తెలంగాణలో గెలవడమే లక్ష్యం.. చంద్రబాబు కీలక నిర్ణయం
తెలంగాణలో కూడా టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కూడా టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆ కలను నెరవేర్చడానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన తర్వాత చంద్రబాబు.. తెలంగాణపై ఫోకస్ పెట్టారు. తెలంగాణలో టీడీపీని పూర్వవైభవానికి తీసుకురావడానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని కూడా గతంలో చెప్పారు. ఆ దిశగానే చర్యలు కూడా చేపడుతున్నారు. హైదరాబాద్‌లోన ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన తెలంగాణ టీడీపీ ముఖ్యనేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగానే తెలంగాణలో టీడీపీ పునరుద్దరణకు తీసుకోవాల్సిన కార్యాచరణపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణలో పార్టీ బలోపేతానికి, సభ్యత్వ నమోదుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా నాలుగు దశాబ్దాలుగా టీడీపీ ఎదుర్కొన్న సవాళ్లు, ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు, జయాపజయాల గురించి ఆయన ప్రస్తావించారు.
సభ్యత్వ నమోదులో వారికే పెద్దపీట
మరో 15 రోజుల్లో తెలంగాణ టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ సభ్యత్వ నమోదులో యువకులు, బీసీలకు పెద్దపీట వేస్తామని, సభ్యత్వ నమోదు ప్రక్రియ తర్వాతే తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఎంపిక చేస్తామని చెప్పారు. ‘‘చాన్నాళ్లయిందని అందరినీ ఒకసారి చూద్దామని వచ్చాను. పార్టీ కోసం కష్టపడ్డ వారి కోసం నా రాక ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నారు. కొన్ని కారణాల వల్ల గత ఎన్నికలకు దూరంగా ఉన్నాం. అధ్యక్షుడిని కూడా నియమించలేదు. ఇక్కడి ప్రజల మనోభావాలను గౌరవిస్తా. పార్టీని ఎలా బలోపేతం చేయాలి, కార్యకర్తలకు ఎలా అందుబాటులో ఉంచాలి అన్న అంశాలపై ఆలోచిస్తా’’ అని వివరించారు. అంతేకాకుండా సామరస్యంగా మంచి వాతావరణంలో రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
పాత కమిటీలు రద్దు
టీటీడీపీ ముఖ్యనాయకుల సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలను కూడా తీసుకున్నారు నారా చంద్రబాబు. తెలంగాణ టీడీపీలోని పాత కమిటీలన్నింటిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ‘‘పార్లమెంటు, అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారిగా ఉన్న కమిటీలను రద్దు చేస్తున్నాం. ఏపీ, తెలంగాణ రెండురాష్ట్రాల్లో కొత్త కమిటీల ఏర్పాటును ఒకేసారి చేయాలని నిర్ణయించాం. అది పూర్తయి తెలంగాణలో టీడీపీ పూర్తిస్థాయిలో సిద్ధమయిన తక్షణమే టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక చేస్తాం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నాం’’ అని తెలిపారాయన. కాగా ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా టీడీపీ బలోపేతం కోసం అంతా కలిసికట్టుగా పనచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల కోసం ఐకమత్యంతో పనిచేయాలన్నారు.