కడ చూసినా ఒకే స్పందన. ఈసారి వచ్చేది కూటమి ప్రభుత్వమే అని. ఆకలితో ఉన్న సింహం వేట కోసం ఎదురుచూసినట్లు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఎన్నికల కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వారు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మే 13న జరిగే పోలింగ్‌లో రెండు బటన్లు నొక్కి వైసీపీని చిత్తు చేసి బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈసారి వందకు వందశాతం కూటమిదే అధికారం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే. ప్రశాంతతకు మారురూపంగా ఉన్న కోనసీమలో వైసీపీ హయాంలో అల్లర్లు, దౌర్జన్యాలు, దోపిడీలు, గంజాయి, డ్రగ్స్, హత్యలు, కబ్జాలు, అక్రమ కేసులు, కుల రాజకీయాలు, మాఫియా రాజ్యాలు అన్నీ వచ్చాయి. జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని, రాష్ట్రానికి పట్టిన శని పోవాలని జనసేనాని పవన్ మొదటి నుంచి భావించారు. ఒకే మాటపై నిలబడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే బీజేపీ కలిసి ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నాం’’అని వెల్లడించారు.

ప్రజల ప్రాణాలు తీసిన దుర్మార్గుడు జగన్

‘‘మద్య నిషేధం చేసిన తర్వాతనే తాను మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి దిగి ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్.. సంపూర్ణ మద్య నిషేధం చేశారా? ఎన్నికలు వస్తున్నాయంటే మాయ మాటలను మూటగట్టుకుని వచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక కల్తీ మద్యం తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిషేధం సంగతి దేవుడెరుగు.. రూ.60 ఉండే క్వార్టర్ మద్యాన్ని రూ.200 చేశారు. ఆ పెంచిన రూ.140 ఎవరి జేబుల్లోకి పోతున్నాయి. తన ఆదాయం, ఖజానా పెంచుకోవడానికి ప్రజల ప్రాణాలు తీసిన దుర్మార్గుడు జగన్. ఇప్పుడు మళ్లీ మద్యం నిషేధం పేరుతో ఓట్లు అడుగుతున్నారు. ఐదేళ్ల పరదాలు కప్పుకుని తిరిగి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో మోసపూరిత హామీలతో ప్రజల చెంతకు వస్తున్నారు. అలాంటి వ్యక్తికి ప్రజలంతా ఏకమై బుద్ధి చెప్పాలి. మద్య నిషేధం చేయకుంటే ఓటు అడిగే హక్కు లేదని నిలదీయాలి’’అని ఓటర్లకు చంద్రబాబు పిలుపునిచ్చారు.


Read More
Next Story