జగన్ పాలెస్‌లోకి బాబు అడుగులు..
x

జగన్ పాలెస్‌లోకి బాబు అడుగులు..

సీఎం అయ్యాక తొలిసారి రుషికొండలోకి ప్రవేశం. అక్కడ రాజ భవనాలను చూసి అవాక్కయిన బాబు. త్వరలోనే ప్రజలను అనుమతిస్తామని ప్రకటన.

జగన్ కలల సౌధంలోకి చంద్రబాబు అడుగు పెట్టారు. అక్కడ భవంతులను చూసి అచ్చెరువొందారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం సాగరతీరంలోని రుషికొండలో మహారాజు భవనాన్ని తలపించేలా 18 ఎకరాల్లో ప్యాలెస్ను నిర్మించారు. ఇందుకు ఏకంగా రూ.500 కోట్లను ఖర్చు పెట్టారు. విశాఖను రాజధానిని చేయాలని, ఆ సౌధంలో నివాసం ఉండాలని ఆయన కలలు కన్నారు.

కానీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవడంతో జగన్ కలలన్నీ కల్లలయ్యాయి. కళ్లు చెదిరే కట్టడాలు, అందులోని వసతులు, సదుపాయాలు, ఫర్నిచర్ ఒకటేమిటి అన్నీ దేనికవే ప్రత్యేకతను సంతరించుకుని నభూతో, నభవిష్యతి అన్నట్టుగా ఉన్నాయి. దీంతో దేశమంతా రుషికొండ భవనాలపైనే చర్చించుకునే పరిస్థితి వచ్చింది.

వైసీపీ పోయి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ రుషికొండ భవంతులను ఏం చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగు నెలలుగా సమాలోచనలు చేస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాను వెంటబెట్టుకుని రుషికొండ ప్యాలెస్లోకి ప్రవేశించారు. దీంతో అక్కడ కట్టడాలు, లోపలున్న సోయగాలు బయట ప్రపంచానికి తెలిసొచ్చాయి.

దీంతో ఈ భవనాలకు మరింత ప్రాచుర్యం

పెరిగింది. చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ లు విశాఖ వచ్చినా అటువైపు కన్నెత్తి చూడడమే తప్ప అందులోకి అడుగుపెట్టే సాహసం చేయలేక పోయారు. దీనిపై చంద్రబాబే ఏదో నిర్ణయం తీసుకుంటారని మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతూ వస్తున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా రుషికొండ భవనాల పరిశీలనకు వెళ్లారు. ఇన్నాళ్లూ రుషికొండ ప్యాలెస్ గురించి ఆనోటా, ఈనోటా వినడమే తప్ప కళ్లతో చూడని చంద్రబాబు అక్కడ ఉన్న కట్టడాలను, లోపల ఉన్న విదేశీ ఫర్నిచరు వగైరాలను చూసి నిశ్చేష్ఠులయ్యారు. రుషికొండ భవనాలు కళ్లు చెదిరేలా ఉన్నాయన్నారు.

'ఒక వ్యక్తి (జగన్) విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసిందిక్కడే. గుండె చెదిరే వాస్తవాలు బయట పడుతున్నాయి. రుషికొండ ప్యాలెస్కు రూ.450 కోట్లు ఖర్చు పెట్టారు. బాత్ టబ్ కోసమే ఏకంగా రూ.36 లక్షలు వెచ్చించారు. ఏడు బ్లాకులతో 18 ఎకరాల్లో విలాసవంతమైన భవనాలు కట్టారు తొలుత టూరిజం కోసం అన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి, ప్రధాని కోసం అని చెప్పారు. ప్రధాని, రాష్ట్రపతిలు ఎప్పుడూ ఇలాంటి ప్యాలెస్లు కోరుకోలేదు' అని మీడియాతో వ్యాఖ్యానించారు.

'ఎటు చూసినా సముద్రం కనిపించేలా కట్టారని, రాజులు కూడా ఇలాంటివి కట్టుకోలేదేమో? వైట్ హౌస్, రాష్ట్రపతి భవన్లోనూ ఇంత విలాసం లేదు. ఒకప్పుడు రాజులు విలాసవంతమైన భవనాలు కట్టుకునే వారు. కోర్టులు, కేంద్రాన్ని మభ్యపెట్టి ఇలాంటి నిర్మాణాలు చేపట్టారు. రుషికొండ ప్యాలెస్ పై విచారణ జరిపిస్తే అన్నీ బయటకొస్తాయి' అనిపేర్కొన్నారు.

ప్రజలను అనుమతిస్తాం..

ముఖ్యమంత్రి చంద్రబాబు రుషికొండ ప్యాలెస్ పై ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇక్కడి భవనాలను వీడియో తీసి ప్రజలకు అందిస్తామన్నారు. అంతేకాదు.. ఈ భవనాల్లోకి వారినీ అనుమతిస్తాం' అని ప్రకటించారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామని తెలిపారు. దీంతో చాలా రోజులుగా రుషికొండను అల్లంత దూరం నుంచి చూడడమే తప్ప అడుగు పెట్టే పరిస్థితి లేని ఈ ప్యాలెస్లోకి ప్రజలను అనుమతిస్తామన్న చంద్రబాబు ప్రకటన ఈ ప్రాంత వాసుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read More
Next Story